LIC Colony
-
మీరూ కరెంట్ అమ్మొచ్చు!
విజయవాడ ఎల్ఐసీ కాలనీకి చెందిన ఎ.సత్యగంగాధర్ ఇంటికి నెలకు రూ.1,200 కరెంటు బిల్లు వచ్చేది. దీంతో ఇటీవల తన ఇంటికి సోలార్ రూఫ్ టాప్ యూనిట్‌ను అమర్చుకున్నారు. ఇప్పుడు ఆయన తన అవసరాలకు వాడుకోగా మిగులు విద్యుత్‌ను డిస్కంకు ఇస్తున్నారు. ఇలా ఆయన నెలకు 100–150 యూనిట్ల మేర విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు అమ్మడం ద్వారా రూ.600 నుంచి రూ.1000 వరకు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: ఇన్నాళ్లూ వాడుకున్న కరెంటుకు బిల్లులు చెల్లించడమే వినియోగదారుడికి తెలుసు. కానీ, కొద్ది రోజులుగా వినియోగదారుడే కరెంట్‌ను విద్యుత్ సంస్థలకు విక్రయించే పరిస్థితి వచ్చింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ‘సూర్యశక్తి’ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్), నెడ్‌క్యాప్‌లు ఈ వెసులుబాటు కల్పించాయి. పర్యావరణహిత సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వినియోగదారుల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను రాయితీపై ఏర్పాటు చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఈ సంస్థలు మూడు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం 648 మంది గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 631 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 444 గృహాలకు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇచ్చారు. మరో 138 కనెక్షన్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తం 444 కనెక్షన్లలో 147 సూర్యశక్తి పథకం కింద మంజూరయ్యాయి. విద్యుత్ విక్రయం ఇలా.. సోలార్ రూఫ్ టాప్ వినియోగదారులు ఉత్పత్తయిన సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు తిరిగి అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఇలా ఒక్కో సోలార్ విద్యుత్ యూనిట్‌కు రూ.5.58 చొప్పున వినియోగదారుడికి చెల్లిస్తుంది. యూనిట్ల నమోదుకు వీలుగా నెట్ మీటర్లు అమర్చారు. కాగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ల నుంచి 134.5 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో నెలకు 64,500 యూనిట్ల సోలార్ విద్యుత్‌ను విక్రయిస్తున్నారు. యూనిట్‌కు రూ.5.58 చొప్పున పవర్ గ్రిడ్ వీరి నుంచి కొనుగోలు చేస్తోంది. ఇలా ఏడాదికి విద్యుత్ అమ్మకం ద్వారా వీరు రూ.43 లక్షలు ఆర్జిస్తున్నారు. మరోవైపు.. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కూలు, కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు. ‘సూర్యశక్తి’ ఇలా.. - రూఫ్‌పై 100 (10 గీ 10) చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. - మీటర్ తమ పేరుపై ఉన్న వారెవరైనా నెడ్‌క్యాప్, ఏపీఎస్పీడీసీఎల్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. - ప్యానెల్స్ నిర్వహణకు ప్రత్యేక సంస్థలున్నాయి. సర్వీస్ కోసం తక్కువ ఖర్చుతో సేవలందుతాయి. - ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నప్పుడు, వర్షం కురిసేటప్పుడు విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. మిగతా సమయాల్లో నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. - ఈ పథకం కింద ఒక కిలోవాట్ సామర్థ్యం ఉన్న యూనిట్ అమరుస్తారు. - యూనిట్ ఏర్పాటు చేసేందుకు రూ.60 వేలు ఖర్చవుతుంది. అయితే ఇందులో రూ.50 వేలు రాయితీ ఉంటుంది. వినియోగదారుడు భరించాల్సింది కేవలం రూ.10 వేలు మాత్రమే. విజయవాడలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ -
అత్తింటి ఆగడాలకు అబల బలి
ఆడపిల్ల పుట్టిందని వేధింపులు వివాహిత అనుమానాస్పద మృతి ఆత్మహత్య చేసుకుందంటున్న అత్తింటివారు హత్యే అంటున్న మృతురాలి కుటుంబసభ్యులు విజయవాడ క్రైం/గుణదల, న్యూస్‌లైన్ : ఆడపిల్ల పుట్టిందని అత్తింటివారు పెడుతున్న వేధింపులు ఓ వివాహితను బలిగొన్నాయి. ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుంటే.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తునారు. విజయవాడలో సంచలనం కలిగించిన ఈ ఘటన ఎల్ఐసీ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ఎల్ఐసీ కాలనీకి చెందిన ఇనుమల నరేష్‌బాబు ఆటోనగర్‌లో ఆటోమొబైల్స్ షాపు నిర్వహిస్తుంటాడు. రెండున్నరేళ్ల కిందట బంటుమిల్లి మండలం నీలిపూడికి చెందిన శాంతిప్రియ (23)తో అతనికి వివాహమైంది. వివాహ సమయంలో ప్రియ కుటుంబసభ్యులు నరేష్ కుటుంబానికి లాంఛనాలు భారీగానే కట్టబెట్టారు. వీరి వివాహమైన కొద్ది రోజులకు నరేష్ తండ్రి అప్పారావు మృతిచెందారు. దీంతో ఆమె అడుగుపెట్టిన వేళావిశేషం మంచిది కాదంటూ అవమానించి సూటిపోటి మాటలతో వేధించేవారు. ఈ నేపథ్యంలో పెద్దలు జోక్యం చేసుకొని నచ్చచెప్పారు. అప్పటి నుంచి తన తండ్రి తన కొడుకు రూపంలో పుడతాడని నరేష్‌బాబు అంటుండేవాడు. అయితే ఏడాది తర్వాత నరేష్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. దీంతో శాంతిప్రియకు అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. నరేష్ అత్తింటి వారితో సంబంధాలు నెరపడం కూడా పూర్తిగా మానేశాడు. పండగలకు, పబ్బాలకు కూడా భార్యను ఒంటరిగానే పంపేవాడు. అనేకమార్లు అత్తింటివారు బతిమిలాడినా నరేష్ ప్రవర్తనలో మార్పు రాకపోగా.. తల్లి ఇందుమతితో కలిసి వేధింపులు ఎక్కువ చేశాడు. ఈ క్రమంలో శాంతిప్రియ గురువారం విగతజీవురాలై కనిపించింది. మధ్యాహ్నం సమయంలో శాంతిప్రియ ఉరేసుకుందని చెప్పి ఇరుగు పొరుగును పిలిచారు. వారు వచ్చిన తర్వాత కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమె పుట్టింటికి కబురు చేశారు. ఆమె మృతి సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈలోగా సమాచారం అందుకున్న మాచవరం సీఐ సీహెచ్ మురళీకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణ కోసం మృతురాలి భర్త, అత్తను అదుపులోకి తీసుకున్నారు. చంపేశారు... తొలి నుంచి శాంతిప్రియను అనేక ఇబ్బందులు పెట్టారని, ఆడపిల్ల పుట్టడంతో ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపించారు. గతంలో కూడా వీరు పెట్టే వేధింపులు పలుమార్లు తమ దృష్టికి తీసుకొచ్చినా నచ్చచెప్పి పంపామని, ఇంతటి అఘాయిత్యం జరుగుతుందనుకుంటే పంపేవాళ్లం కాదని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘పోస్టుమార్టం’ ఆధారంగా చర్యలు... ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేశాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. - సీహెచ్.మురళీకృష్ణారెడ్డి, సీఐ, మాచవరం పోలీస్‌స్టేషన్