ఏడీఏను నిలదీస్తున్న రైతులు
పంటలు ఎండాకా.. రెయిన్ గన్స్‌తో ఏం చేయాలి
Published Thu, Sep 8 2016 9:55 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
– వ్యవసాయ అధికారులను నిలదీసిన రైతులు
ఆదోని: ‘వారం రోజులుగా పైప్‌లు, ఆయిల్ ఇంజన్, రెయిన్ గన్స్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.. పంటలన్ని ఎండిపోయాయి.. ఇప్పుడు రెయిన్ గన్స్ ఇస్తే ఏమి చేసుకోవాలి’ అంటూ రైతులు వ్యవసాయాధికారులపై మండిపడ్డారు. ఆదోని మండలం నెట్టేకల్, సుల్తానాపురం, కపటి, పెసలబండ, తదితర గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఏడీఏ కార్యాయంకు చేరుకొని అధికారులను నిలదీశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఫారం ఫాండ్స్‌లో నీళ్లు ఉండికూడా అధికారుల నిర్లక్ష్యంతో పంటపైరుకు నీటి తడులు పెట్టుకోలేని దుస్థితి ఏర్పడిందని ఏడీఏ చెంగలరాయుడును నిలదీశారు. మొదటి విడతలో ఇచ్చిన పైప్‌లు, ఆయిల్ ఇంజన్లు, రెయిన్ గన్లు నాయకులు తమ ఇళ్లల్లో పెట్టుకున్నారన్నారు. వారి పొలాలకు తడులు పెట్టుకున్న తర్వాత ఇస్తామంటూ వారం రోజులుగా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాము ఏవో, ఏడీఏ కార్యాలయంలో అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బంది దష్టికి కూడా తెచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్ని అవసరమైతే అన్ని రెయిన్ గన్‌లు, పైప్‌లు, ఆయిల్ ఇంజన్లు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలన్నీ ఎండిపోయిన తర్వాత ఇస్తారా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. రైతుల ఆందోళన, ఆగ్రహంతో దిగొచ్చిన ఏడీఏ వెంటనే తమవద్ద ఉన్న పైప్‌లు, ఆయిల్ ఇంజన్లు, రెయిన్ గన్‌లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.
నీళ్లున్నా పంటలెండాయి: బారికి రాముడు, పెసలబండ
నా పొలంలో ఫారంపాండ్‌లో ఆరడుగుల లోతులో నీళ్లు ఉన్నాయి. నాకున్న రెండున్నరెకరాల పత్తి పంట పైరుకు రెండు తడులు నీరు పెట్టుకోవచ్చు. ఆయిల్ ఇంజన్, పైప్‌లు, రెయిన్ గన్ ఇస్తామని వారం రోజులుగా తిప్పుతున్నారు. పంటపైరు ఎండిపోయి కాపు రాలిపోతోంది. ఇదిగో.. అదిగో అంటూ మభ్యపెట్టారు. పంట అంతా ఎండిపోయింది.
రెండు వారాల క్రితమే ఇచ్చివుంటే నష్టం తగ్గేది : హుసేనప్ప, నెట్టేకల్
వర్షం ఎండబెట్టడంతో పత్తి, మిరప పైరు వాడిపోయింది. మా పొలంలో నాలుగు ఫారం ఫాండ్స్‌లో నీరున్నప్పటికీ సకాలంలో పైరుకు తడులు పెట్టుకోలేక పోయాను. ఫారం ఫాండ్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయిల్ ఇంజను, పైప్‌లు ఇస్తామన్నారు. రెండువారాల క్రితం ఇచ్చివుంటే పంటపైరు ఎండేది కాదు.
రైతులంటే అలుసు: సరోజమ్మ, సుల్తాపురం
నీటి సౌకర్యం ఉన్న రైతులకు వెంటనే ఆయిల్ ఇంజన్లు, పైప్‌లు ఇస్తామన్నారు. మా ఫారం ఫాండ్‌లో నీళ్లున్నాయని ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చి వారం దాటిపోయింది. ఇప్పటి వరకు పైప్‌లు, ఆయిల్ ఇంజన్ పంపిణీ అతీగతి లేదు. అధికారులు చెప్పింది ఎందుకు చేయరో అర్థం కాదు. ఇప్పటికైనా పంటలు రక్షించే చర్యలు చేపట్టాలి.
Advertisement
Advertisement