legislativ counsil
-
ఏ ఎమ్మెల్సీని బెదిరించానో నిరూపించండి
సాక్షి, అమరావతి: ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు టీడీపీ కరపత్రికలు లాంటివని.. వాటిలో వచ్చిన వార్తలు చూపించి శాసనమండలిలోని టీడీపీ సభ్యులు తనను క్షమాపణ చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం శాసనమండలి ప్రారంభమవగానే, అసెంబ్లీ ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లుపై మొదట చర్చ జరగాలా? లేదంటే టీడీపీ సభ్యులు రూల్ 71 కింద ఇచ్చిన నోటీసులోని అంశంపై చర్చ చేపట్టాలా? అన్నదానిపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి బొత్సనుద్దేశించి యనమల మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు మద్దతివ్వాలని పలువురు ఎమ్మెల్సీలకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనికి మంత్రి అభ్యంతరం తెలుపుతూ దమ్ముంటే ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశామో నిరూపించాలని సవాల్ విసిరారు. దీనికి యనమలతోసహా టీడీపీ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే మంత్రి బొత్స శాసనమండలిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఇందుకు క్షమాపణలు చెప్పాలంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను చదివి వినిపించేందుకు ప్రయత్నించారు. ఇందుకు బొత్స తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. మీ పార్టీకి కొమ్ముకాసే పత్రికల్లో ఏవో కథనాలను మీరే రాయించుకుని, వాటిపై క్షమాపణలు చెప్పాలని మమ్మల్ని కోరడమేంటని ప్రశ్నించారు. అయినా తాను మాట్లాడానో లేదో అన్నది కాకున్నా.. టీడీపీ గురించి మాట్లాడితే, అది మండలిని కించపరిచినట్టు ఎలా అవుతుందని నిలదీశారు. తాను అనని మాటలను ఆ పత్రికలు రాస్తే వాటిపై ఈ సభలో ఎందుకు ప్రకటన చేస్తానని, సభ వెలుపల ఆ విషయాలు చూసుకుంటానని పేర్కొన్నారు. -
అలా చూపిస్తే.. సభలో తలదించుకుంటా: బొత్స
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు పోరాడుతున్నారంటూ టీడీపీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడినట్లు చంద్రబాబు నాయుడు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే.. సభలో తలవంచుకుని నిలబడతానంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. హోదా వద్దని ప్యాకేజీని ఎందుకు తీసుకువచ్చారని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. హోదా సంజీవని కాదంటూ చంద్రబాబు అవహేళన చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రంతో కొట్లాడైనా సరే ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చి తీరుతామని మంత్రి బొత్స మండలిలో స్పష్టం చేశారు. -
పట్టభద్రుల సీటుకు రామచంద్రరావు పేరు ఖరారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి నిర్వహించనున్న ఎన్నికల్లో అభ్యర్థిగా రాష్ట్రపార్టీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సిఫార్సు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ పదవీకాలం మార్చి చివర్లో ముగియనుండటంతో ఈ ఖాళీ ఏర్పడనుంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రామచంద్రరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, డా.మల్లారెడ్డి (రంగారెడ్డిజిల్లా) పోటీపడుతున్నారు. అయితే బీజేపీ రాష్ట్రఎన్నికలకమిటీ రామచంద్రరావు పేరును ఎంపికచేసి జాతీయనాయకత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. అతనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మద్దతుందని చెబుతున్నారు.