rainguns
-
రెయిన్గన్ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స
సాక్షి, అమరావతి : రెయిన్గన్లకు టెక్నికల్ సపోర్టు ఇవ్వడంలో గత ప్రభుత్వం విఫలమైందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం శాసనమండలిలో క్వశ్చన్ అవర్‌లో భాగంగా రెయిన్గన్లకు సంబంధించి మంత్రి మాట్లాడారు. 116 కోట్ల రూపాయలు వెచ్చించి గత చంద్రబాబు ప్రభుత్వం రెయిన్గన్లను కొనుగోలు చేసిందని తెలిపారు. కేవలం ఒక ఏడాది, ఒక సీజన్లో మాత్రమే వాటిని వినియోగించారని పేర్కొన్నారు. టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం వల్లే రెయిన్గన్ల ప్రయోగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ సొమ్ము పూర్తిగా వృథా అయిందని మండిపడ్డారు. వీటి ద్వారా ఒక్క ఎకరాకు కూడా అదనపు సాగు జరగలేదని వెల్లడించారు. ఎవరైనా సభ్యులు అడిగితే రెయిన్గన్లపై విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు. రాజధాని టెండర్లలో జరిగిన అవినీతి తెలిసిపోతుంది.. అలాగే రాజధానిని తమ ప్రభుత్వం ఆపలేదని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. 25 శాతం లోపు ఉన్న పనులన పరిశీలించడానికి ఒక కమిటీ వేశామని తెలిపారు. రాజధాని టెండర్ ప్రక్రియలో అనేక ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. దీనిపై నిపుణల కమిటీ రిపోర్ట్ రాగానే రాజధానిలో ఎంత అవినీతి జరిగిందో తెలిసిపోతుందని అన్నారు. అసెంబ్లీ, శాసనమండలి నిర్మాణానికి స్క్వేర్ ఫీట్‌కు రూ. 10,000 ఇచ్చారని.. త్వరలోనే అక్రమ లెక్కలు బయటపెడతామని పేర్కొన్నారు. ఏ అంశంపైనైనా చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. -
రెయిన్గన్లతో కరువును తరమలేరు
ఆచరణ యోగ్యమైన పనులనే తలపెట్టండి – రెయిన్‌గన్ వినియోగాలపై వర్క్‌షాప్‌లో ఎమ్యెల్యే విశ్వ – అధికారపార్టీ ఎమ్మెల్యేలు కనిపించని వైనం అనంతపురం సిటీ : రెయిన్గన్లవును తరిమికొడతాం. పంటకు ప్రాణం పోస్తామంటూ ఆచరణ యోగ్యం కాని కోతలతో ప్రజలను మభ్య పెట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెయిన్గన్ల వినియోగంపై వర్క్‌షాపు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీతతో పాటు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, యామినీబాల, వరదాపురం సూరి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హారిజవర్లాల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘‘రెయిన్గన్లను వినియోగించాలంటే నీరు కావాలి. నీరు లేకుండా రెయిన్గన్లతో పంటకు రక్షక తడులు ఇవ్వడం కుదరదు. గతేడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల ఎకరాలకు రక్షక తడులిచ్చామని చెప్పింది. కనీసం అవగాహన లేకుండా ప్రజలకు ఇలా చెబితే ఎలా అని కూడా ఆలోచించలేదు. ఫలితంగా అభాసుపాలయ్యారు. ఈ క్రమంలో ముందుగానే ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే ప్రయత్నం చేసింది. మంచిదే...దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఈసారైనా ఆచరణ యోగ్యమైన కార్యాలు చేపట్టండి. ఇక పంట కుంటలతో భూగర్భ జలాలు పెరుగుతాయని చెబుతున్నారు. దీనికి ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవు.’’ అన్నారు. సమావేశం అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ గతేడాది తలెత్తిన లోటు పాట్లను సరిదిద్దుకునేందుకు రక్షక తడులను ప్రణాళికా బద్ధంగా అందించాలని వర్కుషాపు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి పట్టిసీమ నుంచి నీటిని తెచ్చి జిల్లాలో తాగు, సాగు నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణం, తేమ శాతం, నీటి లభ్యత వివరాలను తెలుసుకుంటామన్నారు. బెట్టదశలో ఉన్న పంటను వెంటనే కాపాడుతామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు గతేడాది జిల్లాలో పంటలు ఎండినా ప్రభుత్వానికి తెలియని దుస్థితి. ఈ ఏడాది అలా జరక్కూడదని ముందుగా రైతులకు చేరువుగా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనలను అధికారపార్టీ నేతలు బేఖాతరు చేశారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమావేశానికి అధికార పార్టీ నేతలే డుమ్మాకొట్టారు. ముగ్గురు మంత్రులున్న వేదికపై అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా ఎవరూ కనిపించకపోవడం విమర్శలకు తావిచ్చింది. -
123 మంది రైతులపై ఫిర్యాదు
నల్లమాడ : రక్షకతడులకు సంబంధించిన పరికరాలు వెనక్కు ఇవ్వడంలేదని 123 మంది రైతులపై మండల వ్యవసాయాధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకొంది. వివరాల్లోకెళితే... ఈ ఏడాది ఖరీఫ్‌లో వ్యవసాయశాఖ నుంచి రక్షకతడుల పరికరాలు తీసుకొని తిరిగి ఇవ్వని రైతులపై కేసులు పెట్టాలంటూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు మండలంలో పరికరాలు తిరిగి ఇవ్వని 123 మంది రైతుల జాబితాను మండల వ్యవసాయాధికారి ఓబిరెడ్డి మంగళవారం స్థానిక పోలీసులకు అందజేశారు. మొత్తం 233 మంది రైతులు పైపులు, స్ప్రింక్లర్లు, రెయిన్గన్లు, ఆయిల్ ఇంజన్లు తీసుకెళ్లగా, ఇప్పటివరకు 110 మంది పరికరాలు వాపస్ చేసినట్లు ఏఓ తెలిపారు. తక్కిన వారిపై ఏఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా తాము కూడా రైతులకు ఓసారి చెప్పి చూస్తామని, అప్పటికీ వినకపోతే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పినట్లు తెలిసింది. రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయంపై ఏఓ ముందుగా తహసీల్దార్ ఏఎస్ అబ్దుల్‌హమీద్‌ను కలిసి చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నిక ముగియగానే రెవెన్యూ, వ్యవసాయ సిబ్బందితో టీంలు ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటిద్దామని తహసీల్దార్ సూచించినట్లు తెలిసింది. ఫిర్యాదు జాబితాలో అత్యధికంగా టీడీపీ వారే ఉన్నట్లు సమాచారం. -
పంటలు ఎండాకా.. రెయిన్ గన్స్‌తో ఏం చేయాలి
– వ్యవసాయ అధికారులను నిలదీసిన రైతులు ఆదోని: ‘వారం రోజులుగా పైప్‌లు, ఆయిల్ ఇంజన్, రెయిన్ గన్స్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.. పంటలన్ని ఎండిపోయాయి.. ఇప్పుడు రెయిన్ గన్స్ ఇస్తే ఏమి చేసుకోవాలి’ అంటూ రైతులు వ్యవసాయాధికారులపై మండిపడ్డారు. ఆదోని మండలం నెట్టేకల్, సుల్తానాపురం, కపటి, పెసలబండ, తదితర గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఏడీఏ కార్యాయంకు చేరుకొని అధికారులను నిలదీశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఫారం ఫాండ్స్లో నీళ్లు ఉండికూడా అధికారుల నిర్లక్ష్యంతో పంటపైరుకు నీటి తడులు పెట్టుకోలేని దుస్థితి ఏర్పడిందని ఏడీఏ చెంగలరాయుడును నిలదీశారు. మొదటి విడతలో ఇచ్చిన పైప్‌లు, ఆయిల్ ఇంజన్లు, రెయిన్ గన్లు నాయకులు తమ ఇళ్లల్లో పెట్టుకున్నారన్నారు. వారి పొలాలకు తడులు పెట్టుకున్న తర్వాత ఇస్తామంటూ వారం రోజులుగా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాము ఏవో, ఏడీఏ కార్యాలయంలో అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బంది దష్టికి కూడా తెచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్ని అవసరమైతే అన్ని రెయిన్ గన్లు, పైప్‌లు, ఆయిల్ ఇంజన్లు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలన్నీ ఎండిపోయిన తర్వాత ఇస్తారా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. రైతుల ఆందోళన, ఆగ్రహంతో దిగొచ్చిన ఏడీఏ వెంటనే తమవద్ద ఉన్న పైప్‌లు, ఆయిల్ ఇంజన్లు, రెయిన్ గన్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నీళ్లున్నా పంటలెండాయి: బారికి రాముడు, పెసలబండ నా పొలంలో ఫారంపాండ్‌లో ఆరడుగుల లోతులో నీళ్లు ఉన్నాయి. నాకున్న రెండున్నరెకరాల పత్తి పంట పైరుకు రెండు తడులు నీరు పెట్టుకోవచ్చు. ఆయిల్ ఇంజన్, పైప్‌లు, రెయిన్ గన్ ఇస్తామని వారం రోజులుగా తిప్పుతున్నారు. పంటపైరు ఎండిపోయి కాపు రాలిపోతోంది. ఇదిగో.. అదిగో అంటూ మభ్యపెట్టారు. పంట అంతా ఎండిపోయింది. రెండు వారాల క్రితమే ఇచ్చివుంటే నష్టం తగ్గేది : హుసేనప్ప, నెట్టేకల్ వర్షం ఎండబెట్టడంతో పత్తి, మిరప పైరు వాడిపోయింది. మా పొలంలో నాలుగు ఫారం ఫాండ్స్లో నీరున్నప్పటికీ సకాలంలో పైరుకు తడులు పెట్టుకోలేక పోయాను. ఫారం ఫాండ్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయిల్ ఇంజను, పైప్‌లు ఇస్తామన్నారు. రెండువారాల క్రితం ఇచ్చివుంటే పంటపైరు ఎండేది కాదు. రైతులంటే అలుసు: సరోజమ్మ, సుల్తాపురం నీటి సౌకర్యం ఉన్న రైతులకు వెంటనే ఆయిల్ ఇంజన్లు, పైప్‌లు ఇస్తామన్నారు. మా ఫారం ఫాండ్లో నీళ్లున్నాయని ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చి వారం దాటిపోయింది. ఇప్పటి వరకు పైప్‌లు, ఆయిల్ ఇంజన్ పంపిణీ అతీగతి లేదు. అధికారులు చెప్పింది ఎందుకు చేయరో అర్థం కాదు. ఇప్పటికైనా పంటలు రక్షించే చర్యలు చేపట్టాలి. -
మెట్ట రైతులకు వరం రెయిన్‌గన్
మైక్రో ఇరిగేషన్ పీడీ జీ.సంగీతలక్ష్మీ హుస్నాబాద్ రూరల్ : మెట్టప్రాంత రైతులకు రెయిన్‌గన్స్ ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని మైక్రో ఇరిగేషన్ పీడీ సంగీతలక్ష్మీ అన్నారు. బుధవారం మండలంలోని గుబ్బడిలో అన్నబోయిన సత్యనారాయణ రైతు తన పత్తి పంటలో ఏర్పాటు చేసిన రెయిన్ గన్ను పరిశీలించారు. గన్ ద్వారా పంటలకు నీరు అందించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బావులు, బోర్లలో కొద్దిపాటి నీరున్నా.. రెయిన్‌గన్స్‌తో అధిక విస్తీర్ణంలో సాగుచేసుకుని సులభంగా తడులు అందించవచ్చన్నారు. సబ్సిడీపై గన్స్‌ను అందిస్తున్నామని వివరించారు. మూడు మీటర్ల ఎత్తులో ఉండే రెయిన్‌గన్ 16 నుంచి 20 మీటర్ల దూరం వరకు వర్షం మాదిరిగా నీటిని అందిస్తుందని పేర్కొన్నారు. గంట వ్యవధిలోనే ఎకరం విస్తీర్ణానికి నీరు అందించవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా 46 వేల మంది రైతులకు బిందు, తుంపుర సేద్యం కింద డ్రిప్, స్ప్రింక్లర్లు అందించామని, రెయిన్ గన్స్‌ను నలుగురు రైతులకు అందించామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, చిన్న, సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీపై రెయిన్ గన్స్‌ను అందిస్తున్నామన్నారు. యూనిట్ విలువ రూ.23,260అని, 25 పైపులు, ఒక గన్ ఇస్తామన్నారు. గన్స్ బహిరంగ మార్కెట్లో రూ.7,800కు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో జైయిన్ కంపెనీ ఇంజినీరు భూషణ్, టెక్నీషియన్ ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. -
రెయిన్గన్ల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
ఆలూరు రూరల్ : రైతులకు రెయిన్గన్లు అందించి పంటలను తడులు అందించడంలో నిర్లక్ష్యం పనికిరాదని జేడీఏ ఉమామహేశ్వరమ్మ అన్నారు. ఆలూరు, ఆస్పరి మండలాల పరిధిలోని పెద్దహోతూరు, చిన్నహోతూరు తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. రెయిన్గన్ల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. పొలాల్లో ఏర్పాటు చేసుకున్న రెయిన్గన్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆలూరు ఏడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు 4 వేల రెయిన్గన్లు, 4 వేల స్ప్రింక్లర్లు, 1.11 లక్షల పైపులను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. వాటిని జిల్లాలోని ఆయా వ్యవసాయ సబ్డివిజన్లకు పంపిణీ చే సినట్లు తెలిపారు. వాటితో ఎండుతున్న పంటలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రెయిన్గన్లు పొందిన రైతులు పొలాలకు తడులు అందించుకున్న తర్వాత వాటిని తిరిగి ఇతర రైతులకు ఇచ్చి సహకరించాలన్నారు. ఆమె వెంట భూసంరక్షణశాఖ డీడీఏ గణపతి, ఆలూరు ఏడీఏ రాజశేఖర్, ఏఓ శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. – ఆదివారం వద్దు.. పండగ అసలే వద్దు.. ఆదివారం అనొద్దండయ్యా, పండగ అసలే వద్దు బాబు.. గ్రామాల్లో తిరగండి రెయిన్గన్ల పంపిణీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయండి అంటూ జేడీఏ ఆయా మండలాల వ్యవసాయాధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఆదోని, ఆలూరు, పత్తికొండ వ్యవసాయ సబ్డివిజన్లలో ఆశించిన వర్షాలు పడలేదన్నారు. ఆ ప్రాంతాల్లో పంటలు ఎండిపోతుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు రోజులుగా అన్ని వ్యవసాయ సబ్డివిజన్లలో తిరుగుతున్నానని ఏడీఏ, ఏఓలకు ఫోన్లో తెలిపారు. ఆదివారం, పండగ అంటూ నిర్లక్ష్యం చేయకుండా రెయిన్గన్ల ద్వారా ఎండుతున్న రైతుల పొలాలకు రక్షక తడులు అందించాలని సూచించారు. -
దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు: వైఎస్ జగన్
ఇడుపులపాయ: సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో పూర్తిగా కూరుకుపోయారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పాలనను గాలికి వదిలేసి ఈ కేసు నుంచి బయట పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం పంట పొలాల్లో రెయిన్ గన్ల పనితీరును వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్లుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి స్వయంగా పట్టుబడడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. పట్టుబడిన తర్వాత కూడా చంద్రబాబు అరెస్ట్ కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకున్న అధికారాలు, పరిచయాలను ఉపయోగించుకుని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన కేసుల మాఫీ గురించి సుజనా చౌదరిని ఢిల్లీకి పంపారని అన్నారు. చంద్రబాబు పాత్రపై విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించిన వెంటనే సుజనా చౌదరి పరుగున వెళ్లి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అమిత్ షాలను కలిశారని గుర్తు చేశారు. హైదరాబాద్ వచ్చి గవర్నర్ తో భేటీ అయ్యారని వెల్లడించారు. ప్రత్యేకహోదా గురించి కలిసామంటూ జనం చెవుల్లో పూలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాకు, గవర్నర్ కు సంబంధం ఉందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంతా మోసం, అబద్ధం అని వ్యాఖ్యానించారు. డబ్బు సంపాదన, కేసుల నుంచి ఎలా బయటపడాలనే దాని గురించే చంద్రబాబు ఆలోచిస్తుంటారని అన్నారు. రైతులపై చంద్రబాబు ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్ జగన్ అన్నారు. 2013-14లో రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టారని చెప్పారు. 2014-15లో కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను కుదించి రూ.600 కోట్లే ఇచ్చారని తెలిపారు. 11 ఏళ్ల క్రితమే రెయిన్ గన్లు వాడుకలోకి వచ్చాయన్నారు. నీళ్లు లేకుండా రెయిన్గన్లుతో ఏం ఉపయోగమని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి నీళ్లు అందించాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లకు అవకాశమున్నా కేవలం 15 టీఎంసీలే ఉంచుతున్నారని అన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలు, రాయలసీమ కరువుతో అల్లాడుతున్న పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అన్నదాతలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు
-
రెయిన్గన్లను ఉపయోగించండి
పత్తికొండ: రైతులు రెయిన్గన్లను ఉపయోగించుకోలేకపోవడం వల్లే పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని కోతిరాళ్ల క్రాస్ రోడ్డులో జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారన్నారు. ఈ సమయంలో మహిళా రైతులు జోక్యం చేసుకుంటూ మాటలు వద్దు సార్.. చేతల్లో చూపించాలని కోరారు. మంత్రి కోరిక మేరకు కేశవయ్య అనే రైతు తన బాధలను ఏకరువు పెట్టారు. నిజాలు చెప్పండి సార్ ‘‘సార్.. నేను పందికోన గ్రామ రైతును. ఉల్లి పంట సాగు చేసినా. ఎకరాకు రూ.80వేల పెట్టుబడి అయింది. పక్కనే ఉన్నా హంద్రీనీవా నీళ్లు అందించలేని పరిస్థితి ఉంది. కష్టపడి పంట పండిస్తున్నా. ఇంతా చేస్తే.. మీరు కిలో రూ.6లతో కొనుగోలు చేస్తామంటారు. ఎట్లా గిట్టుబాటు అవుతాది.’’ అని రైతు కేశవయ్య వాపోయాడు. వెంటనే మంత్రి నీకు రుణమాఫీ అయిందా అంటూ ప్రశ్నించారు. నాకు రూ.55 వేల అప్పు ఉందని.. మాఫీ కాలేదని రైతు సమాధానం ఇచ్చాడు. అందుకు మంత్రి స్పందిస్తూ కొన్ని లోపాల వల్ల రాకపోయి ఉండొచ్చని సర్ది చెప్పారు. మాటలు చెప్పకండి సార్, చెప్పిన మాటల్లో నిజం ఉండాలని రైతు తిరిగి సమాధానమిచ్చాడు. తిరిగి మంత్రి స్పందిస్తూ.. సాక్షి విలేకరులు, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పింటే వచ్చావని గద్దించడంతో, ‘‘సార్ నేను రైతును.. మీరు అడుగుతుంటే నా బాధ చెప్పుతున్నా. నాకు ఎవ్వరూ చెప్పలేదని’’ రైతు చెప్పారు. ఇలా సంభాషణ సాగుతున్న సమయంలో రైతులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. నిలదీసిన రైతును సభ నుంచి దూరంగా పంపించేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
50 శాతం సబ్సిడీతో రెయిన్గన్లు
అమరావతి: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లో 50 శాతం సబ్సిడీతో రెయిన్ గన్స్ పంపిణీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. వెలగపూడిలోని నూతన సచివాలయంలోని నాల్గవ బ్లాకు కింది అంతస్తులో నిర్మించిన వ్యవసాయశాఖ కార్యాలయాన్ని మంత్రి శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలను కాపాడతామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాజీపడబోమని ఆయన పేర్కొన్నారు. -
వేరుశనగ పంటను కాపాడాలి
అనంతపురం అర్బన్: ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగపంట ఎండిపోకుండా రెయిన్గన్ల ద్వారా రక్షక నీటి తడులను అందించాలని వ్యవసాయశాఖ అధికారులను ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం, వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఎంఐపీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 12,387 హెక్టాలర్లలో వెరుశనగర పంట బెట్ట పరిస్థితుల్లో ఉందన్నారు. ఇప్పటి వరకు 6,446 హెక్టార్లలో రెయిన్ గన్ల ద్వరా రక్షక తడి అందించారని, కొన్ని చోట్ల ఎంపీఈఓలు, ఏఓలు సక్రమంగా స్పందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిర్లక్ష్యం వీడి చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఎక్కడైనా పంట ఎండితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. జీడిపల్లి రిజ్వాయర్‌లో 1.2 టీఎంసీల నీరుందని, హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని, ఎక్కడైనా చెరువుల్లో ఉన్న నీటిని వినియోగించుకుని రెయిన్గన్ల ద్వారా పంటకు అందించాలని ఆదేశించారు. ఐదుగురు ఎంపీడీఓలకు అవార్డులు జిల్లాలో ఇప్పటి వరకు 52 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మార్చారని, అక్టోబరు 2 నాటికి 150 గ్రామాలను ఈ విధంగా తీర్చిదిద్దాలని అధికారులను జేసీ లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రజాసాధికార సర్వేపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వందశాతం పూర్తయ్యేలా చేసిన పుట్టపర్తి, కొత్తచెరువు, సోమందేపల్లి, పెద్దపప్పూరు, పుట్టూరు ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు ఈ నెల 26న అవార్డులను ప్రదానం చేస్తున్నామన్నారు. తాడిపత్రిలోనూ వంద శాతం ఓడీఎస్ చేసినందున మునిసిపల్ కమిషనర్‌కి కూడా అవార్డు ప్రకటించామన్నారు. -
జిల్లాలో మళ్లీ కరువు ఛాయలేనా
సాక్షి కడప/అగ్రికల్చర్: జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 69.2 మిల్లీ మీటర్లకుగాను 127 మిల్లీ మీటర్లు కురిసింది. జులై నెల సాధారణ వర్షపాతం 96.7 మిల్లీ మీటర్లు కాగా 120.8 మిల్లీ మీటర్లు కురిసింది. నీరు భూగర్భంలోకి ఇంకిపోయాయేగాని, భూబాగంపై ఉన్న చెరువులు, కుంటల్లో చుక్కనీరు చేరలేదు. ఖరీఫ్ సీజన్ జూన్నెలలో ప్రారంభమైనప్పుడు పంటల సాగుకు పదును వర్షాలు కురిశాయి. దీంతో కొందరు రైతులు ప్రధాన పంటలను కొద్దిమేర సాగు చేశారు. జూలై నెల మొదట్లో ఓ మోస్తరు వానలు పడటంతో మళ్లీ సాగు చేపట్టారు. అయితే జులె నెల మధ్య నుంచి వరుణదేవుడు ముఖం చాటేయడంతో పంటలు వాడుముఖం పట్టాయి. జులై నెల చివరలో కొద్దిమేర వాన కురవడంతో ఇక పంట పండుతుందని ఆశపడ్డారు. కానీ ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చినుకు జాడ కనిపించలేదు. దీంతో అన్నదాతలు కుంగిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతోదిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఏటా పంటలకు చేసిన అప్పులు కరువుతో పెరిగిపోతున్నాయే తప్ప తీర్చిన దాఖలాలు లేవు. వేరుశనగలో ఊడల జాడలేదు జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ సాధారణ సాగు 33546 హెక్టారులకాగా దాన్ని అధిగమించి 41466 హెక్టార్లలో వేశారు. సాగు చేసిన వేరుశనగ ప్రస్తుతం దిగుబడి వచ్చే సమయం. చినుకుల జాడలేకపోవడంతో పంట చేతికి వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెలల సమయం గడచిపోయిందని, వేరుశనగ పంటలో ఊడలు దిగే సమయం కావడంతో భూమిలో తేమ లేనందువల్ల పిందెలు ఏర్పడే అవకాశమేలేదని వ్యవసాయాధికారులు అంటున్నారు. రెయిన్గన్లతో పంటల రక్షణ సాధ్యం కాదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యవసాయశాఖ పంటల సాగుపై వేసిన అంచనాలు కూడా తగ్గిపోయాయి. పెట్టుబడులు కూడా వచ్చేస్థితిలేదని రైతులు సంఘాలు అంటున్నాయి. రూ. 165 కోట్ల మేర నష్టం జిల్లాలో వేరుశనగ పంట సాగులో ఎకరానికి దుక్కులు, ఎరువులు, విత్తనాలు, విత్తనం వేయడం, కలుపుతీత తదితర ఖర్చులు కలిపి రూ. 16 వేలు పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన మొత్తం సాగు కోసం రూ.165 కోట్లు పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చే సూచనలు కనిపించకపోవడంతో పెట్టుబడి పోయినట్లేనని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఎకరం పంట కూడా ఎండటానికి వీల్లేదంటున్న వ్యవసాయశాఖ మంత్రి గురవారం విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎకరం పంట కూడా ఎండిపోవడానికి వీల్లేదని చెప్పారు. దీంతో జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, మండల వ్యవసాయాధికారులు నీరు ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఆయిల్ ఇంజన్లు వస్తేనే ప్రయోజనం జిల్లాలోని రాయచోటి, కడప, లక్కిరెడ్డిపల్లె, ప్రొద్దుటూరు, మైదుకూరు, ముద్దనూరు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లోని సుమారు 24 మండలాల్లో రెయిన్ గన్లను వినియోగించి పంట తడులు అందించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు రెయిన్ గన్లు, అందుకు సంబంధించిన పైపులు వచ్చినా ఇంతవరకు ఒక్క ఆయిల్ ఇంజన్ కడపకు రాలేదు. రెండు, మూడు రోజుల్లో రావచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. సుమారు 100కు పైగా ఆయిల్ ఇంజన్లు కడపకు రావాల్సి ఉంది. ఇప్పటికే మండలాలకు రెయిన్గన్లు, ఆయిల్ ఇంజన్లను వ్యవసాయశాఖ అధికారులు కేటాయించారు. ప్రస్తుతం పంటలుఎండుతున్న నేపథ్యంలో ఆయిల్ ఇంజన్లు వస్తే తప్ప ప్రయోజనం ఉండదు. రెంటికీ చెడ్డ రేవడిలా అన్నదాత ఇంతవరకు జిల్లాకు ఆయిల్ ఇంజన్లు రాకపోవడంతో వాడుతున్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరోప్రక్క ప్రభుత్వం రెయిన్గన్లు వినియోగించని నేప«థ్యంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వక రెండు విధాలా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెంటికీ చెడ్డ రేవడిలా అన్నదాత పరిస్థితి తయారైంది. ఎండుతున్న పొలానికి బోరున్న రైతు నీరివ్వాల్సిందే! ప్రస్తుతం పొలంలో ఎండుతున్న పొలం ఎవరిదన్నది అనవసరం. కానీ ఆ పొలానికైతే నీటి తడులు అందించాల్సిందే! సమీపంలో బోరున్న రైతు ఇవ్వాల్సిందే....లేకపోతే బలవంతంగానైనా ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాధినేత వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏం సమస్య ఎదుర్కొవాల్సి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. నీరు ఇవ్వమని చెబితే ఒకరికి మోదం...వద్దంటే మరొకరికి ఖేదం అన్న తరహాలో తమ పరిస్థితి తయారైందని పలువురు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు వాపోతున్నారు.