అవినీతికి పాల్పడరు సరే... సహిస్తారా?
అవినీతికి పాల్పడను, సహచరులను పాల్పడనీయను అంటూ ఎన్నికల ప్రచారంలో నొక్కి చెప్పిన ప్రధాని నరేంద్రమోదీకి తొలిపరీక్ష ఎదురయింది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి రహస్య ప్రయోజనాలు కలిగించిన వివాదంలో పాత్ర ఉన్న సుష్మాస్వరాజ్, వసుంధరారాజే విషయంలో మోదీ కిమ్మనకుండా ఉండటం ఆయన వాగ్దానానికి భంగం కలిగించేలా ఉంది.
‘నేను అవినీతికి పాల్పడను, ఎవరినైనా అవినీతికి పాల్పడటాన్ని అనుమతిం చను’. ఇది ప్రధాని నరేంద్రమోదీ గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వాగ్దానం. బీజేపీ ప్రచార కార్యక్రమంలో అవినీతి నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. వ్యక్తిగతంగా తాను అవినీతికి పాల్పడనని, తన చుట్టూ ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని అనుమతించనని మోదీ అప్పట్లో ఘనంగా చెప్పుకున్నారు. లంచగొండితనంకి సంబంధించి మోదీ వ్యక్తిగతంగా ప్రదర్శిస్తూ వచ్చిన ఈ చిత్తశుద్ధి పట్ల నాకు ఎలాంటి సందేహమూ లేదు. వ్యక్తిగా మోదీ నాకు సుపరి చితులే. చట్టాలను అతిక్రమించడం లేదా ధిక్కరించడం లేక ఏదైనా పని చేసి పెట్టినందుకు ప్రతిఫలం స్వీకరించడం గానీ చేసేటటువంటి వ్యక్తిగా మోదీని నేను ఎన్నడూ చూడలేదు.
అదేసమయంలో ఇతర ప్రధానుల గురించి కూడా నేను ఇలాగే చెప్పగలను. మన్మోహన్‌సింగ్ అవినీతిపరుడని నేను భావించడం లేదు. ఈ విషయంలో ఆయన కోర్టు కేసును ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రత్యర్థులు కూడా ఆయనను నిజాయితీపరుడిగానే తప్ప మరోలాగా భావించలేరు. అలాగే నాకు తెలిసినంతవరకు అటల్ బిహారీ వాజపేయి లేదా ఐకే గుజ్రాల్ కానీ, మరికాస్త వెనక్కు వెళ్లి చూసినప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ లేదా గుల్జారీ లాల్ నందా కానీ వ్యక్తిగత అవినీతికి పాల్పడిన సందర్భం లేదు. ఈ అంశానికి సంబంధించి వీరంతా కాస్త పై మెట్టులోనే ఉండేవారు.
కాబట్టి మోదీ నేను లంచం ముట్టను అని చేసిన ప్రకటన నిజంగా వాస్తవమే అయినప్పటికీ, వెనుకటి ఉదాహరణల కారణంగా ఏమంత అర్థవంతమైనదిగా లేదు. నేను లంచం ముట్టను అంటూ ఆయన చేసిన వాగ్దానం ఆసక్తికరమైనది. దీనికి రెండు కోణాలున్నాయి. మొదటిది సుస్పష్టంగా ప్రతిరోజూ జరిగే అవినీతిని ప్రస్తావిస్తూనే ఉంటుంది. అంటే పౌరుల నుంచి గుంజుకునేది (డ్రైవింగ్ లెసై న్సులు లేదా భూ రికార్డులు వగైరాల ద్వారా) లేదా ఖర్చులను, అసౌకర్యాన్ని తప్పించుకోవడానికి పౌరులు స్వచ్ఛందంగా సమర్పించుకోవడం వంటివి. అయితే ఇది సాంస్కృతికపరమైన అంశం. చట్టం లేదా పాలన ద్వారా మాత్రమే దీన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవచ్చు కాని కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అవినీతి అనేది మన సంస్కృతిలోనే ప్రవహిస్తున్నప్పుడు.. రోజువారీగా జరిగే అవినీతిని పారదోలుతానంటూ ఏ ప్రధానమంత్రయినా పేర్కొనడం వాస్తవి కతను ప్రతిబింబించదు. కాగా, అవినీతిని పూర్తిగా తనకు తానే నిర్మూలిస్తానని ఒక నాయకుడు ప్రకటించుకోవడం తెలివైన పని కాదన్నదే వాస్తవం కావచ్చు.
ఇది ‘అవినీతిని అనుమతించను’ అనే రెండో అంశంవైపునకు మనల్ని తీసుకెళుతుంది. తన మంత్రులను అవినీతికి పాల్పడనీయబోనని మోదీ నిర్దిష్టంగా పేర్కొన్నదాన్ని ఇప్పుడు అంచనా వేద్దాం. తనకు ముందు పలువురు ప్రధానమంత్రులు ఈ విషయంలో విఫలమయ్యారు కాబట్టి మోదీ చేసిన రెండో ప్రకటన కాస్త సమంజసమైనదిగానే కనిపించవచ్చు. ప్రత్యేకించి తన మంత్రివర్గ సహచరులలో పలువురిపై మన్మోహన్ సింగ్‌కు ఏమంత నియంత్రణ ఉండేది కాదు. చివరకు వాజపేయి కూడా ఈ విషయంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ రెండు సందర్భాల్లో పరిస్థితి విభిన్నమైనది. ఎందుకంటే మన్మోహన్, వాజపేయి మైనారిటీ ప్రభుత్వాలను నిర్వహించారు. తమ మిత్రపక్షాలను వారు క్రమశిక్షణలో ఉంచగలిగేవారు కారు. అలాగని దాన్ని సమర్థించలేము. దీన్ని నేను అంగీకరిస్తాను.
తన మంత్రివర్గంపై అవినీతి ఆరోపణ వచ్చిన సందర్భంలో మోదీ ఏం చేసేవారు? దీనికి సంబంధించి ఆయనకు ఈ నెలలో ఒక అవకాశం ఎదురైంది. అయితే ఇంతవరకు అయన చేసిందేమీ లేదు. విదేశీ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రవర్తనను మోదీ వ్యక్తిగతంగా సమర్థించలేకపోయారు. అదే సమయంలో తన మంత్రివర్గ సహచరులను అవినీతికి పాల్పడనీయను అంటూ గతంలో చేసిన వాగ్దానం ఏమైందని ఆయన జాతికి వివరించలేదు కూడా. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే చర్యలను (ఇరువురూ ఐపీఎల్ వ్యవస్థాపకుడు, దేశంవిడిచి పారిపోయిన లలిత్ మోదీకి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు) అతి చిన్నవిగా భావించి రద్దు చేయబూనడం నా ఉద్దేశంలో సరైంది కాదు. ఇలాంటి కుంభకోణంలో చిక్కుకుని విదేశీమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ నాగరిక ప్రజాస్వా మ్యంలోనూ తప్పించుకోజాలరు. ప్రభుత్వం లలిత్ మోదీకి కల్పించిన రహస్య సౌకర్యాలు, తన పట్ల వ్యవహరించిన తీరు (అతడు దేశం నుంచి తప్పించుకునేలా చేయడం), నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ అంశంలో జోక్యం చేసుకోవడం, కేంద్ర మంత్రి వ్యవహారం వంటి అంశాలపై తీవ్రమైన, సవాలు చేయలేని ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారాన్ని వాస్తవ విరుద్ధమనీ, చిన్న అంశమనీ భావించి పక్కన పెట్టడానికి వీల్లేనంత తీవ్రంగా ఉపకారం పొందడం, డబ్బు అనేవి దీనిలో చోటు చేసుకుని ఉన్నాయి. లలిత్ మోదీ నుంచి సుష్మా స్వరాజ్ పొందిన ప్రతిఫలంలో ఎలాంటి నగదూ చేతులు మారలేదు కాబట్టి ఆమె తన మంత్రిపదవిలో కొనసాగ వచ్చని ఒక సమర్థన ఉంది. (సుష్మా బంధువు ఒకరికి లలిత్ మోదీ ఓ ఖరీదైన కాలేజీలో సీటు ఇప్పించారు, ఆమె భర్త.. లలిత్ మోదీ వ్యక్తిగత న్యాయవాది). లలిత్ మోదీని వెనక్కు రప్పించడానికి భారత్ ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం తరపున బహిరంగంగా ప్రకటిస్తూనే మరోవైపు తనని పోర్చుగల్ నుంచి ఇంగ్లండ్‌కు ప్రయాణించడాన్ని రహస్యంగా అనుమతించడం అనేది ఏ రకంగా చూసినా మామూలు విషయమేమీ కాదు. అందుకే ఈ అంశానికి సంబంధించినంతవరరూ, ప్రధానమంత్రి గతంలో చేసిన వాగ్దానాన్ని మరోసారి పరిశీలించడమే సబబుగా ఉంటుంది. అవినీతిని తన దరికి చేరనీయనని మోదీ అప్పట్లో గట్టి హామీ ఇచ్చారు మరి. ఇంతకూ అవినీతి అనగానేమి? మనం దాన్ని లంచం తీసుకోవడమని తరచుగా భావిస్తుంటాం.
ఆ అర్థంలో అది సరైందే కావచ్చు కానీ ఈ వ్యవహా రంలో అవినీతికి పాల్పడుతున్నది ప్రభుత్వ కార్యాలయం. ఈ పదానికి ఇదే సరైన అర్థం. ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తమ శాఖను లేదా ఆఫీసును అవినీతిమయం చేశారన్న ఆరోపణకు గురయ్యారు. ప్రధానమంత్రి వారిని తమ పదవుల్లో కొనసాగనిస్తే, అవినీతిపై తను చేసిన వాగ్దానానికి ఆయన భంగం కలిగించినవారవుతారు. వ్యక్తిగతంగా చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా నేటికీ అత్యున్నత గౌరవాన్ని అందుకుంటున్న ప్రధాని అలా చేసినట్లయితే ఆయన మాటలకు కూడా అర్థం ఇదే కాబోలని నాకు ఆశ్చర్యం కలుగుతుంది.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)
- ఆకార్ పటేల్