బాలాయపల్లె బీటులో సంచరిస్తున్న పెద్ద పులి
వైఎస్‌ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : బద్వేలు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని లంకమల అభయారణ్యంలో గల బాలాయపల్లె బీటులో పెద్దపులి సంచరిస్తున్నట్లు బద్వేలు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. బీటు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని ఓ కెమెరాలో పెద్దపులి చిత్రం నమోదైంది. అంతేకాకుండా బాలాయపల్లె బీటులోని అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రను కూడా గుర్తించారు.
సీసీ కెమెరాలో నమోదైన పెద్దపులి చిత్రం :గతేడాది సిద్దవటం రేంజ్ పరిధిలోని లంకమల అభయారణ్యంలో పెద్దపులిని గుర్తించడంతో అక్కడి అటవీ ప్రాంతంలోని కొన్ని సీసీ కెమెరాలను బద్వేలు రేంజ్ పరిధిలోని బాలాయపల్లె బీటు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల్లో గతంలో చిరుతపులి చిత్రం నమోదైనప్పటికీ పెద్ద పులి చిత్రం నమోదు కాలేదు. అయితే గతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించి బాలాయపల్లె బీటులో కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. గత పది రోజుల క్రితం లంకమల అభయారణ్యంలోని బాలాయపల్లె బీటులో పనిచేసే కొందరు ప్రొటెక్షన్ వాచర్లు గస్తీ తిరుగుతుండగా లంకమల క్షేత్రం సమీపంలోని కోతులశెల, వెదుర్లదడి ప్రాంతంలో నీటిని తాగుతూ పెద్దపులి కనిపించడంతో వారు భయంతో పరుగులు తీసి విషయాన్ని సంబంధిత ఫారెస్టు అధికారులకు తెలిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం బాలాయపల్లె బీటులోని గురుట్లబావి సమీపంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. మరుసటిరోజు అదే అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్‌పిట్ వద్దకు నీళ్లు తాగేందుకు వచ్చి సీసీ కెమెరాలో నమోదైంది.
జిల్లాలో 3 పెద్దపులులు?
ప్రస్తుతం జిల్లాలో 3 పెద్దపులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మూడు నెలల క్రితం సిద్దవటం రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాచర్లకు, మేకల కాపర్లకు పెద్ద పులి కనిపించింది. ఆ తర్వాత రెండు నెలల క్రితం వనిపెంట రేంజ్‌పరిధిలోని అటవీ ప్రాంతంలో నీటిని తాగేందుకు వచ్చిన పెద్దపులి చిత్రం సీసీ కెమెరాలో నమోదైంది. వారం రోజుల క్రితం బద్వేలు రేంజ్ పరిధిలోని బాలాయపల్లె బీటులో మరో పెద్దపులి సీసీ కెమెరాలో నమోదైంది. అయితే సిద్దవటం, బద్వేలు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి ఒక్కటే అని అటవీ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. దీనిని బట్టి జిల్లాలో రెండు లేదా మూడు పెద్ద పులులు ఉన్నట్లు తెలుస్తోంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య అధికమైన నేపథ్యంలో ఆహారం కోసం లంకమలలోకి ప్రవేశిస్తుండవచ్చని ఓ అటవీ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment