
రెయిన్‌గన్లతో కరువును తరమలేరు
ఆచరణ యోగ్యమైన పనులనే తలపెట్టండి
– రెయిన్‌గన్ వినియోగాలపై వర్క్‌షాప్‌లో ఎమ్యెల్యే విశ్వ
– అధికారపార్టీ ఎమ్మెల్యేలు కనిపించని వైనం
అనంతపురం సిటీ : రెయిన్‌గన్లవును తరిమికొడతాం. పంటకు ప్రాణం పోస్తామంటూ ఆచరణ యోగ్యం కాని కోతలతో ప్రజలను మభ్య పెట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ హాల్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెయిన్‌గన్‌ల వినియోగంపై వర్క్‌షాపు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీతతో పాటు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, యామినీబాల, వరదాపురం సూరి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హారిజవర్‌లాల్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘‘రెయిన్‌గన్‌లను వినియోగించాలంటే నీరు కావాలి. నీరు లేకుండా రెయిన్‌గన్‌లతో పంటకు రక్షక తడులు ఇవ్వడం కుదరదు. గతేడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల ఎకరాలకు రక్షక తడులిచ్చామని చెప్పింది.
కనీసం అవగాహన లేకుండా ప్రజలకు ఇలా చెబితే ఎలా అని కూడా ఆలోచించలేదు. ఫలితంగా అభాసుపాలయ్యారు. ఈ క్రమంలో ముందుగానే ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే ప్రయత్నం చేసింది. మంచిదే...దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఈసారైనా ఆచరణ యోగ్యమైన కార్యాలు చేపట్టండి. ఇక పంట కుంటలతో భూగర్భ జలాలు పెరుగుతాయని చెబుతున్నారు. దీనికి ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవు.’’ అన్నారు. సమావేశం అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ గతేడాది తలెత్తిన లోటు పాట్లను సరిదిద్దుకునేందుకు రక్షక తడులను ప్రణాళికా బద్ధంగా అందించాలని వర్కుషాపు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి పట్టిసీమ నుంచి నీటిని తెచ్చి జిల్లాలో తాగు, సాగు నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణం, తేమ శాతం, నీటి లభ్యత వివరాలను తెలుసుకుంటామన్నారు. బెట్టదశలో ఉన్న పంటను వెంటనే కాపాడుతామన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు
గతేడాది జిల్లాలో పంటలు ఎండినా ప్రభుత్వానికి తెలియని దుస్థితి. ఈ ఏడాది అలా జరక్కూడదని ముందుగా రైతులకు చేరువుగా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనలను అధికారపార్టీ నేతలు బేఖాతరు చేశారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమావేశానికి అధికార పార్టీ నేతలే డుమ్మాకొట్టారు. ముగ్గురు మంత్రులున్న వేదికపై అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా ఎవరూ కనిపించకపోవడం విమర్శలకు తావిచ్చింది.