నేటి నుంచి పెద్దగట్టు జాతర
ఐదు రోజులపాటు లింగమంతులస్వామి ఉత్సవాలు..
సూర్యాపేట: నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. వంద ఏళ్ల చరిత్ర గల ఈ జాతరను రెండేళ్ల కొకసారి ఐదు రోజులపాటు జరుపుకొంటారు. తెలంగాణ తోపాటు, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆది వారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే ఈ జాతర.. 12వ తేదీ మకర తోరణం తరలింపుతో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి జాతర కావడంతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు ఇతర ప్రముఖలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ జాతరకు సుమారు 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.