Larry colliding
-
లారీ ఢీకొని యువకుడి మృతి
అచ్చంపేట, న్యూస్‌లైన్ :ఇసుక మాఫియా ఆగడాలకు అదుపులేకుండా పోయింది. కృష్ణా నది నుంచి ఇసుకను త్వరత్వరగా మండలం దాటించాలన్న ఆతృతతో వేగంగా వెళుతున్న లారీ బైక్‌పై వస్తున్న యువకుడిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన స్థానిక మాదిపాడు రోడ్డులోని తాళ్లచెరువు మలుపు వద్ద గురువారం చోటుచేసుకుంది. అచ్చంపేటకు చెందిన కోట నరేంద్ర (21)గ్రామాల్లో బాకీల వసూళ్లకు బైక్‌పై వెళుతుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. ముందు టైరు నరేంద్ర పొట్టపైనుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. తల్లిదండ్రులు కోట రంగారావు, లక్ష్మిలు ఘటనాస్థలానికి చేరేలోపే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. దీంతో కోపోద్రిక్తులైన మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు స్థానిక ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నాలుగు గంటలు పైగా రాస్తారోకో చేశారు. ఇసుక మాఫియా ఆగడాలకు అదుపులేకుండా పోయిందని, వందలాది లారీల్లో ఇసుక పట్టపగలే ఇసుక తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. శవపంచనామా చేయకుండా, కనీసం తల్లిదండ్రులు వచ్చేదాకా కూడా ఆగకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారని ప్రశ్నించారు. లారీని ఒక బాలుడు డ్రైవింగ్ చేశాడని, అతడ్ని తప్పించే ప్రయత్నంలో ఎస్ఐ పాత్ర ఉందని వారు ఆరోపించారు. ఇసుక మాఫియా నుంచి నెలకు రూ.50 లక్షలకు పైగా అధికారులు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. బాధితులకు మద్దతుగా వచ్చిన కాంగ్రెస్ నాయకుడు షేక్ అజుంతుల్లా, ఎస్ఐ వెంకట్రావు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ముస్లిం యువకులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఎస్ఐ డౌన్‌డౌన్, ఇసుక మాఫియా నశించాలి, పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రం కావడంతో క్రోసూరు ఎస్ఐ రాంబాబు తన సిబ్బందిని గ్రామంలో మోహరించారు. తహశీల్దారు ఎస్వీ రమణకుమారి బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు ప్రయత్నం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, రాస్తారాకో విరమించాలని కోరినా ససేమిరా అన్నారు. చివరకు సత్తెనపల్లి సీఐ శ్రీనివాసులురెడ్డి వచ్చి బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ని, లారీ ఓనర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్ఐ వెంకట్రావును పురమాయించడంతో బాధితులు ఆందోళన విరమించారు. -
లారీ ఢీకొని విద్యార్థి దుర్మరణం
వెంకట్రామన్నగూడెం (తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్ :పాఠశాలకు వెళుతున్న ఇద్దరు విద్యార్థుల సైకిళ్లను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఓ విద్యార్థి అక్కడికక్కడే మరణించగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వెంకట్రామన్నగూడెంలో శనివారం జరిగింది. వివరాలు ఇవి.. వెంకట్రామన్నగూడెంకు చెంది న చాలా మంది విద్యార్థులు పెదతాడేపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్నారు. ఈ విద్యార్థుల్లో కొందరు బస్సులపై, మరికొందరు సైకిళ్లపై పాఠశాలకు వెళుతుంటారు. ఈ గ్రామానికి చెందిన నీలపాల ప్రవీణ్‌కుమార్(16) పెదతాడేపల్లిలోని హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. నరదల నాగేశ్వరరావు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వారిద్దరూ కలిసి శనివారం ఉదయం వేర్వేరు సైకిళ్లపై పాఠశాలకు బయలుదేరారు. ముందు ప్రవీణ్‌కుమార్, వెనుక నాగేశ్వర రావు వెళుతున్నారు. వెంకట్రామన్నగూడెం దాటకముందే నల్లజర్ల వైపు నుంచి గూడెం వైపు వెళుతున్న నాగేశ్వరరావు సైకిల్ వెనుక భాగాన్ని లారీ ఢీకొట్టడంతో ఆ బాలుడు సైకిల్‌తోపాటు పక్కకు పడిపోయాడు. అదే స్పీడులో ప్రవీణ్‌కుమార్ సైకిల్‌ను ఢీకొట్టి అతని మీద నుంచి లారీ వెళ్లిపోయింది. దీంతో ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే మరణించాడు. పక్కకు పడిపోయిన నాగేశ్వరరావు తలకు తీవ్రగాయమైంది. అతడిని తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహంతో రాస్తారోకో ప్రవీణ్‌కుమార్ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు, గ్రామపెద్దలు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రవీణ్‌కుమార్ ఇంటి వద్ద తల్లి వెంకటలక్ష్మి రోదన అక్కడి వారిని కలచివేసింది. రూరల్ హెడ్‌కానిస్టేబుల్ కేటిపరిగిల చంటియ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలకు సెలవు ప్రవీణ్‌కుమార్ మృతితో శనివారం పెదతాడేపల్లి జెడ్పీ హైస్కూల్‌కు సెలవు ప్రకటించారు. అతని మృతికి సంతాపంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని పీఎంకే జ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బంది మృతుని ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందతున్న నాగేశ్వరరావును పరామర్శించారు.