పారిశ్రామిక ఉత్పత్తులకు గిరాకీ గ్రామాల్లోనే!
గ్రామీణ భారత జీవనశైలిలో మార్పు వచ్చిందా? అంటే వచ్చిందనే చెప్తున్నాయి పెద్ద పెద్ద పరిశ్రమలు. ఇందుకు నిదర్శనంగా వాటి ఉత్పత్తుల మార్కెట్‌నే సూచికలుగా చూపిస్తున్నాయి. గ్రామాల్లో నిత్యావసర వస్తువుల జాబితాలోకి షాంపూ ప్యాకెట్లు వచ్చాయి, టూత్ బ్రష్ పేస్టులు చేరాయి, కాస్మటిక్స్ చోటు చేసుకున్నాయి.
ఇలాంటి కొన్ని ఉత్పత్తులకు పట్టణాలు, నగరాల కంటే గ్రామాలే పెద్ద విపణిగా మారాయంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది నిజం. హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్ ఉత్పత్తుల మీద జరిగిన అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. కొన్ని కొత్త కంపెనీలైతే పట్టణాలలో ఇప్పటికే విస్తరించి ఉన్న చోట పోటీని ఎదుర్కోవడం కంటే నేరుగా గ్రామీణ ప్రాంతాలకు తమ ఉత్పత్తులను చేరవేయడం మంచిదనే అభిప్రాయానికీ వచ్చాయట.
ఈ అధ్యయన బృందం చెప్తున్నదేమిటంటే... గ్రామాల్లో ఇప్పుడు శీకాయ కనిపించడం లేదు, వేపపుల్లతో దంతధావనం లేదు, సున్నిపిండి ఊసేలేదు. పచ్చిపసుపు వంటి సహజసౌందర్య సాధనాల స్థానంలో ఫేస్‌ప్యాక్‌లు, క్రీములు చేరాయి. స్థూలంగా పరిగణిస్తే షాంపూలు, టూత్‌పేస్టుల వాడకం పెరిగినంతగా సౌందర్యసాధనాల మార్కెట్ పెరగలేదన్నది కూడా వాస్తవమే. ఇదమిత్థంగా చెప్పేదేమిటంటే... ఒకప్పుడు ఈ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాలకు చేరవేయడం పెద్ద సమస్యగా ఉండేది. ఏజెంట్లు 1980లలో ముఖ్యంగా హర్యానా, పంజాబ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడ్లబండ్లు, సైకిల్ మీద చేరవేసిన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితి 2010 నాటికి పూర్తిగా మారిపోయింది. టెలివిజన్ ప్రసారాలతో ప్రచారం సులువుగా జరుగుతోంది, రవాణా వ్యవస్థ మెరుగవడంతో వస్తువుల చేరవేతకు మార్గం సుగమమైంది.
వీటన్నింటికి తోడు గ్రామీణ భారతంలో సామాన్యుడికి కొనుగోలు శక్తి పెరిగింది. చేయడానికి పని దొరుకుతోంది. పది రూపాయలు ఖర్చు చేయగలిగిన ధైర్యం వచ్చింది. పట్టణంలో సామాన్యుడు ఇంటి అద్దెకు వెచ్చించే డబ్బుతో గ్రామాల్లో విలాసవంతంగా జీవించవచ్చని నిరూపిస్తున్నారు గ్రామీణులు. దీంతో కోట్లాది రూపాయలు పెట్టి పరిశ్రమలు నెలకొల్పి, ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీలు తమ పరిశ్రమల మనుగడ కోసం గ్రామాలనే నమ్ముకుంటున్నాయి.