లారీ ఢీకొని విద్యార్థి దుర్మరణం
Published Sun, Oct 20 2013 3:36 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
వెంకట్రామన్నగూడెం (తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్ :పాఠశాలకు వెళుతున్న ఇద్దరు విద్యార్థుల సైకిళ్లను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఓ విద్యార్థి అక్కడికక్కడే మరణించగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వెంకట్రామన్నగూడెంలో శనివారం జరిగింది. వివరాలు ఇవి.. వెంకట్రామన్నగూడెంకు చెంది న చాలా మంది విద్యార్థులు పెదతాడేపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్నారు. ఈ విద్యార్థుల్లో కొందరు బస్సులపై, మరికొందరు సైకిళ్లపై పాఠశాలకు వెళుతుంటారు. ఈ గ్రామానికి చెందిన నీలపాల ప్రవీణ్‌కుమార్(16) పెదతాడేపల్లిలోని హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.
నరదల నాగేశ్వరరావు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వారిద్దరూ కలిసి శనివారం ఉదయం వేర్వేరు సైకిళ్లపై పాఠశాలకు బయలుదేరారు. ముందు ప్రవీణ్‌కుమార్, వెనుక నాగేశ్వర రావు వెళుతున్నారు. వెంకట్రామన్నగూడెం దాటకముందే నల్లజర్ల వైపు నుంచి గూడెం వైపు వెళుతున్న నాగేశ్వరరావు సైకిల్ వెనుక భాగాన్ని లారీ ఢీకొట్టడంతో ఆ బాలుడు సైకిల్‌తోపాటు పక్కకు పడిపోయాడు. అదే స్పీడులో ప్రవీణ్‌కుమార్ సైకిల్‌ను ఢీకొట్టి అతని మీద నుంచి లారీ వెళ్లిపోయింది. దీంతో ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే మరణించాడు. పక్కకు పడిపోయిన నాగేశ్వరరావు తలకు తీవ్రగాయమైంది. అతడిని తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
మృతదేహంతో రాస్తారోకో
ప్రవీణ్‌కుమార్ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు, గ్రామపెద్దలు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రవీణ్‌కుమార్ ఇంటి వద్ద తల్లి వెంకటలక్ష్మి రోదన అక్కడి వారిని కలచివేసింది. రూరల్ హెడ్‌కానిస్టేబుల్ కేటిపరిగిల చంటియ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాలకు సెలవు
ప్రవీణ్‌కుమార్ మృతితో శనివారం పెదతాడేపల్లి జెడ్పీ హైస్కూల్‌కు సెలవు ప్రకటించారు. అతని మృతికి సంతాపంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని పీఎంకే జ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బంది మృతుని ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందతున్న నాగేశ్వరరావును పరామర్శించారు.
Advertisement
Advertisement