దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు: వైఎస్ జగన్ | Chandrababu in Deep Trouble on Cash for Vote Case, says YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు: వైఎస్ జగన్

Published Fri, Sep 2 2016 10:38 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు: వైఎస్ జగన్ - Sakshi

దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు: వైఎస్ జగన్

ఇడుపులపాయ: సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో పూర్తిగా కూరుకుపోయారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పాలనను గాలికి వదిలేసి ఈ కేసు నుంచి బయట పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం పంట పొలాల్లో రెయిన్ గన్ల పనితీరును వైఎస్ జగన్ పరిశీలించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్లుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి స్వయంగా పట్టుబడడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. పట్టుబడిన తర్వాత కూడా చంద్రబాబు అరెస్ట్ కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకున్న అధికారాలు, పరిచయాలను ఉపయోగించుకుని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన కేసుల మాఫీ గురించి సుజనా చౌదరిని ఢిల్లీకి పంపారని అన్నారు.

చంద్రబాబు పాత్రపై విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించిన వెంటనే సుజనా చౌదరి పరుగున వెళ్లి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అమిత్ షాలను కలిశారని గుర్తు చేశారు. హైదరాబాద్ వచ్చి గవర్నర్ తో భేటీ అయ్యారని వెల్లడించారు. ప్రత్యేకహోదా గురించి కలిసామంటూ జనం చెవుల్లో పూలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాకు, గవర్నర్ కు సంబంధం ఉందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంతా మోసం, అబద్ధం అని వ్యాఖ్యానించారు. డబ్బు సంపాదన, కేసుల నుంచి ఎలా బయటపడాలనే దాని గురించే చంద్రబాబు ఆలోచిస్తుంటారని అన్నారు.

రైతులపై చంద్రబాబు ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్ జగన్ అన్నారు. 2013-14లో రైతులకు ఇన్​ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టారని చెప్పారు. 2014-15లో కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను కుదించి రూ.600 కోట్లే ఇచ్చారని తెలిపారు. 11 ఏళ్ల క్రితమే రెయిన్ గన్లు వాడుకలోకి వచ్చాయన్నారు. నీళ్లు లేకుండా రెయిన్గన్లుతో ఏం ఉపయోగమని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి నీళ్లు అందించాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లకు అవకాశమున్నా కేవలం 15 టీఎంసీలే ఉంచుతున్నారని అన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలు, రాయలసీమ కరువుతో అల్లాడుతున్న పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అన్నదాతలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement