lalith modhi
-
ఆ దొంగల పేరు చివర మోదీ
డెహ్రాడూన్: ప్రధాని మోదీ దేశంలోని మిగతా మోదీలకు కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రచార కార్యక్రమాన్ని శనివారం ఉత్తరాఖండ్‌లో రాహుల్ ప్రారంభించారు. ఈ దొంగలందరికీ పేరు చివర మోదీ అనిఉండటం ఒక ఎత్తు అయితే అందులో నుంచి ఒక మోదీ మిగతా మోదీలకు ఎందుకు దోచిపెడుతున్నారని ప్రశ్నించారు. తన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో నిందితుడు నీరవ్ మోదీ, ఐపీఎల్ స్కామ్ నిందితుడు లలిత్ మోదీలు ఉన్నారన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకుని వారు తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. కాపలాదారే దొంగ అయ్యాడని (చౌకీదార్ చోర్ హై) రాహుల్ విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 15–20 మందికి మాత్రమే కోట్ల రూపాయలు ఇచ్చారని, రైతులు, నిరుద్యోగుల సంక్షేమానికి ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో అదానీ గ్రూప్ వ్యాపార సంస్థలకు భూమిని దోచిపెట్టారని విమర్శించారు. పేదలకు ఆర్థిక భరోసా.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదలకు ఆర్థిక భద్రత కల్పనలో భాగంగా కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెడతామని రాహుల్ గాంధీ హామీనిచ్చారు. ఇందులోభాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన మొదటి దేశంగా భారత్ నిలుస్తుందన్నారు. అప్పుడు కెమెరాలకు పోజ్‌లిస్తున్నారు... జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కెమెరాలకు పోజ్‌లిస్తున్నారని విమర్శించారు. పుల్వామా దాడి జరిగిన వెంటనే తాను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నానని, కానీ మోదీ మాత్రం మూడున్నర గంటలపాటు నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ షూటింగ్లో ఫొటోలకు పోజులిచ్చారని పేర్కొన్నారు. -
ఆ ఇద్దరిదీ కచ్చితంగా తప్పే!
లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మ, రాజేలు తప్పు చేశారన్న బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు ఐపీఎల్ స్కామ్‌స్టర్, పరారీలో ఉన్న నిందితుడైన లలిత్ మోదీ విదేశాల్లో తలదాచుకునేందుకు సహకరించడం కచ్చితంగా తప్పేనని బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘అది చట్టపరంగా, నైతికంగా తప్పే. ఎవరైనా సరె.. పరారీలో ఉన్న నిందితుడ్ని కలవడం, అతడికి సహకరించడం కచ్చితంగా పొరపాటే’ అని ఈ హోంశాఖ మాజీ కార్యదర్శి తేల్చి చెప్పారు. లలిత్‌ను భారత్‌కు రప్పించి, చట్టం ముందు నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. లలిత్ విషయంలో సుష్మ, రాజేలు తప్పేం చేయలేదంటూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సమర్ధిస్తున్న సమయంలో ఆర్కే సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు చెందిన కంపెనీకి లలిత్ మోదీ రుణం ఇవ్వడాన్ని తాను ‘సాధారణ వ్యాపారపరమైన లావాదేవీ’గానే అభివర్ణించడంపై దుమారం లేవడంతో స్టాన్ఫర్డ్లోలో ఉన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నష్టనివారణ ప్రారంభించారు. తానా మాట అనలేదని అన్నారు. లలిత్ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు జరుపుతున్న సంస్థలు.. ఆ లావాదేవీపైనా విచారణ జరుపుతాయని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ నియంత్రణలో ఉండే ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ పనితీరును ప్రభావితం చేసేలా జైట్లీ మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. -
అవినీతికి పాల్పడరు సరే... సహిస్తారా?
అవినీతికి పాల్పడను, సహచరులను పాల్పడనీయను అంటూ ఎన్నికల ప్రచారంలో నొక్కి చెప్పిన ప్రధాని నరేంద్రమోదీకి తొలిపరీక్ష ఎదురయింది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి రహస్య ప్రయోజనాలు కలిగించిన వివాదంలో పాత్ర ఉన్న సుష్మాస్వరాజ్, వసుంధరారాజే విషయంలో మోదీ కిమ్మనకుండా ఉండటం ఆయన వాగ్దానానికి భంగం కలిగించేలా ఉంది. ‘నేను అవినీతికి పాల్పడను, ఎవరినైనా అవినీతికి పాల్పడటాన్ని అనుమతిం చను’. ఇది ప్రధాని నరేంద్రమోదీ గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వాగ్దానం. బీజేపీ ప్రచార కార్యక్రమంలో అవినీతి నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. వ్యక్తిగతంగా తాను అవినీతికి పాల్పడనని, తన చుట్టూ ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని అనుమతించనని మోదీ అప్పట్లో ఘనంగా చెప్పుకున్నారు. లంచగొండితనంకి సంబంధించి మోదీ వ్యక్తిగతంగా ప్రదర్శిస్తూ వచ్చిన ఈ చిత్తశుద్ధి పట్ల నాకు ఎలాంటి సందేహమూ లేదు. వ్యక్తిగా మోదీ నాకు సుపరి చితులే. చట్టాలను అతిక్రమించడం లేదా ధిక్కరించడం లేక ఏదైనా పని చేసి పెట్టినందుకు ప్రతిఫలం స్వీకరించడం గానీ చేసేటటువంటి వ్యక్తిగా మోదీని నేను ఎన్నడూ చూడలేదు. అదేసమయంలో ఇతర ప్రధానుల గురించి కూడా నేను ఇలాగే చెప్పగలను. మన్మోహన్సింగ్ అవినీతిపరుడని నేను భావించడం లేదు. ఈ విషయంలో ఆయన కోర్టు కేసును ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రత్యర్థులు కూడా ఆయనను నిజాయితీపరుడిగానే తప్ప మరోలాగా భావించలేరు. అలాగే నాకు తెలిసినంతవరకు అటల్ బిహారీ వాజపేయి లేదా ఐకే గుజ్రాల్ కానీ, మరికాస్త వెనక్కు వెళ్లి చూసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ లేదా గుల్జారీ లాల్ నందా కానీ వ్యక్తిగత అవినీతికి పాల్పడిన సందర్భం లేదు. ఈ అంశానికి సంబంధించి వీరంతా కాస్త పై మెట్టులోనే ఉండేవారు. కాబట్టి మోదీ నేను లంచం ముట్టను అని చేసిన ప్రకటన నిజంగా వాస్తవమే అయినప్పటికీ, వెనుకటి ఉదాహరణల కారణంగా ఏమంత అర్థవంతమైనదిగా లేదు. నేను లంచం ముట్టను అంటూ ఆయన చేసిన వాగ్దానం ఆసక్తికరమైనది. దీనికి రెండు కోణాలున్నాయి. మొదటిది సుస్పష్టంగా ప్రతిరోజూ జరిగే అవినీతిని ప్రస్తావిస్తూనే ఉంటుంది. అంటే పౌరుల నుంచి గుంజుకునేది (డ్రైవింగ్ లెసై న్సులు లేదా భూ రికార్డులు వగైరాల ద్వారా) లేదా ఖర్చులను, అసౌకర్యాన్ని తప్పించుకోవడానికి పౌరులు స్వచ్ఛందంగా సమర్పించుకోవడం వంటివి. అయితే ఇది సాంస్కృతికపరమైన అంశం. చట్టం లేదా పాలన ద్వారా మాత్రమే దీన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవచ్చు కాని కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అవినీతి అనేది మన సంస్కృతిలోనే ప్రవహిస్తున్నప్పుడు.. రోజువారీగా జరిగే అవినీతిని పారదోలుతానంటూ ఏ ప్రధానమంత్రయినా పేర్కొనడం వాస్తవి కతను ప్రతిబింబించదు. కాగా, అవినీతిని పూర్తిగా తనకు తానే నిర్మూలిస్తానని ఒక నాయకుడు ప్రకటించుకోవడం తెలివైన పని కాదన్నదే వాస్తవం కావచ్చు. ఇది ‘అవినీతిని అనుమతించను’ అనే రెండో అంశంవైపునకు మనల్ని తీసుకెళుతుంది. తన మంత్రులను అవినీతికి పాల్పడనీయబోనని మోదీ నిర్దిష్టంగా పేర్కొన్నదాన్ని ఇప్పుడు అంచనా వేద్దాం. తనకు ముందు పలువురు ప్రధానమంత్రులు ఈ విషయంలో విఫలమయ్యారు కాబట్టి మోదీ చేసిన రెండో ప్రకటన కాస్త సమంజసమైనదిగానే కనిపించవచ్చు. ప్రత్యేకించి తన మంత్రివర్గ సహచరులలో పలువురిపై మన్మోహన్ సింగ్‌కు ఏమంత నియంత్రణ ఉండేది కాదు. చివరకు వాజపేయి కూడా ఈ విషయంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ రెండు సందర్భాల్లో పరిస్థితి విభిన్నమైనది. ఎందుకంటే మన్మోహన్, వాజపేయి మైనారిటీ ప్రభుత్వాలను నిర్వహించారు. తమ మిత్రపక్షాలను వారు క్రమశిక్షణలో ఉంచగలిగేవారు కారు. అలాగని దాన్ని సమర్థించలేము. దీన్ని నేను అంగీకరిస్తాను. తన మంత్రివర్గంపై అవినీతి ఆరోపణ వచ్చిన సందర్భంలో మోదీ ఏం చేసేవారు? దీనికి సంబంధించి ఆయనకు ఈ నెలలో ఒక అవకాశం ఎదురైంది. అయితే ఇంతవరకు అయన చేసిందేమీ లేదు. విదేశీ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రవర్తనను మోదీ వ్యక్తిగతంగా సమర్థించలేకపోయారు. అదే సమయంలో తన మంత్రివర్గ సహచరులను అవినీతికి పాల్పడనీయను అంటూ గతంలో చేసిన వాగ్దానం ఏమైందని ఆయన జాతికి వివరించలేదు కూడా. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే చర్యలను (ఇరువురూ ఐపీఎల్ వ్యవస్థాపకుడు, దేశంవిడిచి పారిపోయిన లలిత్ మోదీకి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు) అతి చిన్నవిగా భావించి రద్దు చేయబూనడం నా ఉద్దేశంలో సరైంది కాదు. ఇలాంటి కుంభకోణంలో చిక్కుకుని విదేశీమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ నాగరిక ప్రజాస్వా మ్యంలోనూ తప్పించుకోజాలరు. ప్రభుత్వం లలిత్ మోదీకి కల్పించిన రహస్య సౌకర్యాలు, తన పట్ల వ్యవహరించిన తీరు (అతడు దేశం నుంచి తప్పించుకునేలా చేయడం), నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ అంశంలో జోక్యం చేసుకోవడం, కేంద్ర మంత్రి వ్యవహారం వంటి అంశాలపై తీవ్రమైన, సవాలు చేయలేని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని వాస్తవ విరుద్ధమనీ, చిన్న అంశమనీ భావించి పక్కన పెట్టడానికి వీల్లేనంత తీవ్రంగా ఉపకారం పొందడం, డబ్బు అనేవి దీనిలో చోటు చేసుకుని ఉన్నాయి. లలిత్ మోదీ నుంచి సుష్మా స్వరాజ్ పొందిన ప్రతిఫలంలో ఎలాంటి నగదూ చేతులు మారలేదు కాబట్టి ఆమె తన మంత్రిపదవిలో కొనసాగ వచ్చని ఒక సమర్థన ఉంది. (సుష్మా బంధువు ఒకరికి లలిత్ మోదీ ఓ ఖరీదైన కాలేజీలో సీటు ఇప్పించారు, ఆమె భర్త.. లలిత్ మోదీ వ్యక్తిగత న్యాయవాది). లలిత్ మోదీని వెనక్కు రప్పించడానికి భారత్ ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం తరపున బహిరంగంగా ప్రకటిస్తూనే మరోవైపు తనని పోర్చుగల్ నుంచి ఇంగ్లండ్‌కు ప్రయాణించడాన్ని రహస్యంగా అనుమతించడం అనేది ఏ రకంగా చూసినా మామూలు విషయమేమీ కాదు. అందుకే ఈ అంశానికి సంబంధించినంతవరరూ, ప్రధానమంత్రి గతంలో చేసిన వాగ్దానాన్ని మరోసారి పరిశీలించడమే సబబుగా ఉంటుంది. అవినీతిని తన దరికి చేరనీయనని మోదీ అప్పట్లో గట్టి హామీ ఇచ్చారు మరి. ఇంతకూ అవినీతి అనగానేమి? మనం దాన్ని లంచం తీసుకోవడమని తరచుగా భావిస్తుంటాం. ఆ అర్థంలో అది సరైందే కావచ్చు కానీ ఈ వ్యవహా రంలో అవినీతికి పాల్పడుతున్నది ప్రభుత్వ కార్యాలయం. ఈ పదానికి ఇదే సరైన అర్థం. ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తమ శాఖను లేదా ఆఫీసును అవినీతిమయం చేశారన్న ఆరోపణకు గురయ్యారు. ప్రధానమంత్రి వారిని తమ పదవుల్లో కొనసాగనిస్తే, అవినీతిపై తను చేసిన వాగ్దానానికి ఆయన భంగం కలిగించినవారవుతారు. వ్యక్తిగతంగా చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా నేటికీ అత్యున్నత గౌరవాన్ని అందుకుంటున్న ప్రధాని అలా చేసినట్లయితే ఆయన మాటలకు కూడా అర్థం ఇదే కాబోలని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) - ఆకార్ పటేల్ -
లలిత్ మోదీ రాయని డైరీ
- మాధవ్ శింగరాజు మాంటెనెగ్రోలో నా కుటుంబ విహారం ఉల్లాసంగా సాగుతోంది. మాంటెనెగ్రో అంటే బ్లాక్ మౌంటేన్ అని అర్థమట! మా గైడ్ చెబుతుంటే నవ్వొచ్చింది. ‘వాట్ సర్! నవ్వుతున్నారు?’ అన్నాడు. ‘ఏం లేదు’ అన్నాను. బ్లాక్ మౌంటేన్ అనగానే నాకు బ్లాక్ మనీ అనే మాట గుర్తుకొచ్చింది. ఇండియాలో కాంగ్రెస్ నాయకులు నాలుగైదు రోజులుగా బీజేపీ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వంలోని సుష్మా స్వరాజ్ మీదా, ఆ పార్టీలోని వసుంధరా రాజే మీదా దుమ్మెత్తిపోస్తున్నారు... నా దగ్గరేదో బ్లాక్ మనీ ఉందనీ, దాన్ని వీళ్లంతా భద్రంగా లాకర్లో దాచి, తాళం చెవుల్ని ప్రధాని మోదీ దగ్గర ఉంచారని! ఇప్పుడు నేను మాంటెనెగ్రోలో ఉన్నాను కదా, ఇక్కడిక్కూడా నేను మరికొంత బ్లాక్ మనీ దాచేందుకో, లేదా దాచింది తీసేందుకో వచ్చి ఉంటానని కాంగ్రెస్ అండ్ కో అనుకుంటుందేమో! అందుకే నవ్వొచ్చింది. ఖరీదైన పూలరంగడినని కాంగ్రెస్ ప్రముఖులంతా కలసి నాకో పేరు పెట్టారు. మళ్లీ నవ్వొస్తోంది. అల్పమైన విషయాలను వీళ్లెందుకు అతి ముఖ్యమైన వ్యవహారంలా మాట్లాడుకుంటున్నారు! ఆఫ్ట్రాల్ 700 కోట్లు. అదొక అమౌంటు. అదొక స్కాము! స్కామ్ అన్నమాటకే సిగ్గు చేటు. కేసుల్ని తప్పించుకోడానికి నేను బ్రిటన్ పారిపోయి వచ్చానట! హౌ సిల్లీ. అదే నిజమైతే బీజేపీ పవర్లోకి రాగానే నేను ఇండియా వెళ్లకపోయేవాడినా? బ్రిటన్‌లోనైనా ఈ ఐదేళ్లలో ఒక్కరోజు కూడా నేను ఉన్నచోట ఉన్నది లేదు. అసలు ఒకేచోట ఉండడంలో, ఒకేలా ఉండడంలో లైఫ్ ఉండదని చెప్పడానికి కాంగ్రెస్ లీడర్లందర్నీ ఒకసారి నా సొంత ఖర్చులతో ఐరోపా అంతా తిప్పి చూపించాలనిపిస్తోంది. అప్పుడు కూడా ముందు మాంటెనెగ్రోనే చూద్దామంటారేమో! ఆ కొండప్రాంతపు ఎగుడు దిగుడు దిబ్బల్లో నల్లడబ్బేమైనా గాలికి ఎగురుకుంటూ కనిపిస్తుందేమోనని. ఒకవేళ కనిపించినా ఆ కరెన్సీపై నా ముఖచిత్రం ఎందుకుంటుంది? చిదంబరమైతే మరీ రెచ్చిపోతున్నాడు. ఆయన్నొకసారి ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని ఇటాలియన్ రివియెరా తీరప్రాంతానికి తీసుకెళ్లి ఘనమైన ఆతిథ్యం ఇవ్వాలి. అంతకన్నా ముందు థాయ్ వర్షారణ్య ద్వీపపు ఒడ్డు ఉన్న ఫకెట్ రిసార్ట్‌లో బాడీ మసాజ్ చేయించాలి. అప్పుడుగానీ నా పాస్‌పోర్ట్ గురించి ప్రెస్మీట్లు పెట్టడం మానడు. ఇండియా నుంచి వార్తలు వస్తున్నాయి. నాతో పరిచయం ఉన్నవారందర్నీ కార్నర్ చేస్తున్నారని. పరిచయాల్లేకుండా ఎలా ఉంటాయి? ఐపీఎల్ అంటే ఆ పదకొండు మంది ప్లేయర్లు, బోర్డులో ఉండే ఆ నలుగురైదుగురు పెద్ద మనుషులేనా! ఆట చూసే ప్రతి ఒక్కరూ ఐపీఎల్లో మెంబరే. అలా నేను కోట్లాదిమందికి పరిచయస్తుడినే. అలాగని చెప్పి అన్ని కోట్లమందికీ బ్లూ కార్నర్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తూ పోతుంటారా?! -
కలవారిపై ‘కారుణ్యం’... కదల్లేని ఆచార్యుడిపై ‘కాఠిన్యం’
అతడు పొట్టి క్రికెట్ ట్వం టీ-ట్వంటీకి తెరలేపి అంతర్జాతీయంగా క్రికెట్ మార్కెట్‌ను అమాంతంగా పైకి లేపిన గడుసరి. కానీ 7 వందల కోట్ల రూపాయల క్రికెట్ కుంభకోణంలో చిక్కుకుని దేశం విడిచి పారిపోయాడు. మనిషి ఎంత వంచన చేసినా, ఎంత పెద్ద కుంభకోణంలో భాగమై అడ్డంగా ఇరుక్కున్నా, వ్యక్తిగత అంశాల్లో సహాయం కోసం ఆపన్నహస్తాలను పట్టుకోవడం తప్పు కాదన్నది మానవత్వ పరిధిలో సమర్థనీయమే కావచ్చు. ఆ మానవతా దృక్పథంతోటే విదేశాంగ మంత్రి పదవిలో ఉన్న మన చిన్నమ్మ సుష్మా స్వరాజ్ లలిత్ మోదీపై కాసింత కరుణ చూపారు. ఆయన భార్య అనారోగ్యం పాలైనందున చికిత్స కోసం లండన్ నుంచి పోర్చుగల్ వెళ్లడానికి ఆమె కాస్త కారుణ్యం చూపి మోదీని అనుమతించడంపై బ్రిటిష్ ప్రభుత్వానికి స్వయంగా సిఫార్సు చేశారు. కానీ ఈ కారుణ్యం ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ఉచ్చులో చిక్కుకున్న బడా మోసగాడికే ఎందుకు పరిమితం అవుతోందన్నది ప్రస్తుత ప్రశ్న. ఒక వంచకుడి వ్యక్తిగత సమస్య పరి ష్కారంలో కాసింత సానుభూతి ప్రద ర్శించిన చిన్నమ్మ సుష్మ, 80 శాతం అవయవాలు కదల్లేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితమై ఏడాదిగా నాగ పూర్ సెంట్రల్ జైలులో మగ్గుతున్న డా.జి.ఎన్. సాయిబాబా పట్ల ‘కరుణ’ చూపకపోవడంలో మతలబు ఏమిటి? నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అనారోగ్యం పాలవు తూ జైల్లో తీవ్ర ఇబ్బంది పడుతున్నా, కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు కేంద్రప్రభుత్వ పెద్దల చు ట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా.. పాలకులకు మానవతా దృక్పథం చూపాలనిపించడం లేదు. అవినీతి కుంభ కోణంలో నిండా మునిగిన లలిత్ మోదీ లండన్‌లో ఏలినవారి దయతో సకల సదుపాయాలతో విలాస జీవితం గడుపుతున్నాడు. కానీ సైద్ధాంతిక విశ్వా సాన్ని అంటిపెట్టుకున్న నిస్సహాయుడిని నాగ్‌పూర్ జైల్లో అండాసెల్‌లో కుక్కారు. ఢిల్లీ విశ్వవిద్యాల యంలో పొట్టకూటికి పనిచేస్తున్న ఆచార్యుడిపై ఇంత కాఠిన్యమేల? మోదీపై అంతటి కారుణ్యం ఎందుకు అనేది ఎక్కడా చర్చకు రాదు. డా. సాయిబాబా అనారోగ్య పరిస్థితిని ఏడుగురు ఎంపీలు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినా ఎం దుకో ఆయనకూ కారుణ్యం కలగ లేదు. ఒకవైపు కుంభకోణాల ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తారు. డా.జి.ఎన్. సాయిబాబా వంటి ఆచా ర్యులకు కనీస వైద్య సదుపాయాలు అందించరు. చివరకు ముంబైపై ఉగ్రవాద దాడి కేసులో కసబ్‌కు వందల కోట్ల రూపాయలను వైద్యం, భద్రత పేరిట ఖర్చుచేసి ఉరిశిక్ష అమలు చేశారు. అదే జైల్లో సాయి బాబా అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడే అవకాశమే లేదు. ఆయనకు అవసరమైన మందులు జైల్లో అందడం లేదు. పోర్చుగల్‌లో ఉన్న మోదీ భార్య ఆపరేషన్ విష యంలో దయ కలిగిన వారికి స్వదేశంలో పలు అనా రోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న డాక్టర్ సాయి బాబాపై దాక్షిణ్యం కలగలేదు. కరుణకూ వర్గ స్వభావం ఉందంటే ఇదేనేమో? హృద్రోగం, కాలే యం, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మూడు చక్రాల సైకిల్లో ఉంటూ, ఒకరి సహాయం లేనిదే కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని డా. సాయిబాబా చేసిన నేరం ఏమిటి? ఆయనపై ఇంత కాఠిన్యం ఎందుకు? సంపన్న వర్గాలపై మానవతా దృష్టి చూపిస్తూ సామాన్యుల పట్ల పరమ కాఠిన్యం ప్రదర్శిస్తే ప్రజాస్వామ్యంలో విలువలు ప్రశ్నార్థకం కావా? సంవత్సర కాలంగా నాగ్‌పూర్ జైలులో మగ్గు తున్న జి.ఎన్.సాయిబాబాను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం జైలు బయటకు పాలకులు తీసుకువస్తా రని, కనీసం గృహ నిర్బంధంలో ఉంచైనా వైద్యం అందిస్తారని ఆశిద్దాం. (వ్యాసకర్త శాసనసభ్యులు, దుబ్బాక నియోజకవర్గం) మొబైల్: 94403 80141 - సోలిపేట రామలింగారెడ్డి