పరిస్థితి భయంకరం.. ఊపిరి తీసుకోరాలేదు.. ఎక్కడివాళ్లక్కడ పడిపోయారు
చండీగఢ్: పంజాబ్ లుధియానాలోని గియాస్పూరలో కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకై 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులే ఉన్నారు. అయితే ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి అరవింద్ చౌబె.. ఉదయం గ్యాస్ లీకైనప్పుడు పరిస్థితి ఎలా ఉందో కళ్లకుగట్టినట్లు వివరించారు. ఊపిరి పీల్చుకోవడానికి స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని, ఎక్కడివాళ్లు అక్కడ స్పృహ తప్పిపడిపోయారని తెలిపారు.
'నేను మా సోదరుడు ఉదయం క్రికెట్ మ్యాచ్ ఆడాలనుకున్నాం. 7 గంటలకు గ్యాస్ లీకైందని నా సోదురుడు చెప్పాడు. వెంటనే మేం అక్కడకు చేరుకున్నాం. స్థానికులకు కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. స్పృహ తప్పి పడిపోయిన వాళ్లలో ఒక వ్యక్తి బతికున్నాడని గమనించి వెంటనే అంబులెన్సు వరకు తీసుకెళ్లాం. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మేము ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాం. ప్రాణాలతో బతికున్నామంటే నిజంగా మా అదృష్టం.' అని అరవింద్ చెప్పారు.
అరవింద్ సోదరుడు ఆశీశ్ మాట్లాడుతూ.. తమ వాళ్లను కాపాడుకునేందుకు వెళ్లే క్రమంలో కొంతమంది విషవాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలారని తెలిపారు. ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న తన భార్యపై నీళ్లుచల్లుతూ సాయం కోసం పిలిస్తే దగ్గరకు వెళ్లానని, ఈలోగా అతను కూడా స్పృహ కోల్పోయాడని వివరించాడు. ఈ ప్రాంతమంతా పొగ అలుముకుందని, ఎవరికీ ఊపిరాడలేదని పేర్కొన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి వచ్చారని తెలిపారు.
మరో ప్రత్యక్ష సాక్షి అర్జూ ఖాన్ మాట్లాడుతూ.. విషవాయువు పీల్చి తన 12 సోదరుడు చనిపోయాడని బోరున విలపించాడు. గ్యాస్ లీకైనప్పుడు అతను గదిలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. ఘటనలో చనిపోయినవారంతా దాదాపు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారేనని పేర్కొన్నాడు. కాగా.. గ్యాస్ లీకైన ప్రాంతాన్ని విపత్తు నిర్వహణ దళాలు నిర్బంధించాయి. ఇళ్లలో ఉన్నవారికి ఆస్పత్రికి తరలించాయి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్