lankamala forest
-
అరుదైన పక్షి ‘కలివికోడి’
కడప కల్చరల్: ‘కలివి కోడి’.. పిల్లలూ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. నిజానికి ఇది కోడి కాదు కానీ అరుదైన పక్షి. ప్రపంచంలో ఈ పక్షి అంతరించిపోయిందని అందరూ భావించారు. కానీ ఆ మధ్య మన జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో ఈ పక్షి కనిపించింది. మన జిల్లాకు మరో ప్రత్యేకతను చేకూర్చి పెట్టింది. మరీ ఆ విషయాలు తెలుసుకుందామా! మన జిల్లాలో అటు శేషాచలం.. ఇటు నల్లమల అడవులు ఉన్నాయి. జిల్లాలోని సిద్దవటం, బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పేర్కొంటారు. ఈ అడవిలో ఎన్నోజాతుల పక్షులు, జంతువులు ఉన్నాయి. ఈ అడవిలోనే కలివికోడి కనిపించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరిగే కలివి పొదల్లో ఉండడంతో దీన్ని కలివి కోడి అంటున్నారు. 1948 నాటికే ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షిశాస్త్ర నిపుణులు సైతం నిర్ణయించారు. 1985 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్నకు ఈ పక్షి కనిపించగా, దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. వారు దాన్ని కలివికోడిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వెంటనే వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. దురదృష్టవశాత్తు ఆ పక్షి ఆయన చేతిలోనే మరణించింది. అప్పటి నుంచి మళ్లీ ఆ పక్షి కనిపిస్తుందేమోనని నేటివరకు వెతుకుతూనే ఉన్నారు. లంకమల అడవుల్లో పలుచోట్ల ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని వివరాలు కలివికోడికి ‘జోర్డాన్ కొర్సర్’ అని శాస్త్రీయమైన పేరుంది. ఇది పెద్ద సైజు కంజు పక్షిలా పొడవాటి కళ్లతో ఉంటుంది. ముదురు గోధుమరంగు ఈకలతో మెడలో దండలు ధరించినట్లు ముదురు రంగు చారలు ఉంటాయి. ఇది ముళ్ల పొదలతో కూడిన పచ్చిక మైదానాలలో నివసిస్తుంది. రాత్రి వేళ మాత్రమే తిరుగుతుంది. దీని కూత దాదాపు 200 మీటర్ల దాక వినిపిస్తుంది. నేషనల్ సొసైటీ ఆఫ్ ఇండియా కలివికోడి కూతను రికార్డు చేయించి దాని గురించి కరపత్రాలు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయించారు. -
సీమకే తలమానికం లంకమల్ల అభయారణ్యం
సాక్షి, సిద్దవటం(కడప): సిద్దవటం రేంజిలోని లంకమల్ల అటవీ ప్రాంతం రాయలసీమకే తలమానికంగా నిలుస్తోంది. అత్యంత విలువైన అటవీ సంపద, ఆయుర్వేద వనమూలికలు, ప్రపంచంలోనే అంతరించిన కలివికోడికి, పులికి ఆవాస ప్రాంతంగా లంకమల్ల అభయారణ్యం వెలుగొందుతోంది. ప్రకృతి పరిచిన పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఎతైన కొండలు భారీ వృక్షాల నడుమ ప్రయాణం, జలపాత సోయగాలు వర్ణనా తీతం. పవిత్రమైన క్షేత్రాలు నిత్యపూజస్వామి, లంకమల్లేశ్వర స్వామి, దట్టమైన అడవి కొండలు, జలపాతం, గుహలు మన రాయలసీమ ప్రాంత నేపథ్యంలో లంకమల్ల అడవుల ప్రాముఖ్యతగా చెప్పుకోవ చ్చు. సినిమాల్లో, కథల్లో, డిస్కవరి చానళ్లలో చూసే వింతలు, అద్భుతాలు నిజంగానే ఇక్కడే చూడవచ్చు. దట్టమైన అంకమల్ల అభయారణ్యంలో ప్రకృతి రమణీయతతో... కొండల పైనుంచి దూకే జలపాతం..కోనేరు, రెండు కొండల మధ్య పారే సన్నని సెలయేరు అప్పుడప్పుడు తొంగి చూసే సూర్యకిరణాలు, చుట్టూ పర్వతాలు మధ్యలో సెలయేర్లు, జలపాతాలు ఎనిమిది దిక్కుల్లో నీటి గుండాలతో ప్రకృతి అందాలు ప్రశాంతతను కల్గిస్తాయి. అడుగు ఎత్తైన రాళ్ల మధ్య ప్రయాణం పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం, చాలా ఆహ్లాదకరంగా ట్రెక్కింగ్‌ను తలపిస్తుంది. చాతక పక్షి శ్రీశైలం దేవస్థానానికి దక్షిణ ద్వారంగా పిలువ బడే సిద్దవటం మండలంలో దట్టమైన లంకమల్ల అభయారణ్యం, ఎతైన గుహలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. లంకమల్ల అభయారణ్యంలో దాదాపు మూడు నుంచి నాలుగు పులులు సంచరిస్తునట్లు అటవీ అధికారుల సమాచారం. దేశవ్యాప్తంగా పులుల సంఖ్య నాలుగు సంవత్సరాల్లో 8 శాతం పెరిగినట్లు స్టేట్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2018లో నివేదికలో పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 48 పులులు ఉండగా కడప–కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో పులుల సంచారంపై ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలో కడప, రాజంపేట, ప్రొద్దుటూరు ఫారెస్టు డివిజన్లు ఉండగా వీటి పరిధిలో 15 రేంజిలు, ఐదు లక్షల ఎకరాల అడవులు విస్తరించి ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం అడవులను టైగర్ జోన్లుగా ప్రకటించారు. లంకమల్ల అభయారణ్యంలో 465 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా పులుల సంచారానికి అనుకూల ప్రదేశంగా ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి కలివికోడి ఆవాస ప్రాంతంగా ఉంది. కలివికోడి కోసం అన్వేషణ కలివి కోడి ఉనికి కోసం తొమ్మిది సార్లు విదేశీ కెమెరాలను ఏర్పాటు చేసినా జాడ గుర్తించలేకపోయారు. కనిపించని పక్షి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే విమర్శల నుంచి బయట పడేందుకు అటవీ శాఖ అధికారులు లంకమల్లను టైగర్‌జోన్‌గా ప్రతిపాధించారనే విమర్శలూ లేకపోలేదు. టైగర్ కారిడార్ కోసం 7,410 హెక్టార్ల అటవీ భూభాగాన్ని కేటాయించారు. పులులకు అనుకూల ప్రదేశాలకు సిద్దవటం రేంజిలోని సిద్దవటం, అట్లూరు మండలాల పరిధిలో 27 అటవీ సరిహద్దు ప్రాంతాలు అనుకూలమని నివేదించారు. లంకమల్ల అభ్యయారణ్యం నుంచి శేషాచలం అడవుల్లో పులులు సంచరించేందుకు పెన్నానది అడ్డంకిగా మరింది. ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన కలివికోడి నాగార్జున సాగర్, శ్రీశైలంలో పులుల సంతతి బాగా పెరగడంతో పులులకు ఆవాస ప్రాంతాలను విస్తరించారు. అందులో భాగంగా లంకమల్లలో కూడా అటవీ శాఖ అధికారులు పులుల ఆవాసాలను ఏర్పాటు చేస్తున్నారు. లంకమల్ల నుంచి శేషాచలానికి పులుల రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటునకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. లంకమల్ల నుంచి అహోబిలానికి , అహోబిలం నుంచి నల్లమల్ల అడువుల్లోని గుండ్ల బ్రహ్మేశ్వరం వరకు పులులు సంచరిస్తున్నట్లు సమాచారాన్ని సేకరించింది. లంకమల్లలో సంచరిస్తున్న పెద్దపులి సోమశిల వెనుక జలాలైన జంగాలపల్లె, వెలుగుపల్లె, అట్లూరు మండలంలోని చెండువాయి, ఒంటిమిట్ట మండలంలోని సోమశిల ముంపు గ్రామాలను కూడా పరిశీలించి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ పులుల మార్గం ఏర్పాటునకు అయ్యే అంచనా ఖర్చులు, ఖాళీ చేయాల్సిన గ్రామాల వివరాలను ప్రభుత్వానికి వివరించింది. అలాగే లంకమల్లలో రోళ్లబోడు బీటు బేస్ క్యాంప్‌కు వెళ్లే 13 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చూసినా అటవీ సంపద వన్యమృగాల సంచారం చూపరులకు కనువిందు చేస్తాయి. ఎత్తై ప్రాంతాల్లో అటవీ శాఖ దాదాపు 16 లక్షల వ్యయంతో రెండు భవనాలు, తాగునీటి కోసం బోరు బేస్ క్యాంప్, సిబ్బందికి మౌలిక వసతులు కల్పించారు. -
లంకమల అభయారణ్యంలో పెద్దపులి సంచారం
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : బద్వేలు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని లంకమల అభయారణ్యంలో గల బాలాయపల్లె బీటులో పెద్దపులి సంచరిస్తున్నట్లు బద్వేలు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. బీటు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని ఓ కెమెరాలో పెద్దపులి చిత్రం నమోదైంది. అంతేకాకుండా బాలాయపల్లె బీటులోని అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రను కూడా గుర్తించారు. సీసీ కెమెరాలో నమోదైన పెద్దపులి చిత్రం :గతేడాది సిద్దవటం రేంజ్ పరిధిలోని లంకమల అభయారణ్యంలో పెద్దపులిని గుర్తించడంతో అక్కడి అటవీ ప్రాంతంలోని కొన్ని సీసీ కెమెరాలను బద్వేలు రేంజ్ పరిధిలోని బాలాయపల్లె బీటు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల్లో గతంలో చిరుతపులి చిత్రం నమోదైనప్పటికీ పెద్ద పులి చిత్రం నమోదు కాలేదు. అయితే గతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించి బాలాయపల్లె బీటులో కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. గత పది రోజుల క్రితం లంకమల అభయారణ్యంలోని బాలాయపల్లె బీటులో పనిచేసే కొందరు ప్రొటెక్షన్ వాచర్లు గస్తీ తిరుగుతుండగా లంకమల క్షేత్రం సమీపంలోని కోతులశెల, వెదుర్లదడి ప్రాంతంలో నీటిని తాగుతూ పెద్దపులి కనిపించడంతో వారు భయంతో పరుగులు తీసి విషయాన్ని సంబంధిత ఫారెస్టు అధికారులకు తెలిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం బాలాయపల్లె బీటులోని గురుట్లబావి సమీపంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. మరుసటిరోజు అదే అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్‌పిట్ వద్దకు నీళ్లు తాగేందుకు వచ్చి సీసీ కెమెరాలో నమోదైంది. జిల్లాలో 3 పెద్దపులులు? ప్రస్తుతం జిల్లాలో 3 పెద్దపులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మూడు నెలల క్రితం సిద్దవటం రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాచర్లకు, మేకల కాపర్లకు పెద్ద పులి కనిపించింది. ఆ తర్వాత రెండు నెలల క్రితం వనిపెంట రేంజ్‌పరిధిలోని అటవీ ప్రాంతంలో నీటిని తాగేందుకు వచ్చిన పెద్దపులి చిత్రం సీసీ కెమెరాలో నమోదైంది. వారం రోజుల క్రితం బద్వేలు రేంజ్ పరిధిలోని బాలాయపల్లె బీటులో మరో పెద్దపులి సీసీ కెమెరాలో నమోదైంది. అయితే సిద్దవటం, బద్వేలు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి ఒక్కటే అని అటవీ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. దీనిని బట్టి జిల్లాలో రెండు లేదా మూడు పెద్ద పులులు ఉన్నట్లు తెలుస్తోంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య అధికమైన నేపథ్యంలో ఆహారం కోసం లంకమలలోకి ప్రవేశిస్తుండవచ్చని ఓ అటవీ అధికారి తెలిపారు. -
పోలీసులపై రాళ్లు రువ్వారు
లంకమల ఫారెస్టులో కూంబింగ్ కడప: జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం స్పెషల్ టాస్కుఫోర్సు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళకూలీలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న తమిళ కూలీలలో ఇద్దరు పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్ర గాయలయ్యాయి.