
సాక్షి, అమరావతి: ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు టీడీపీ కరపత్రికలు లాంటివని.. వాటిలో వచ్చిన వార్తలు చూపించి శాసనమండలిలోని టీడీపీ సభ్యులు తనను క్షమాపణ చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం శాసనమండలి ప్రారంభమవగానే, అసెంబ్లీ ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లుపై మొదట చర్చ జరగాలా? లేదంటే టీడీపీ సభ్యులు రూల్ 71 కింద ఇచ్చిన నోటీసులోని అంశంపై చర్చ చేపట్టాలా? అన్నదానిపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ కొనసాగింది.
ఈ సందర్భంగా మంత్రి బొత్సనుద్దేశించి యనమల మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు మద్దతివ్వాలని పలువురు ఎమ్మెల్సీలకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనికి మంత్రి అభ్యంతరం తెలుపుతూ దమ్ముంటే ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశామో నిరూపించాలని సవాల్ విసిరారు. దీనికి యనమలతోసహా టీడీపీ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే మంత్రి బొత్స శాసనమండలిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఇందుకు క్షమాపణలు చెప్పాలంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను చదివి వినిపించేందుకు ప్రయత్నించారు.
ఇందుకు బొత్స తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. మీ పార్టీకి కొమ్ముకాసే పత్రికల్లో ఏవో కథనాలను మీరే రాయించుకుని, వాటిపై క్షమాపణలు చెప్పాలని మమ్మల్ని కోరడమేంటని ప్రశ్నించారు. అయినా తాను మాట్లాడానో లేదో అన్నది కాకున్నా.. టీడీపీ గురించి మాట్లాడితే, అది మండలిని కించపరిచినట్టు ఎలా అవుతుందని నిలదీశారు. తాను అనని మాటలను ఆ పత్రికలు రాస్తే వాటిపై ఈ సభలో ఎందుకు ప్రకటన చేస్తానని, సభ వెలుపల ఆ విషయాలు చూసుకుంటానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment