భారీ ఎత్తున ఆ సైట్లపై కొరడా
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లపై కొరడా ఝుళిపించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న 3వేలకు పైగా అశ్లీల వెబ్సైట్లను బ్లాక్ చేశామని కేంద్రం తెలిపింది. పిల్లలను ప్రభావితం చేస్తున్న బాల అశ్లీల కంటెంట్ వెబ్సైట్లను అడ్డుకునేందుకు 'సమగ్ర యంత్రాంగాన్ని' సిద్ధం చేస్తున్నామని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు కేంద్రం శుక్రవారం తెలిపింది. అయితే రెండు రోజుల్లో స్టేట్ రిపోర్టును దాఖలు చేయాలని సుప్రీం కేంద్రాన్ని కోరింది.
గత నెలలో ఇలాంటి3,522 పోర్న్ సైట్లను నిషేధించినట్లు కోర్టుకు ప్రభుత్వం చెప్పింది. అలాగే పాఠశాల ఆవరణలోనూ, స్కూలు బస్సులో జామర్లను ఏర్పాటును పరిశీలించాలన్న కోర్టు వ్యాఖ్యలకు స్పందించిన కేంద్రం పాఠశాలల్లో జామర్లు ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈని కోరామని తెలిపింది. పాఠశాల వరకు జామర్లు ఏర్పాటు చేయడం కుదురుతుంది కానీ స్కూల్ బస్సుల్లో కూడా జామర్ల ఏర్పాటు చేయడం వీలు కాదని ధర్మాసనంతో చెప్పారు. దీనిపై ఏదో ఒక పరిష్కారాన్ని త్వరలో రూపొందిస్తాంమని అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు వివరించారు . ఈ నేపథ్యంలో అశ్లీల వెబ్సైట్ల ఏరివేతకు సంబంధించిన రిపోర్టును రెండ్రోజుల్లోగా ప్రవేశ పెట్టాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.