టీడీపీ భయపడుతోంది.. బాలకృష్ణ విజిల్స్‌ సిగ్గుచేటు | Minister Chelluboina Botsa Slams TDP Leaders Behaviors At assembly | Sakshi
Sakshi News home page

స్కిల్‌ స్కామ్‌లో టీడీపీ భయపడుతోంది.. బాలకృష్ణ విజిల్స్‌ సిగ్గుచేటు

Published Fri, Sep 22 2023 4:15 PM | Last Updated on Fri, Sep 22 2023 4:46 PM

Minister Chelluboina Botsa Slams TDP Leaders Behaviors At assembly - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో చంద్రబాబుకు కేటాయించిన కుర్చీపైకి ఎక్కి బాలకృష్ణ విజిల్స్ వేయడం సిగ్గుచేటని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని, అసెంబ్లీలో ఈలలు వేసి సభ సాంప్రదాయాలను బాలకృష్ణ పాడు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్ కేసులో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో సీఐడీ అధికారులుకోర్టుకు వివరించారని తెలిపారు. ఢిల్లీ నుండి పెద్ద న్యాయవాదులు వచ్చినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. పీఎస్‌ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ఎలా డబ్బు దండుకున్నదీ సీఐడీ గుర్తించిందని అన్నారు.

సమస్యలపై ఎందుకు చర్చించలేదు
సభలో రచ్చ చేయటానికి టీడీపీ సభ్యులు వచ్చారని విమర్శించారు. గొడవలు చేసిన ఆరుగురిని సస్పెండ్ చేస్తే టీడీపీ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారని మంత్రి తెలిపారు. మిగతా వారు సభలో కూర్చుని సమస్యలపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. వారెవరికీ ప్రజా సమస్యలు పట్టలేదని అర్ధం అవుతుందని, అసెంబ్లీలో మాట్లాడటానికి చేతగాక టీడీపీ సభ్యులు పారిపోయారని దుయ్యబట్టారు. నేరం చేసిన గజదొంగ చంద్రబాబు అని.. అందుకే కోర్టు కూడా క్వాష్ పిటిషన్‌ను తోసిపుచ్చిందని తెలిపారు.  కోర్టు తీర్పుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందన్నారు. 

టీడీపీ వాళ్ల దగ్గర విషయం లేదు
‘వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదు. సభాపతి, మండలి ఛైర్మన్ అంటే టీడీపీ నేతలకు మర్యాద లేదు. సభకు రానంటున్నారంటే నేరం అంగీకరించినట్లే. టీడీపీ నేతల దగ్గర విషయం లేదు కాబట్టే సభ నుంచి పారిపోయారు. ఈరోజు సభలో ప్రతిపక్షం తీరు సభా చరిత్రలో దుర్దినం. వ్యవస్థలను దుర్వినియోగం చేయడం, నాశనం చేయడం చంద్రబాబు, టీడీపీ నేతల నైజం. సస్పెండ్ కాకుండా మిగిలిన సభ్యులు సభలో ఉండి ఉంటే చంద్రబాబు అవినీతి వివరాలను తెలుసుకునేరు. 

ఆ అవసరం లోకేష్‌, కుటుంబానికే ఉంది
చంద్రబాబు యువతకు ద్రోహం చేశాడు. 5 రోజులు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి యువతను మోసం చేశాడు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో ప్రధాన ముద్ధాయి అని అప్పటి అధికారులే చెప్పారు. చంద్రబాబుకు హాని తలపెట్టాల్సిన అవసరం వైఎస్సార్‌సీపీకి లేదు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్‌కు, ఆయన కుటుంబానికే ఉందిఏ తప్పు చేసినా తెలివిగా తప్పించుకోగలననే చంద్రబాబు స్కిల్.. స్కిల్ స్కామ్‌లో పారలేదు’ అని మంత్రి చెల్లుబోయిన అన్నారు.

చర్చకు రమ్మంటే రావడం లేదు: మంత్రి బొత్స
చంద్రబాబు భారీగా  అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని  మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అయినా కూడా ఏకపక్షంగా కేసులు ఎత్తి వేయాలని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు మీద చర్చకు రమ్మని తాము కోరితే రావడం లేదని అన్నారు. సభ నుంచి వారు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. 

కావాలనే సభలో గొడవ
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దోపిడీ గురించి తెలుసని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ సభ్యులకు కూడా ఈ విషయం తెలుసని.. కానీ కావాలనే సభలో గొడవ చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తాము పూర్తి వివరాలతో వివరించామని చెప్పారు. చంద్రబాబు ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయలు ఎలా పక్క దారి పడతాయని ప్రశ్నించారు. ఏయే కంపెనీల ద్వారా డబ్బు కొల్లగొట్టారో సీఐడీ నిగ్గు తేల్చిందని తెలిపారు. 

దొరికిపోతామని టీడీపీ భయపడుతోంది
‘ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభా సమయాన్ని వృధా చేస్తుంది. అవినీతికి పాల్పడ్డ బాబుపై కేసు ఎత్తేయాలని రచ్చ చేస్తున్నారు. రెండు రోజులుగా సభలో టీడీపీ  అసభ్యంగా ప్రవర్తిస్తుంది. చర్చకు రమ్మంటే ఎందుకు టీడీపీ రావటం లేదో సమాధానం చెప్పాలి. స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు. స్కిల్ స్కామ్‌లో ఎంత అవినీతి జరిగిందో.. ఎలా జరిగిందో మేం సభలో చెప్పాం. టీడీపీ ఏం చెప్తుందో సభలో చెప్పొచ్చుగా. చర్చల్లో పాల్గొంటే దొరికిపోతాం అని టీడీపీ భయపడుతుంది. తప్పు చేశారు కాబట్టే హై కోర్ట్ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. సీమెన్స్ ఒప్పందం ప్రకారం నిధులు ఏమయ్యాయో టీడీపీ సమాధానం చెప్పాలి’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement