బ్రెగ్జిట్‌పై బ్రిటన్ కోర్టు సంచలన తీర్పు
బ్రిటన్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న బ్రెగ్జిట్ విషయమై థెరిసా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాలన్న బ్రెగ్జిట్ తీర్పును అమలుచేయాలంటే థెరిసా ప్రభుత్వం పార్లమెంటు అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందేనని ఆ దేశ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు అనుమతి లేకుండా లిస్బన్ ట్రిటీకి చెందిన ఆర్టికల్ 50ను ప్రభుత్వం అమలుచేయలేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ హైకోర్టు స్పష్టం చేసింది. బ్రిగ్జిట్ విషయంలో ప్రధాన మంత్రి ఏకపక్షంగా వ్యవహరించే వీలు లేదని, ఈ విషయంలో పార్లమెంటే ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లార్డ్ థామస్ తీర్పు చెప్పారు.
బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ముక్తకంఠంతో నినదిస్తున్న బ్రిటన్ వాసుల్లో ఈ తీర్పు ఆనందాన్ని నింపింది. తీర్పు వెలువడిన వెంటనే బ్రిటన్ కరెన్సీ అయిన పౌండ్ విలువ ఒక్కసారిగా బలపడింది. ఈయూలో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే విషయంపై గత జూన్ 23న జరిగిన రెఫరెండంలో బ్రెగ్జిట్ అనుకూల తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న తీర్పు రావడంతో దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. పౌండ్ బలహీనపడింది. దీంతో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటువేసిన వారు కూడా ఈ పరిణామాలతో తీవ్ర నిరాశ చెందినట్టు తదనంతర సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో వెలువడిన హైకోర్టు తీర్పు బ్రిటన్ రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని థెరిసా ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, ఈయూ నుంచి ఏదైనా సభ్యదేశం వైదొలగాలంటే అది అనుసరించాల్సిన ప్రక్రియకు సంబంధించినదే లిస్బన్ ట్రిటీకి ఆర్టికల్ 50. బ్రెగ్జిట్ తీర్పు నేపథ్యంలో ఈ ప్రక్రియను అనుసరిస్తామని ఇంతవరకు థెరిసా ప్రభుత్వం చెప్పలేదు. వచ్చే ఏడాది మార్చిలోగా బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న బ్రిటన్‌కు ఈ తీర్పు గట్టి ఎదురుదెబ్బ అని, న్యాయపరంగా ఈ తీర్పు వల్ల పలు చిక్కులు ఎదురయ్యే అవకాశముందని పరిశీలకులు చెప్తున్నారు.