రక్షకతడులకు సంబంధించిన పరికరాలు వెనక్కు ఇవ్వడంలేదని 123 మంది రైతులపై మండల వ్యవసాయాధికారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకొంది.
నల్లమాడ : రక్షకతడులకు సంబంధించిన పరికరాలు వెనక్కు ఇవ్వడంలేదని 123 మంది రైతులపై మండల వ్యవసాయాధికారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకొంది. వివరాల్లోకెళితే... ఈ ఏడాది ఖరీఫ్‌లో వ్యవసాయశాఖ నుంచి రక్షకతడుల పరికరాలు తీసుకొని తిరిగి ఇవ్వని రైతులపై కేసులు పెట్టాలంటూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు మండలంలో పరికరాలు తిరిగి ఇవ్వని 123 మంది రైతుల జాబితాను మండల వ్యవసాయాధికారి ఓబిరెడ్డి మంగళవారం స్థానిక పోలీసులకు అందజేశారు. మొత్తం 233 మంది రైతులు పైపులు, స్ప్రింక్లర్లు, రెయిన్‌గన్‌లు, ఆయిల్ ఇంజన్లు తీసుకెళ్లగా, ఇప్పటివరకు 110 మంది పరికరాలు వాపస్ చేసినట్లు ఏఓ తెలిపారు.
తక్కిన వారిపై ఏఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా తాము కూడా రైతులకు ఓసారి చెప్పి చూస్తామని, అప్పటికీ వినకపోతే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పినట్లు తెలిసింది. రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయంపై ఏఓ ముందుగా తహసీల్దార్ ఏఎస్ అబ్దుల్‌హమీద్‌ను కలిసి చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నిక ముగియగానే రెవెన్యూ, వ్యవసాయ సిబ్బందితో టీంలు ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటిద్దామని తహసీల్దార్ సూచించినట్లు తెలిసింది. ఫిర్యాదు జాబితాలో అత్యధికంగా టీడీపీ వారే ఉన్నట్లు సమాచారం.