‘అర్కావతి లే ఔట్’పై సీబీఐ దర్యాప్తు చేయించాలి
బళ్లారి ఎంపీ శ్రీరాములు
సాక్షి, బళ్లారి : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను నీతి నిజాయితీపరుడని చెప్పుకునే వారని, అయితే ఆర్కావతి లేఔట్ డీ నోటిఫికేషన్లో ఆయన అసలు రంగు బయటపడిందని, వెంటనే డీనోటిఫికేషన్కు సంబంధించిన ఉదంతంపై సీబీఐ దర్యాప్తుకి అప్పగించాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు అన్నారు. ఆయన గురువారం నగరంలోని కౌల్బజార్లో విలేకరులతో మాట్లాడారు. నిజంగా సిద్ధరామయ్య నిజాయితీ పరుడైతే ఆర్కావతి లేఅవుట్ వివాదంపై సీబీఐకి అప్పగించి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
బళ్లారి రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నట్లు పత్రికల్లో చదివానని, అయితే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి తాను చేసిన కృషి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునన్నారు. న్రియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటించి, మంచినీటి సమస్య తీర్చడంతోపాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చే శానని, కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పిలిచినా బహిరంగ విచారణకు తాను సిద్ధమేనని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తూ అరచేతిలో వైకుంఠం చూపుతారని, వాటిని ప్రజలు నమ్మకూడదని కోరారు. తన ఆప్త మిత్రుడు గాలి జనార్దనరెడ్డికి కర్ణాటక కేసులకు సంబంధించి బెయిల్ వచ్చిందని, త్వరలో అన్ని కేసులకు సంబంధించి బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గోవిందరాజులు, శ్రీనివాస మోత్కర్ పాల్గొన్నారు.