ఎన్నిసార్లు వాయిదాలు కోరతారు?
కేబినెట్ హోదా వ్యాజ్యంలో సర్కారు తీరుపై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సలహా దారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఇ చ్చిన కేబినెట్ హోదాను వెంటనే ఉపసంహరించుకునేలా ఆదేశాలివ్వాలం టూ దాఖలైన వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం పదేపదే వాయిదాలు కోరుతుండటంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నిసార్లిలా వాయిదాలు కోరతారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డిని ప్రశ్నించింది.
ఇకపై వాయిదా కోరితే సంబంధిత అధికారి వాయిదాకు రూ.3వేలు న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాల్సి ఉంటుందని రాతపూర్వకంగా హెచ్చరించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి.. ఏజీ నగరంలో లేనం దున విచారణను వాయిదా వేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం.. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిందని, అన్నిసార్లూ ప్రభుత్వమే కోరిందన్నారు.