ఎంసెట్ లీక్ పై ఆధారాలున్నాయి: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వమే అసలు ముద్దాయని.. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వంలోని పెద్దలతో పాటు సీఎం కేసీఆర్ కుటుంబానికి చెందినవారి హస్తం ఉందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద కుంభకోణాన్ని చిన్నదిగా చేసి చూపే ప్రయత్నం జరుగుతోంద న్నారు. సీఎం కుటుంబానికి చెందిన వ్యక్తులు, మిత్రుల పాత్ర కూడా ఉన్నట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. మంత్రుల మీద, అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ నిర్వాకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫిర్యాదులు అందినా మంత్రి కడియం, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పందించకపోవడమే లీకేజీ వెనుక సీఎం కుటుంబ సభ్యుల హస్తం ఉందనడానికి నిదర్శనమన్నారు. విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తేనే దోషులు తేలుతార న్నారు. లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి లక్ష్మారెడ్డిపైన విచారణ జరపాలన్నారు.