మద్యం డిపోలకు 24 నుంచి తాళం | liquor-depots-will-be-locked-from-may | Sakshi
Sakshi News home page

Published Tue, May 20 2014 8:46 AM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం డిపోలు 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు డిపోల నుంచి మద్యం స్టాక్ పంపిణీ నిలిపివేయాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటవుతున్న రెండు రాష్ట్రాలు అధికారికంగా జూన్ 2 నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆదాయ వనరైన ఎక్సైజ్ శాఖలో ఆదాయం, అప్పులు, స్థిర చరాస్తుల పంపకాలు పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాల వారీగా పంపకాల్లో సమస్య లేకపోయినా, హైదరాబాద్ కేంద్రంగా 23 జిల్లాల నుంచి వచ్చిన ఎక్సైజ్ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన విభజించాల్సి ఉంది. హైదరాబాద్ పరిధిలో శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల పంపిణీ, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్థిర చరాస్తుల పంపిణీ ప్రక్రియను 58 ః 42 నిష్పత్తిలో ఇప్పటికే దాదాపుగా పూర్తిచేశారు. ఇరు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖల కార్యకలాపాలన్నీ అపాయింటెడ్ డే నుంచే కొనసాగేందుకు డిపోల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. అన్ని జిల్లాల్లోని మద్యం వ్యాపారులకు సమాచారమిచ్చారు. ఈనెల 24 లోగా పది రోజులకు సరిపడా స్టాక్ కొనుగోలు చేయాలని సూచించారు. 24 తరువాత చెల్లించే చలానాలు చెల్లుబాటు కావని స్పష్టంచేశారు. 24 వరకు చలానాలు చెల్లించినవారికి 27వ తేదీ వరకు స్టాక్ అందిస్తామని, ఆ తర్వాత 6వ తేదీ వరకు ఎలాంటి లావాదేవీలు ఉండవని పేర్కొన్నారు. ఆ తర్వాత పంపిణీ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ నిర్ణయాలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, ముందు జాగ్రత్తగానే మౌఖిక సమాచారమిచ్చినట్లు ఏపీబీసీఎల్ సీజీఎం శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement