Land prices rise
-
ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే..
సాక్షి, పుట్టపర్తి(సత్యసాయి జిల్లా): పుట్టపర్తి... సత్యసాయి నడయాడిన ప్రాంతం. ఆధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయంగా భాసిల్లిన ప్రదేశం. దేశవిదేశీ భక్తులతో కళకళలాడిన పట్టణం. ఇక్కడ సెంటు స్థలం రూ.లక్షల్లో పలికేది. కానీ సత్యసాయి భౌతికంగా దూరమయ్యాక ప్రాభవం తగ్గింది. విదేశీ అతిథుల రాక తగ్గగా వెలవెలబోయింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీసత్యసాయి పేరుతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇప్పుడు మళ్లీ కాంతులీనుతోంది. చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే? చుట్టూ కొండ ప్రాంతాలు. ఎటు చూసినా భూములు. ఓ వైపు చెరువు. మరో వైపు నది. ఇంకో వైపు గుట్టలు.. పుట్టపర్తి పేరు చెబితే కళ్లముందు కనిపించే దృశ్యమిది. అయితే పుట్టపర్తిని శ్రీ సత్యసాయి పేరుతో జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో స్వరూపమే మారిపోయింది. గతంలో సత్యసాయిబాబా భక్తులతో రద్దీగా కనిపించినా అభివృద్ధి ప్రశాంతి నిలయం వరకే పరిమితమైంది. సత్యసాయి శివైక్యం తర్వాత ప్రాభావం మసకబారుతూ వచ్చింది. కానీ జిల్లా కేంద్రం ప్రకటనతో అభివృద్ధి కొంతపుంతలు తొక్కుతోంది. రహదారుల వెంట అభివృద్ధి పరుగులు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. మామిళ్లకుంట వరకు నాలుగు లేన్ల మార్గం ఉండగా రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు విప్పుకుంది. బెంగళూరు వైపు పెడబల్లి వరకు.. ధర్మవరం వైపు కొత్త చెరువు వరకు భూములకు రేట్లు పెరిగాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోనే ఏపీఐఐసీ వంద ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. ప్రస్తుతం మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగడంతో ధరలు రెట్టింపు అయ్యాయి. ♦కొత్తచెరువు చుట్టూ రోడ్డు పక్కన సెంటు రూ.10 లక్షలు పలుకుతోంది. గతంలో ఇక్కడ రూ.4 లక్షలు మించి పలికేది కాదు. ♦మామిళ్లకుంట క్రాస్‌లో సెంటు రూ.10 లక్షలు పైగానే ఉంది. ఇక్కడ కూడా గతంలో సెంటు స్థలం రూ.3 లక్షలు మాత్రమే ఉండేది. ♦సూపర్ స్పెషాలిటీ చుట్టూ కిలోమీటరు మేర సెంటు ధర ప్రస్తుతం రూ.10 లక్షలు పలుకుతోంది. గతంలో సెంటు రూ.4 లక్షలు మించి పలికేది కాదు. ♦విమానాశ్రయం సమీపంలో భూములు డబుల్ రేటు పలుకుతున్నాయి. ప్రస్తుతం సెంటు రూ.15 లక్షల వరకూ పలుకుతోంది. అభివృద్ధికి సర్కారు అండ పుట్టపర్తి ప్రాంత వాసులు గతంలో వర్షాధార పంటలు మాత్రమే పండించే వారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళతో చాలామంది రైతుల భూముల్లో రెండో పంట పండిస్తున్నారు. అంతేకాకుండా బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీతో అందిస్తుండటంతో చాలా మంది భూములనే నమ్ముకుని సంతోషంగా జీవిస్తున్నారు. నీటి సౌకర్యం... దిగుబడులు బాగా పెరగడంతో పొలాల ధరలూ భారీగా పెరిగాయి. ఆయా గ్రామాల్లో ఎకరా రూ.కోటి వరకు ధర పలుకుతోంది. గతంలో అభివృద్ధి అంతా ఒకేవైపు.. గతంలో పుట్టపర్తి బస్టాండు చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి జరిగింది. ప్రశాంతి నిలయం ఉండటంతో అక్కడక్కడే పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి అనుకూలంగా అక్కడే నివాసాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో పుట్టపర్తి చుట్టూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎటు వైపు చూసినా భూముల ధరలు పెరిగాయి. దీనికి తోడు మున్సిపల్, పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూడా ఎత్తైన భవనాలకు బదులు విశాలమైన భవనాలను ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా పట్టణం నలువైపులా నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అద్దె ఇళ్లకూ డిమాండ్ జిల్లా కేంద్రంగా ప్రకటించడం.. ప్రభుత్వ కార్యాలయాలు తరలి రావడం.. ఉద్యోగులు చేరుకోవడంతో పాటు పలు వ్యాపారాల కోసం పుట్టపర్తికి వలస వచ్చేవారి సంఖ్య అధికమైంది. దీంతో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. గతేడాదిలో రూ.2 వేలకే ఇల్లు అద్దెకు దొరికేది. ప్రస్తుతం రూ.5 వేలు పెట్టినా సౌకర్యాలు అంతలా లేవు. అపార్ట్మెంట్లలో సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌కు రూ.5 వేలు, డబుల్ బెడ్రూం ఫ్లాట్‌కు రూ.10 వేల దాకా అద్దె ఇవ్వాల్సి వస్తోంది. అయినా ఖాళీగా ఉండే ఇళ్లు కనిపించడం లేదు. -
వీరి అవసరం..వారికి ఆదాయం
కర్నూలు(జిల్లా పరిషత్): భూముల ధరలు పెరగనుండడంతో జిల్లాలో రిజిస్ట్రేషన్లకు విశేష స్పందన వస్తోంది. రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. వీరి బలహీనతను ఆసరగా చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బందిమామూళ్లకు తెరలేపారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్టుగా ఉన్నా తెలియని తప్పులు చూపుతూ భారీగా దండుకుంటున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌పై కార్యాలయంలో రూ.20వేల నుంచి రూ.40వేల వరకు చేతులు మారుతున్నాయి. జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా మండల, మున్సిపాలిటీల పరిధిలోని సబ్రిజిస్టార్ల ప్రతిపాదనలను జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలోని కమిటీ పది రోజుల క్రితం ఆమోదించింది. జిల్లాలో 20 నుంచి 60 శాతం వరకు స్టాంప్ డ్యూటీ పెంచేసింది. 2013 ఏప్రిల్ ఒకటిన స్టాంప్ డ్యూటీని పెంచారు. మార్కెట్లో విక్రయిస్తున్న ధరల కంటే చెల్లిస్తున్న ధర తక్కువగా ఉందని, ఈ కారణంగా ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో రెండురోజుల్లో భూముల విలువలు పెరిగితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ భారం అధికమవుతుందన్న కారణంగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత వారంతో పోలిస్తే ఈ సోమవారం నుంచి రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జిల్లాలో 24 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో కర్నూలు, కల్లూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, మున్సిపాలిటీల పరిధిలో బుధ, గురువారాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు కర్నూలులో 272 రిజిస్ట్రేషన్లు జరగ్గా, 27 నుంచి 30వ తేదీ వరకు 490 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. అలాగే కల్లూరులో సోమవారం నుంచి గురువారం వరకు 458 రిజిస్ట్రేషన్లు జరిగాయి. పెరిగిన మామూళ్లు సందట్లో సడేమియా అన్నట్లు ప్రజల అవసరాన్ని, భయాన్ని ఆసరగా చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులు భారీగా మామూళ్ల మొత్తాన్ని పెంచేశారు. ఏదైనా భూమి, ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించాలంటే ముందుగా డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లాలి. డాక్యుమెంట్ చేయడానికి రూ.1000 నుంచి రూ.1500ల వరకు వసూలు చేస్తున్నారు. అయితే అనధికారికంగా కొంతమంది కీలక డాక్యుమెంట్ రైటర్లు దళారులుగా మారారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, స్థలం లిటికేషన్లో ఉందని చెబుతూ రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఫలితంగా డాక్యుమెంట్ రైటర్లు చెప్పిన మేరకు కాస్త అటూ ఇటూగా బేరమాడి మామూళ్లు ముట్టచెప్పి పని ముగించుకుంటున్నారు. ఇటీవల బుధవారపేటలోని ఓ స్థలానికి ఎలాంటి ఇబ్బందులూ లేకున్నా కోర్టు చిక్కులు ఉన్నాయంటూ ఓ కీలక ఉద్యోగి రూ.2లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి అందరి ముందూ గట్టిగా వాదించడంతో రూ.2లక్షల మొత్తం కాస్తా రూ.20వేలకు దిగినట్లు చర్చ జరుగుతోంది. ఏమీ తెలియకుండా రిజిస్ట్రేషన్‌కు వెళ్లే వారికి పలు రకాల భయాలు సృష్టించి ఉద్యోగులు లబ్ధిపొందుతున్నారు. కార్యాలయంలో ఒక్కోసీటుకు ఒక్కో రేటు చెబుతూ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు.