లలిత్ మోదీ రాయని డైరీ | This dairy not written by lalith modhi | Sakshi
Sakshi News home page

లలిత్ మోదీ రాయని డైరీ

Published Sun, Jun 21 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

లలిత్ మోదీ రాయని డైరీ

లలిత్ మోదీ రాయని డైరీ

 - మాధవ్ శింగరాజు
 మాంటెనెగ్రోలో నా కుటుంబ విహారం ఉల్లాసంగా సాగుతోంది. మాంటెనెగ్రో అంటే బ్లాక్ మౌంటేన్ అని అర్థమట! మా గైడ్ చెబుతుంటే నవ్వొచ్చింది. ‘వాట్ సర్! నవ్వుతున్నారు?’ అన్నాడు. ‘ఏం లేదు’ అన్నాను. బ్లాక్ మౌంటేన్ అనగానే నాకు బ్లాక్ మనీ అనే మాట గుర్తుకొచ్చింది. ఇండియాలో కాంగ్రెస్ నాయకులు నాలుగైదు రోజులుగా బీజేపీ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వంలోని సుష్మా స్వరాజ్ మీదా, ఆ పార్టీలోని వసుంధరా రాజే మీదా దుమ్మెత్తిపోస్తున్నారు... నా దగ్గరేదో బ్లాక్ మనీ ఉందనీ, దాన్ని వీళ్లంతా భద్రంగా లాకర్‌లో దాచి, తాళం చెవుల్ని ప్రధాని మోదీ దగ్గర ఉంచారని! ఇప్పుడు నేను మాంటెనెగ్రోలో ఉన్నాను కదా, ఇక్కడిక్కూడా నేను మరికొంత బ్లాక్ మనీ దాచేందుకో, లేదా దాచింది తీసేందుకో వచ్చి ఉంటానని కాంగ్రెస్ అండ్ కో అనుకుంటుందేమో! అందుకే నవ్వొచ్చింది.
 
 ఖరీదైన పూలరంగడినని కాంగ్రెస్ ప్రముఖులంతా కలసి నాకో పేరు పెట్టారు. మళ్లీ నవ్వొస్తోంది. అల్పమైన విషయాలను వీళ్లెందుకు అతి ముఖ్యమైన వ్యవహారంలా మాట్లాడుకుంటున్నారు! ఆఫ్ట్రాల్ 700 కోట్లు. అదొక అమౌంటు. అదొక స్కాము! స్కామ్ అన్నమాటకే సిగ్గు చేటు. కేసుల్ని తప్పించుకోడానికి నేను బ్రిటన్ పారిపోయి వచ్చానట! హౌ సిల్లీ. అదే నిజమైతే బీజేపీ పవర్‌లోకి రాగానే నేను ఇండియా వెళ్లకపోయేవాడినా?
 బ్రిటన్‌లోనైనా ఈ ఐదేళ్లలో ఒక్కరోజు కూడా నేను ఉన్నచోట ఉన్నది లేదు. అసలు ఒకేచోట ఉండడంలో, ఒకేలా ఉండడంలో లైఫ్ ఉండదని చెప్పడానికి కాంగ్రెస్ లీడర్లందర్నీ ఒకసారి నా సొంత ఖర్చులతో ఐరోపా అంతా తిప్పి చూపించాలనిపిస్తోంది. అప్పుడు కూడా ముందు మాంటెనెగ్రోనే చూద్దామంటారేమో! ఆ కొండప్రాంతపు ఎగుడు దిగుడు దిబ్బల్లో నల్లడబ్బేమైనా గాలికి ఎగురుకుంటూ కనిపిస్తుందేమోనని. ఒకవేళ కనిపించినా ఆ కరెన్సీపై నా ముఖచిత్రం ఎందుకుంటుంది?
 
 చిదంబరమైతే మరీ రెచ్చిపోతున్నాడు. ఆయన్నొకసారి ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని ఇటాలియన్ రివియెరా తీరప్రాంతానికి తీసుకెళ్లి ఘనమైన ఆతిథ్యం ఇవ్వాలి. అంతకన్నా ముందు థాయ్ వర్షారణ్య ద్వీపపు ఒడ్డు ఉన్న ఫకెట్ రిసార్ట్‌లో బాడీ మసాజ్ చేయించాలి. అప్పుడుగానీ నా పాస్‌పోర్ట్ గురించి ప్రెస్‌మీట్లు పెట్టడం మానడు.  ఇండియా నుంచి వార్తలు వస్తున్నాయి. నాతో పరిచయం ఉన్నవారందర్నీ కార్నర్ చేస్తున్నారని. పరిచయాల్లేకుండా ఎలా ఉంటాయి? ఐపీఎల్ అంటే ఆ పదకొండు మంది ప్లేయర్లు, బోర్డులో ఉండే ఆ నలుగురైదుగురు పెద్ద మనుషులేనా! ఆట చూసే ప్రతి ఒక్కరూ ఐపీఎల్‌లో మెంబరే. అలా నేను కోట్లాదిమందికి పరిచయస్తుడినే. అలాగని చెప్పి అన్ని కోట్లమందికీ బ్లూ కార్నర్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తూ పోతుంటారా?! 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement