రెయిన్ గన్ పనితీరును రైతులకు వివరిస్తున్న సంగీతలక్ష్మీ
-
మైక్రో ఇరిగేషన్ పీడీ జీ.సంగీతలక్ష్మీ
హుస్నాబాద్ రూరల్ : మెట్టప్రాంత రైతులకు రెయిన్‌గన్స్ ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని మైక్రో ఇరిగేషన్ పీడీ సంగీతలక్ష్మీ అన్నారు. బుధవారం మండలంలోని గుబ్బడిలో అన్నబోయిన సత్యనారాయణ రైతు తన పత్తి పంటలో ఏర్పాటు చేసిన రెయిన్ గన్‌ను పరిశీలించారు. గన్ ద్వారా పంటలకు నీరు అందించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బావులు, బోర్లలో కొద్దిపాటి నీరున్నా.. రెయిన్‌గన్స్‌తో అధిక విస్తీర్ణంలో సాగుచేసుకుని సులభంగా తడులు అందించవచ్చన్నారు. సబ్సిడీపై గన్స్‌ను అందిస్తున్నామని వివరించారు. మూడు మీటర్ల ఎత్తులో ఉండే రెయిన్‌గన్ 16 నుంచి 20 మీటర్ల దూరం వరకు వర్షం మాదిరిగా నీటిని అందిస్తుందని పేర్కొన్నారు. గంట వ్యవధిలోనే ఎకరం విస్తీర్ణానికి నీరు అందించవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా 46 వేల మంది రైతులకు బిందు, తుంపుర సేద్యం కింద డ్రిప్, స్ప్రింక్లర్లు అందించామని, రెయిన్ గన్స్‌ను నలుగురు రైతులకు అందించామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, చిన్న, సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీపై రెయిన్ గన్స్‌ను అందిస్తున్నామన్నారు. యూనిట్ విలువ రూ.23,260అని, 25 పైపులు, ఒక గన్ ఇస్తామన్నారు. గన్స్ బహిరంగ మార్కెట్లో రూ.7,800కు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో జైయిన్ కంపెనీ ఇంజినీరు భూషణ్, టెక్నీషియన్ ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.