కేసీఆర్ సోదరి కన్నుమూత
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి చీటి లీలమ్మ (78) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను యశోద ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. లీలమ్మ కేసీఆర్‌కు నాల్గవ అక్క. ఆమె భర్త శంకర్రావు గతంలోనే మరణించారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాంతారావు, రాజేశ్వర్‌రావుతోపాటు కూతురు ఉంది. అల్వాల్ మంగపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.
మరణవార్త వినగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా అల్వాల్ చేరుకొని లీలమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతం అయ్యారు. ఓల్డ్ అల్వాల్‌లోని వెలమ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అనంతరం కేసీఆర్ ఎర్రవెల్లి వెళ్లారు. మంత్రి హరీశ్‌రావు మొదట అల్వాల్ చేరుకొని అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షించారు.
సీఎం సతీమణి శోభ, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు కవిత, సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు చింతల కనకారెడ్డి, సాయన్న, వివేకానంద, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ నాయకులు షబ్బీర్‌అలీ, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మధుసూదన్ అంత్యక్రియలకు హాజరయ్యారు.
వైఎస్ జగన్ సంతాపం
సీఎం కేసీఆర్ సోదరి లీలమ్మ మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.