సాక్షి కడప/అగ్రికల్చర్: జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 69.2 మిల్లీ మీటర్లకుగాను 127 మిల్లీ మీటర్లు కురిసింది. జులై నెల సాధారణ వర్షపాతం 96.7 మిల్లీ మీటర్లు కాగా 120.8 మిల్లీ మీటర్లు కురిసింది. నీరు భూగర్భంలోకి ఇంకిపోయాయేగాని, భూబాగంపై ఉన్న చెరువులు, కుంటల్లో చుక్కనీరు చేరలేదు. ఖరీఫ్ సీజన్ జూన్‌నెలలో ప్రారంభమైనప్పుడు పంటల సాగుకు పదును వర్షాలు కురిశాయి. దీంతో కొందరు రైతులు ప్రధాన పంటలను కొద్దిమేర సాగు చేశారు. జూలై నెల మొదట్లో ఓ మోస్తరు వానలు పడటంతో మళ్లీ సాగు చేపట్టారు. అయితే జులె నెల మధ్య నుంచి వరుణదేవుడు ముఖం చాటేయడంతో పంటలు వాడుముఖం పట్టాయి. జులై నెల చివరలో కొద్దిమేర వాన కురవడంతో ఇక పంట పండుతుందని ఆశపడ్డారు. కానీ ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చినుకు జాడ కనిపించలేదు. దీంతో అన్నదాతలు కుంగిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతోదిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఏటా పంటలకు చేసిన అప్పులు కరువుతో పెరిగిపోతున్నాయే తప్ప తీర్చిన దాఖలాలు లేవు.
వేరుశనగలో ఊడల జాడలేదు
జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ సాధారణ సాగు 33546 హెక్టారులకాగా దాన్ని అధిగమించి 41466 హెక్టార్లలో వేశారు. సాగు చేసిన వేరుశనగ ప్రస్తుతం దిగుబడి వచ్చే సమయం. చినుకుల జాడలేకపోవడంతో పంట చేతికి వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెలల సమయం గడచిపోయిందని, వేరుశనగ పంటలో ఊడలు దిగే సమయం కావడంతో భూమిలో తేమ లేనందువల్ల పిందెలు ఏర్పడే అవకాశమేలేదని వ్యవసాయాధికారులు అంటున్నారు. రెయిన్‌గన్‌లతో పంటల రక్షణ సాధ్యం కాదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యవసాయశాఖ పంటల సాగుపై వేసిన అంచనాలు కూడా తగ్గిపోయాయి. పెట్టుబడులు కూడా వచ్చేస్థితిలేదని రైతులు సంఘాలు అంటున్నాయి.
రూ. 165 కోట్ల మేర నష్టం
జిల్లాలో వేరుశనగ పంట సాగులో ఎకరానికి దుక్కులు, ఎరువులు, విత్తనాలు, విత్తనం వేయడం, కలుపుతీత తదితర ఖర్చులు కలిపి రూ. 16 వేలు పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన మొత్తం సాగు కోసం రూ.165 కోట్లు పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చే సూచనలు కనిపించకపోవడంతో పెట్టుబడి పోయినట్లేనని వ్యవసాయాధికారులు అంటున్నారు.
ఎకరం పంట కూడా ఎండటానికి వీల్లేదంటున్న వ్యవసాయశాఖ మంత్రి
గురవారం విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎకరం పంట కూడా ఎండిపోవడానికి వీల్లేదని చెప్పారు. దీంతో జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, మండల వ్యవసాయాధికారులు నీరు ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు.
ఆయిల్ ఇంజన్లు వస్తేనే ప్రయోజనం
జిల్లాలోని రాయచోటి, కడప, లక్కిరెడ్డిపల్లె, ప్రొద్దుటూరు, మైదుకూరు, ముద్దనూరు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లోని సుమారు 24 మండలాల్లో రెయిన్ గన్లను వినియోగించి పంట తడులు అందించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు రెయిన్ గన్లు, అందుకు సంబంధించిన పైపులు వచ్చినా ఇంతవరకు ఒక్క ఆయిల్ ఇంజన్ కడపకు రాలేదు. రెండు, మూడు రోజుల్లో రావచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. సుమారు 100కు పైగా ఆయిల్ ఇంజన్లు కడపకు రావాల్సి ఉంది. ఇప్పటికే మండలాలకు రెయిన్‌గన్లు, ఆయిల్ ఇంజన్లను వ్యవసాయశాఖ అధికారులు కేటాయించారు. ప్రస్తుతం పంటలుఎండుతున్న నేపథ్యంలో ఆయిల్ ఇంజన్లు వస్తే తప్ప ప్రయోజనం ఉండదు.
రెంటికీ చెడ్డ రేవడిలా అన్నదాత
ఇంతవరకు జిల్లాకు ఆయిల్ ఇంజన్లు రాకపోవడంతో వాడుతున్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరోప్రక్క ప్రభుత్వం రెయిన్‌గన్లు వినియోగించని నేప«థ్యంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వక రెండు విధాలా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెంటికీ చెడ్డ రేవడిలా అన్నదాత పరిస్థితి తయారైంది.
ఎండుతున్న పొలానికి బోరున్న రైతు నీరివ్వాల్సిందే!
ప్రస్తుతం పొలంలో ఎండుతున్న పొలం ఎవరిదన్నది అనవసరం. కానీ ఆ పొలానికైతే నీటి తడులు అందించాల్సిందే! సమీపంలో బోరున్న రైతు ఇవ్వాల్సిందే....లేకపోతే బలవంతంగానైనా ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాధినేత వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏం సమస్య ఎదుర్కొవాల్సి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. నీరు ఇవ్వమని చెబితే ఒకరికి మోదం...వద్దంటే మరొకరికి ఖేదం అన్న తరహాలో తమ పరిస్థితి తయారైందని పలువురు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు వాపోతున్నారు.
జిల్లాలో మళ్లీ కరువు ఛాయలేనా
Published Fri, Aug 19 2016 9:27 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
Advertisement
Advertisement