
ప్రజా విశ్వాసం లేకనే ఎమ్మెల్యేల కొనుగోలు
జల జాగరణ దీక్ష ముగింపు సభలో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
బెళుగుప్ప: ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కాదుకదా ఆయన నాన్న వచ్చినా తనను కొనలేడని అన్నారు.
హంద్రీ-నీవా మొదటి దశ ఆయకట్టుకు నీటి సాధన కోసం అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే చేపట్టిన జలజాగరణ దీక్ష ఆదివారం ఉదయం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను కూడా టీడీపీలోకి రమ్మన్నారంటూ ఆ పార్టీ నేతలు దుష్ర్పచారం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. తనను కొనుగోలు చేసి, పార్టీ మార్పించే దమ్ము, ధైర్యం ఏ టీడీపీ నాయకుడికీ లేదన్నారు. తాము ఒక తల్లిబిడ్డలుగా పార్టీలు మారే వ్యక్తులం కాదన్నారు.