సాక్షి, అమరావతి : రెయిన్‌గన్‌లకు టెక్నికల్ సపోర్టు ఇవ్వడంలో గత ప్రభుత్వం విఫలమైందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం శాసనమండలిలో క్వశ్చన్ అవర్‌లో భాగంగా రెయిన్‌గన్‌లకు సంబంధించి మంత్రి మాట్లాడారు. 116 కోట్ల రూపాయలు వెచ్చించి గత చంద్రబాబు ప్రభుత్వం రెయిన్‌గన్‌లను కొనుగోలు చేసిందని తెలిపారు. కేవలం ఒక ఏడాది, ఒక సీజన్‌లో మాత్రమే వాటిని వినియోగించారని పేర్కొన్నారు. టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం వల్లే రెయిన్‌గన్‌ల ప్రయోగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ సొమ్ము పూర్తిగా వృథా అయిందని మండిపడ్డారు. వీటి ద్వారా ఒక్క ఎకరాకు కూడా అదనపు సాగు జరగలేదని వెల్లడించారు. ఎవరైనా సభ్యులు అడిగితే రెయిన్‌గన్‌లపై విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు.
రాజధాని టెండర్లలో జరిగిన అవినీతి తెలిసిపోతుంది..
అలాగే రాజధానిని తమ ప్రభుత్వం ఆపలేదని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. 25 శాతం లోపు ఉన్న పనులన పరిశీలించడానికి ఒక కమిటీ వేశామని తెలిపారు. రాజధాని టెండర్ ప్రక్రియలో అనేక ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. దీనిపై నిపుణల కమిటీ రిపోర్ట్ రాగానే రాజధానిలో ఎంత అవినీతి జరిగిందో తెలిసిపోతుందని అన్నారు. అసెంబ్లీ, శాసనమండలి నిర్మాణానికి స్క్వేర్ ఫీట్‌కు రూ. 10,000 ఇచ్చారని.. త్వరలోనే అక్రమ లెక్కలు బయటపెడతామని పేర్కొన్నారు. ఏ అంశంపైనైనా చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment