దైవం ఇచ్చిన బహుమానం
సువార్త
బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
- సామెతలు 22:6
ఈ ప్రపంచంలో కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే... అది పసివాళ్ల మనసే అని చెప్పాలి. కానీ ఆ నిష్కల్మషత్వం ఎప్పటి వరకు ఉంటుంది! ఈ లోకం గురించి తెలుసుకునే వరకూ ఉంటుంది. లోకాశలకు లోబడే వయసు రానంతవరకే ఉంటుంది. ఆ తర్వాత వారి బాట వేరవుతుంది. దేవుడి నుంచి దూరమవుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వారిలో మంచి అనేది చిన్నతనంలోనే పెరగాలి. అలా పెరిగేలా తల్లిదండ్రులు చూడాలి.
అందుకే పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు ఎన్నో విషయాలు చెప్పాడు ప్రభువు. వారిని సరైన దారిలో పెంచాల్సిన బాధ్యత మీదే అని పదే పదే హెచ్చరించాడు. పైన చెప్పుకున్న వాక్యమే అందుకు నిదర్శనం. అంతేకాక... ‘‘తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి’’ అన్నాడు ప్రభువు ఎఫెసీ 6:4లో. ఈ ఒక్క మాట చాలు పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి.
కోపం మనిషికి శత్రువు. అది మనిషిని విచక్షణా రహితుణ్ని చేస్తుంది. తప్పులు చేయిస్తుంది. అందుకే కోపానికి దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండటం అన్నది చిన్ననాటి నుంచే జరగాలి. కోపమనే విత్తును పిల్లల మనసుల్లో నాటకుండా ఉండాలి. దేవుడి బోధలను, ప్రవచనాలు వివరించి... వాటిని అనుసరించి నడచుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి.
నిజానికి పిల్లలు ఎలా ఉండాలి అన్నదానికి అత్యంత గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తే. తన తండ్రియైన యెహోవా దేవుని ఆజ్ఞ మేరకు క్రీస్తు ఈ లోకంలో మనిషిగా జన్మించాడు. తన తండ్రి రాజ్యాన్ని ఈ నేలమీద స్థాపించాడు. తన తండ్రి ఆదేశించిన విధంగా శిలువ మరణం పొందాడు. ఓ గొప్ప కొడుక్కి అసలు సిసలు ఉదాహరణ క్రీస్తు. మరి మనకొద్దా అలాంటి గొప్ప బిడ్డలు!
గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం (కీర్తనలు 127:3). ఆయన ఇచ్చిన బహుమానాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని ఆయన ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి పిల్లల నడవడికను కనిపెట్టాలి. నడవాల్సిన తోవను చూపించాలి. చేరాల్సిన గమ్యాన్ని నిర్దేశించాలి.
- జాయ్స్ మేయర్