తెరచాటుకు మద్యం నిల్వలు
నేడు విక్రయానికి వ్యాపారుల సన్నాహాలు
నెల్లూరు(క్రైమ్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. మహాత్ముల త్యాగాలను స్మరించుకునేందుకు అందరూ సమాయత్తమయ్యారు. జాతీయ పండగ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు డ్రైడేగా ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మద్యం దుకాణాలకు సీల్ వేయనున్నారు. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు డ్రైడే రోజు అక్రమంగా విక్రయాలు సాగించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పెద్దఎత్తున మద్యం నిల్వలను దుకాణాల సమీపంలోని గోదాములు, ఇళ్లు, కూల్డ్రింక్ షాపుల్లోకి తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసినా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వ్యాపారులతో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందంతోనే వారు మౌనం దాలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఏటా జాతీయ పండగల సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు సాగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మరోవైపు అధికార పార్టీ నేతలు కూడా కొందరు రంగంలోకి దిగి ఈ ఏడాది వ్యాపారులు నష్టాల్లో ఉన్నారని, డ్రైడే రోజు చూసీచూడనట్లు పోవాలని ఆదివారమే అధికారులకు సూచించినట్లు తెలిసింది.
నిబంధనలు మీరితే చర్యలు: టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ డీసీ
స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా జిల్లాలో డ్రైడే ప్రకటించాం. ఆదివారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మద్యం విక్రయాలు సాగించరాదని ఇప్పటికే వ్యాపారులను ఆదేశించాము. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటాం.