Liquor depots
-
రాష్ట్రంలో మరో 9 మద్యం డిపోలు
-
ఇంకా తాగిద్దాం!
సాక్షి, అమరావతి:మద్యం ఆదాయం పెంచుకునేందుకు సర్కారు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. బెల్టు షాపులు, పర్మిట్ రూంల ద్వారా జనం చేత ఫుల్లుగా తాగిస్తున్న ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేసేందుకు అదనపు మద్యం డిపోలను ఏర్పాటు చేయనుంది. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే సరుకును డిపోల్లో ఉంచేందుకు ఆగమేఘాల మీద రాష్ట్రంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లో 24 మద్యం డిపోలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో తొమ్మిది ఏర్పాటు కానున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2016–17)లో రూ. 13,640.22 కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే(డిసెంబర్ 1నాటికి) మద్యం అమ్మకాలు రూ. 11 వేల కోట్లు దాటాయి. మార్చి నాటికి మద్యం అమ్మకాలు రూ. 17 వేల కోట్లు దాటాలని లక్ష్యం విధించిన సర్కారు అదనంగా మద్యం డిపోలను ఏర్పాటు చేసి మద్యం షాపులకు అమ్మకాల టార్గెట్లు విధించనుంది. దీనికి తోడు వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉండటం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మద్యం డిపోల ద్వారా అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సర్కారు ఈ ఆలోచన చేస్తోందని పలువురు అధికారులు అంటున్నారు. తమకు అనుకూలంగా ఉండి, పదవీ విరమణ చేసిన ఓ అధికారికి డిపోల పర్యవేక్షణ బాధ్యత అప్పగించడంతో సర్కారు వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మద్యం డిపోలు ఏర్పాటు చేసే ప్రాంతాలివే.. మదనపల్లి(చిత్తూరు జిల్లా), అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కనగానపల్లి, ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా), నంద్యాల(కర్నూలు జిల్లా), గూడూరు(నెల్లూరు జిల్లా), భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా), గాజువాక(విశాఖ జిల్లా), పలాస(శ్రీకాకుళం జిల్లా), బొబ్బిలి(విజయనగరం జిల్లా)లో మద్యం డిపోలు నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు రూ. 50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని తాగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 15 డిస్టిలరీలున్నాయి. వీటి ద్వారా లైసెన్స్డ్ ఉత్పాదక సామర్ధ్యం 2,590 లక్షల ప్రూఫ్ లీటర్ల వరకు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి చీప్ లిక్కర్ టెట్రా ప్యాక్‌లు, బీర్ల కేసుల్ని భారీగానే దిగుమతి చేస్తున్నారు. ఫోన్ కొడితే ఇంటికే మద్యం రాష్ట్రంలో మద్యం సిండికేట్లు ‘మొబైల్ బెల్టు షాపుల’ ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు శ్రీకారం చుట్టాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా మద్యం బాటిళ్లను విక్రయిస్తూ కొత్త పంథా ఎంచుకున్నారు. ఫోన్ కొడితే ఇంటికే మద్యం చేర్చే వ్యాపారం మూడు గ్లాసులు.. ఆరు పెగ్గులు అన్న రీతిలో సాగుతోంది. మద్యం షాపు నుంచి కొనుగోలు చేసే బాటిళ్లపై 13 అంకెల బార్ కోడ్‌తో హాలోగ్రామ్ లేబుల్‌ను తొలగించి అమ్మకాలు చేపడుతున్నారు. బ్యాచ్, హీల్ నంబర్లు లేకపోవడంతో మద్యం బాటిళ్లు ఎక్కడ నుంచి కొనుగోలు చేశారన్నది తెలియడం లేదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 4,380 మద్యం షాపులకు అనుబంధంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూంలు మినీ బార్లులా కొనసాగుతున్నాయి. బెల్టు షాపులపై ఫిర్యాదులకు ప్రభుత్వం 1100 నంబరును ప్రకటించింది. అయితే అదంతా ప్రచారం కోసమేనని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. పలుచోట్ల పాన్ షాపులు, మెడికల్ షాపులు, జనరల్ స్టోర్స్‌లలో కూడా విక్రయాలు జరుగుతున్నాయి. -
ఆరు మద్యం డిపోలకు ఊరట
-
నేడు తెరచుకోనున్న మద్యం డిపోలు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ నోటీసులతో మూడురోజుల క్రితం మూతపడిన ఆరుమద్యం డిపోలు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో గురువారం తెరచుకోనున్నాయి. డిపోల నుంచి మద్యం సరఫరాకు స్వేచ్ఛనిస్తూ హైకోర్టు తెలంగాణ బ్రూవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మద్యం అమ్మకాలపై వచ్చే మొత్తాలను ఉమ్మడి ఖాతాలో జమచేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులొచ్చేదాకా ఉమ్మడి ఖాతాలోని మొత్తాన్ని వినియోగించుకోకూడదని నిర్దేశించింది. సరుకు నిల్వల జాబితాను ఐటీ శాఖకు అందజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. డిపోలు తెరచుకోవడం పట్ల మద్యం వ్యాపారులు హర్షం వ్యక్తంచేశారు. డిపోల మూసివేత కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని వందలాది మద్యం దుకాణాలు, బార్లలో మూడు రోజులుగా మద్యం కొనుగోళ్లు స్తంభించిన విషయం తెలిసిందే. దుకాణాల్లోని స్టాకు నిల్వలు నిండుకున్న కారణంగా మూడురోజులుగా రూ.50 కోట్ల మేర మద్యం అమ్మకాలు తగ్గినట్లు తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఐటీ శాఖ నోటీసులు అందిన వెంటనే ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి హైకోర్టును ఆశ్రయిస్తే మూసివేత ఉండేది కాదని, ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో ఆబ్కారీ శాఖ తక్షణం స్పందించడంతో ఈ పరిస్థితి తలెత్తలేదన్నారు. బుధవారమూ మందు కరువే.. వరుసగా మూడోరోజైన బుధవారం కూడా గ్రేటర్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లలో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. స్టాకు అయిపోయిన వారు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల డిపోల నుంచి కొనుగోలు చే యాలని ఆబ్కారీ శాఖ సూచించడంతో వ్యాపారులు ఆయా జిల్లాలకు పరుగులు తీశారు. -
మద్యం డిపోలకు 24 నుంచి తాళం
-
మద్యం డిపోలకు 24 నుంచి తాళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం డిపోలు 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు డిపోల నుంచి మద్యం స్టాక్ పంపిణీ నిలిపివేయాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటవుతున్న రెండు రాష్ట్రాలు అధికారికంగా జూన్ 2 నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆదాయ వనరైన ఎక్సైజ్ శాఖలో ఆదాయం, అప్పులు, స్థిర చరాస్తుల పంపకాలు పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాల వారీగా పంపకాల్లో సమస్య లేకపోయినా, హైదరాబాద్ కేంద్రంగా 23 జిల్లాల నుంచి వచ్చిన ఎక్సైజ్ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన విభజించాల్సి ఉంది. హైదరాబాద్ పరిధిలో శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల పంపిణీ, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్థిర చరాస్తుల పంపిణీ ప్రక్రియను 58 ః 42 నిష్పత్తిలో ఇప్పటికే దాదాపుగా పూర్తిచేశారు. ఇరు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖల కార్యకలాపాలన్నీ అపాయింటెడ్ డే నుంచే కొనసాగేందుకు డిపోల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. అన్ని జిల్లాల్లోని మద్యం వ్యాపారులకు సమాచారమిచ్చారు. ఈనెల 24 లోగా పది రోజులకు సరిపడా స్టాక్ కొనుగోలు చేయాలని సూచించారు. 24 తరువాత చెల్లించే చలానాలు చెల్లుబాటు కావని స్పష్టంచేశారు. 24 వరకు చలానాలు చెల్లించినవారికి 27వ తేదీ వరకు స్టాక్ అందిస్తామని, ఆ తర్వాత 6వ తేదీ వరకు ఎలాంటి లావాదేవీలు ఉండవని పేర్కొన్నారు. ఆ తర్వాత పంపిణీ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ నిర్ణయాలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, ముందు జాగ్రత్తగానే మౌఖిక సమాచారమిచ్చినట్లు ఏపీబీసీఎల్ సీజీఎం శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు. నేటి నుంచి డిపోల వద్ద క్యూలే! పది రోజులకు పైగా మద్యం పంపిణీ జరగదన్న సమాచారంతో మద్యం వ్యాపారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కనీసం 15 రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొనుగోలు చేయబోయే మద్యానికి చలానాలతో మద్యం దుకాణాలు, బార్ల ప్రతినిధులు ఏపీబీసీఎల్ డిపోల వద్ద క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా (తెలంగాణ, సీమాంధ్ర) ఉన్న 39 డిపోల్లో రోజుకు రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు మద్యం అమ్మకాలు సాగుతాయి. వచ్చే నెల 6 వరకు లావాదేవీలు నిలిచిపోతుండటంతో 24వ తేదీలోగా ఈ నాలుగు రోజుల్లోనే రూ. వెయ్యి కోట్లకు పైగా మద్యం విక్రయించాలని ఏపీబీసీఎల్ నిర్ణయించినట్లు సమాచారం. సర్వర్ల సమస్యపై వ్యాపారుల ఆందోళన ఒకేసారి చలాన్లతో డిపోల ముందు క్యూ క డితే సర్వర్ల సమస్య తలెత్తుతుందన్న ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. గతంలోనూ ఇలాంటి సమస్య తలెత్తిందని అంబర్‌పేటకు చెందిన ఓ బార్ యజమాని ‘సాక్షి’కి తెలిపారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ కొనుగోళ్లపై ఒత్తిడి పెరిగితే సర్వర్లు పనిచేయవని చెప్పారు. ఈ సమస్యను నివారించేందుకే 24 వరకు చలానాలు చెల్లిస్తే, 27 వరకు స్టాక్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఏపీబీసీఎల్ అధికారి ఒకరు చెప్పారు.