‘క్రమబద్ధీకరణ’ దరఖాస్తులకు లైన్‌క్లియర్!
- గడువు పొడిగింపుపై కలెక్టర్ల మొర ఆలకించిన సీసీఎల్ఏ
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో ఆరు నెలలు గడువు కావాలని వివిధ జిల్లాల కలెక్టర్లు చేసిన విజ్ఞప్తికి భూపరిపాలన ప్రధాన కమిషనర్(ఇన్చార్జ్) ఎస్పీ సింగ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. జిల్లా కలెక్టర్లు కోరిన విధంగా క్రమబద్ధీకరణ పక్రియ గడువు పెంపు విషయమై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉన్నందున, ఉత్తర్వులు వచ్చేలోగా దరఖాస్తుదారుల నుంచి పూర్తి సొమ్ము స్వీకరణ, కన్వేయన్స్డీడ్ల జారీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.
క్షేత్రస్థాయిలో ఉత్పన్నమైన సాంకేతిక సమస్యలు కొలిక్కి రాకపోవడడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దరఖాస్తుదారులు సొమ్ము చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తడం.. తదితర సమస్యలతో క్రమబద్ధీకరణ ప్రక్రియ కొలిక్కిరాలేదు. నేటికీ పలు మండలాల్లో బయోమెట్రిక్ మెషీన్లు పనిచేయడం లేదని తహశీల్దార్లు నెత్తీనోరూ బాదుకుంటున్నా సీసీఎల్ఏ సిబ్బంది పట్టించుకోవడం లేదు. పాత దరఖాస్తులు క్లియర్ చేయడానికే అధికారులు నానా అవస్థలు పడుతుంటే, గత నవంబర్‌లో మరో దఫా కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం వేరొక ఉత్తర్వు జారీ చేసింది. అదే సందర్భంలో పెద్దనోట్లను కేంద్రం రద్దు చేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు ప్రభుత్వమిచ్చిన గడువు జనవరి 10లోగా పూర్తి సొమ్ము చెల్లించలేకపోయారు.
అధికారుల్లో తొలగని అయోమయం
రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా పాత, కొత్త దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం, గడువు ముగిసినందున సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు కూడా ఆయా స్థలాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ యంత్రాంగానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. క్షేత్రస్థాయి నుంచి అందిన ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్లు సీసీఎల్ఏకు లేఖలు రాసినప్పటికీ, ఆరు నెలలుగా రెగ్యులర్ సీసీఎల్ఏ లేనందున జిల్లా కలెక్టర్ల విజ్ఞప్తులు పెండింగ్‌లో పెట్టేశారు. ‘రెవెన్యూలో గాడి తప్పిన పాలన’శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఇన్చార్జ్ సీసీఎల్ఏగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్పీసింగ్ తాజాగా క్రమబద్ధీకరణ ప్రక్రియపై దృష్టి సారించారు. ప్రక్రియను కొనసాగించాలని సీసీఎల్ఏ ఆదేశాలిచ్చినప్పటికీ, గడువు పొడిగింపుపై స్పష్టత లేకపోవడంతో రెవెన్యూ యంత్రాంగంలో అయోమయం తొలగలేదని తహశీల్దార్లు వాపోతున్నారు. గడువు పొడిగింపునకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నందున రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని కొన్ని జిల్లాల కలెక్టర్లు కిందిస్థాయిలో తమ సిబ్బందికి మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.