
నేడు తెరచుకోనున్న మద్యం డిపోలు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ నోటీసులతో మూడురోజుల క్రితం మూతపడిన ఆరుమద్యం డిపోలు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో గురువారం తెరచుకోనున్నాయి. డిపోల నుంచి మద్యం సరఫరాకు స్వేచ్ఛనిస్తూ హైకోర్టు తెలంగాణ బ్రూవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మద్యం అమ్మకాలపై వచ్చే మొత్తాలను ఉమ్మడి ఖాతాలో జమచేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులొచ్చేదాకా ఉమ్మడి ఖాతాలోని మొత్తాన్ని వినియోగించుకోకూడదని నిర్దేశించింది. సరుకు నిల్వల జాబితాను ఐటీ శాఖకు అందజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
డిపోలు తెరచుకోవడం పట్ల మద్యం వ్యాపారులు హర్షం వ్యక్తంచేశారు. డిపోల మూసివేత కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని వందలాది మద్యం దుకాణాలు, బార్లలో మూడు రోజులుగా మద్యం కొనుగోళ్లు స్తంభించిన విషయం తెలిసిందే. దుకాణాల్లోని స్టాకు నిల్వలు నిండుకున్న కారణంగా మూడురోజులుగా రూ.50 కోట్ల మేర మద్యం అమ్మకాలు తగ్గినట్లు తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఐటీ శాఖ నోటీసులు అందిన వెంటనే ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి హైకోర్టును ఆశ్రయిస్తే మూసివేత ఉండేది కాదని, ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో ఆబ్కారీ శాఖ తక్షణం స్పందించడంతో ఈ పరిస్థితి తలెత్తలేదన్నారు.
బుధవారమూ మందు కరువే..
వరుసగా మూడోరోజైన బుధవారం కూడా గ్రేటర్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లలో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. స్టాకు అయిపోయిన వారు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల డిపోల నుంచి కొనుగోలు చే యాలని ఆబ్కారీ శాఖ సూచించడంతో వ్యాపారులు ఆయా జిల్లాలకు పరుగులు తీశారు.