lingala ghanapur
-
సీఎం కేసీఆర్ ఎటువైపు
సాక్షి, వరంగల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై దేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల పక్షమా, బీజేపీ వైపా తేల్చుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు సూచించారు. చట్టాలకు వ్యతిరేకంగా హన్మకొండలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న వీహెచ్‌ను జనగామ జిల్లా పెంబర్తి బైపాస్ వద్ద అడ్డుకున్నారు. అంతలోనే సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు వస్తుండటంతో ఆయనను లింగాలఘణపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వీహెచ్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై భారత్ బంద్‌లో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నా, సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే మార్పు వచ్చిందన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేకశారు. హన్మకొండలో విద్యార్థులు చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తనను అరెస్టు చేయడమేమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, రైతులకు న్యాయం జరిగే వరకు ప్రాణాలర్పించైనా పోరాడుతామని అన్నారు. కాగా పోలీసు స్టేషనులో వీహెచ్‌ను కాంగ్రెస్ నాయకులు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, లింగాజీ, ఎండీ అజీజ్, విజయ్‌మనోహార్, బిక్షపతి, భృగుమహర్షఙ, రాజిరెడ్డి తదితరులు కలవగా, అనంతరం ఆయనను సొంత పూచీకత్తుపై పోలీసులు పంపించారు. -
స్టేషన్ ముందు బాధిత కుటుంబం ఆందోళన
లింగాల ఘణపూర్: వరంగల్ జిల్లా లింగాల ఘణపూర్ పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ బాధిత కుటుంబం స్థానిక నాయకులతో కలసి ఆందోళనకు దిగింది. మండల కేంద్రానికి చెందిన జాగరి చంద్రయ్య ఇంట్లో ఈ నెల 16వ తేదీన చోరీ జరిగింది. రూ.1.20 లక్షల నగదు, బంగారం, వెండి చోరీకి గురైనట్టు బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పోలీసులు విచారణలో భాగంగా బాధితుడు చంద్రయ్య కాల్ డేటాను పరిశీలించారు. అందులో చోరీ జరిగిన సమయానికి ముందు, తర్వాత ఓ మహిళ నంబర్‌కు కాల్స్ చేసినట్టు ఉంది. దీంతో పోలీసులు సోమవారం సాయంత్రం చంద్రయ్యను పిలిపించి విచారించారు. ఆ మహిళతో ఏం సంబంధం అంటూ దాడి చేసినట్టు సమాచారం. తన భర్తను అకారణంగా కొడుతున్నారంటూ చంద్రయ్య భార్య శారద పీఎస్ వద్దకు పిల్లలతో చేరుకుని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోతే స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి చంద్రయ్యను విడిచిపెట్టారు. నగదు, బంగారం వస్తువులు చోరీకి గురి కావడంతో పాటు ఫిర్యాదు ఇచ్చినందుకు దాడి చేసి కొట్టారని ఆరోపిస్తూ చంద్రయ్య కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలసి మంగళవారం ఉదయం స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. -
బైక్ బోల్తా.. అర్చకుడి మృతి
లింగాల ఘన్పూర్: వరంగల్ జిల్లాలో బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ పూజారి ప్రాణాలు కోల్పోయాడు. లింగాల ఘన్పూర్ మండలం కల్లెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు జీడికల్ రామాలయంలో అర్చకునిగా పనిచేసే పవనకుమారాచార్యులుగా గుర్తించారు. పవన్ గురువారం రాత్రి బైక్‌పై జనగామకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కల్లం వద్ద బైక్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.