20 ఏళ్ల తర్వాత చెరువులకు జలకళ
చిన్నశంకరంపేట: ఇరవై ఏళ్ల తరువాత చెరువులకు జలకళ రావడంతో చిన్నశంకరంపేట మండలంలోని ప్రజలు ఆనందంతో మునిగితేలుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో చిన్నశంకరంపేట మండలంలోని చెరువులు నిండుకుండలుగా మారాయి. చెరువులు నిండి అలుగులు పారుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు గంగమ్మకు పూజలు నిర్వహిస్తు ముందుకు సాగుతున్నారు.
చిన్నశంకరంపేట మండలంలోని చిన్నశంకరంపేట పాత చెరువు ఇరవై ఏళ్ల క్రితం నిండిందంటే మళ్లీ ఇప్పుడే నిండిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని శేరిపల్లి, చందంపేట, సూరారం గ్రామాల చెరువులు నాలుగేళ్ల క్రితం నిండినప్పటికీ అలుగు మాత్రం పారలేదు.ఈ సారి మాత్రం చెరువులు నిండి అలుగులు పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. జప్తిశివనూర్, సంకాపూర్, ఖాజాపూర్, మందాపూర్, గవ్వలపల్లి, జంగరాయి, ధరిపల్లి, కామారం గ్రామాల చెరువులు నిండిపొంగిపోర్లుతున్నాయి.
రికార్డు స్థాయిలో నిండిన చెరువులు
మండలంలో మునుపెన్నడు లేనిస్థాయిలో 21 సె.మీ.వర్షం కురువడంతో రికార్డు స్థాయిలో చెరువులు నిండాయి. ఉదయం నుంచిచెరు వు కట్టలపైనే ఉన్న ప్రజలు చూస్తుండగానే చెరువులు నిండి అలుగులు పొంగిపొర్లడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రుద్రారం చెరువు శుక్రవారం ఉదయం 8 గంటలవరకే నిండిపొంగిపోర్లగా, సూరారం పెద్ద చెరువుతో పాటు మరో మూడు చెరువులు ఉదయం 9 గంటల వరకు నిండాయి.
మధ్యాహ్నం 12 గంటల వరకు మండలంలోని శేరిపల్లి, ధరిపల్లి, జప్తిశివనూర్, కామారం గ్రామాల చెరువులు నిండిపోయాయి. ఏన్నో ఏళ్లుగా చూస్తున్న తమకు ఇలా గంటల వ్యవధిలో చెరువులు నిండిన సంఘటనలు లేవని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా నిండని పెద్ద చెరువు
మండలంలో పెద్దచెరువుగా గుర్తిపు ఉన్న అంబాజిపేట పెద్ద చెరువు ఇంక నిండలేదు.ఇందులో నీటి మట్టం 21 అడుగులు కాగా,శనివారం సాయంత్రం వరకు 13 అడుగుల నీటి మట్టం చేరాయి. ఈ చెరువు నిండితే ఏగు గ్రామాలలోని 930 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది.
ఈ చెరువు పరిధిలో చిన్నశంకరంపేట, అంబాజిపేట,ఆగ్రహరం, గవ్వలపల్లి, మల్లుపల్లి, చందాపూర్, జంగరాయి గ్రామాల పరిధిలోని రైతుల పొలాలు పారనున్నాయి.మండలంలోని శాలిపేట నల్లచెరువు, మిర్జాపల్లి పించెరువు ఇంకా నిండాలేదు. చిన్నశంకరంపేట పాత చెరువులో కూడా మరో రెండు అడుగుల నీరు చేరితేనే అలుగు పారుతుంది.