స్టేషన్ ముందు బాధిత కుటుంబం ఆందోళన
లింగాల ఘణపూర్: వరంగల్ జిల్లా లింగాల ఘణపూర్ పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ బాధిత కుటుంబం స్థానిక నాయకులతో కలసి ఆందోళనకు దిగింది.
మండల కేంద్రానికి చెందిన జాగరి చంద్రయ్య ఇంట్లో ఈ నెల 16వ తేదీన చోరీ జరిగింది. రూ.1.20 లక్షల నగదు, బంగారం, వెండి చోరీకి గురైనట్టు బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పోలీసులు విచారణలో భాగంగా బాధితుడు చంద్రయ్య కాల్ డేటాను పరిశీలించారు. అందులో చోరీ జరిగిన సమయానికి ముందు, తర్వాత ఓ మహిళ నంబర్‌కు కాల్స్ చేసినట్టు ఉంది. దీంతో పోలీసులు సోమవారం సాయంత్రం చంద్రయ్యను పిలిపించి విచారించారు. ఆ మహిళతో ఏం సంబంధం అంటూ దాడి చేసినట్టు సమాచారం.
తన భర్తను అకారణంగా కొడుతున్నారంటూ చంద్రయ్య భార్య శారద పీఎస్ వద్దకు పిల్లలతో చేరుకుని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోతే స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి చంద్రయ్యను విడిచిపెట్టారు. నగదు, బంగారం వస్తువులు చోరీకి గురి కావడంతో పాటు ఫిర్యాదు ఇచ్చినందుకు దాడి చేసి కొట్టారని ఆరోపిస్తూ చంద్రయ్య కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలసి మంగళవారం ఉదయం స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.