List Voters
-
మున్సిపోల్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం జరిగిన పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీలో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు చేయించాలని ఎన్నికల అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళం కారణంగా వేలాది మంది తమ ఓటు ఎక్కడుందో కనుక్కోలేక నెల్లూరులో పోలింగ్ అత్యల్పంగా నమోదైంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహించి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఎన్నికల్లో ఆత్మకూరులో అత్యధికంగా 79.71 శాతం, నెల్లూరులో అత్యల్పంగా 60.32 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసు అధికారి నవదీప్ సింగ్ గ్రేవాల్ పర్యవేక్షణలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు నెల్లూరు సహా అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఎండ వేడిమి కారణంగా ఉదయం 11 గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కేంద్రాలు జనం లేక బోసిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థులు ఆటోలు, ఇతర వాహనాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకుని వచ్చి ఓట్లు వేయించుకోవడానికి నానా పాట్లు పడ్డారు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో అభ్యర్థులు నేరుగా ప్రచారం చేయడంతో ప్రత్యర్థులు అడ్డు చెప్పడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. మూడు గంటలు ఆగిన పోలింగ్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో గందరగోళం ఏర్పడింది. అధికారులు ఆన్లైన్లో ఉంచిన ఓటర్ల జాబితాలో 4 లక్షల 17వేల మందే ఓటర్లు ఉన్నట్లు చూపారు. పోలింగ్ సిబ్బందికి, రాజకీయ పార్టీలకు అందించిన ఓటర్ల జాబితాల ప్రకారం 4 లక్షల 47వేల మంది ఓటర్లు నమోదయ్యారు. ఇందులో కూడా అనేక రకాల అవకతవకలు జరిగాయి. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం 16వ డివిజన్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు అదే డివిజన్లో ఓటు రాగా, ఆయన సతీమణికి వేరే డివిజన్లో ఓటు చేర్చారు. ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు రెండు డివిజన్లలో ఓట్లెలా నమోదయ్యాయో అధికారులకే తెలియాలి. ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలోని తప్పుల తడకపై ఆందోళన వ్యక్తం చేశాయి. జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాంత్ ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దాలని ఆదేశించారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎవరికి ఎక్కడ ఓటుందో? ఏ పోలింగ్ స్టేషన్లో చేర్చారో అర్థం కాక వేలాది మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. నెల్లూరు 54వ డివిజన్లో అధికారులు, రాజకీయ పార్టీలు ఓటర్లకు ఇచ్చిన స్లిప్‌లకు పోలింగ్ స్టేషన్లకు సరఫరా చేసిన ఓటర్ల జాబితాల కు సంబంధమే లేక పోవడంతో పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల గొడవకు దిగారు. దీంతో ఇక్కడ పోలింగ్ ప్రారంభమైన 15 నిమిషాలకే నిలిపి వేసి మళ్లీ ఉదయం 10-30 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో తప్పులపై ఇప్పుడు తామేమీ చేయలేమని పోలింగ్ సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ తమ ఓటు ఎక్కడుందో వెతికి పట్టుకునే ఓపిక లేక వేలాది మంది తీవ్ర నిరసన వ్యక్తం చేసి వెనక్కు వెళ్లారు. ఓటరు జాబితాల తయారీపై అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరి తప్పుల కారణంగానే నగరంలో కనీసం 20 శాతం పోలింగ్ తగ్గినట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో కూడా ఓటర్ల జాబితాలోని తప్పుల వల్ల అనేక మంది పేర్లు గల్లంతయ్యాయి. పోలింగ్ స్టేషన్ల వద్ద జనం ఎన్నికల సిబ్బందితో గొడవకు దిగారు. ఎన్నికల సంఘం ఆగ్రహం నెల్లూరు నగరంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహించినట్లు సమాచారం. ఓటర్ల జాబితా ఇంత గందరగోళంగా మారి వేలాది మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోవడానికి కారకులెవరో సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆయన్ను ఆదేశించింది. -
ఇక బదిలీల పర్వం
ఏలూరు, న్యూస్‌లైన్ :సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. ఓటర్ల జాబితా సవరణ పారదర్శంగా ఉండేలా ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణలో ప్రతక్ష్యంగా, పరోక్షంగా సంబంధముండే రెవెన్యూ, ఇతర శాఖల్లోని అధికారులను బదిలీ చేయటానికి రంగం సిద్ధమవుతోంది. శాఖల వారీగా అధికారుల సమాచారం సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వో) బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. జిల్లాలో 46మంది తహసిల్దార్లు, నలుగురు ఆర్డీవోలు, ఐదుగురు డెప్యూటీ కలెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇదే జిల్లాకు చెందిన వారితో, ఒకేచోట మూడేళ్ల నుంచి పనిచేస్తున్న వారిని సైతం మరో జిల్లాకు బదిలీ చేయనున్నారు. 2009 ఎన్నికల సందర్భంలో ఇంకా ముందుగానే బదిలీలు జరిగాయి. ఈఆర్వో, ఏఆర్వోగా విధులు నిర్వర్తించే వారు సొంత జిల్లాలో పనిచేస్తుంటే.. సాధారణ ఎన్నికల సందర్భంగా వారిని పొరుగు జిల్లాలకు బదిలీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా బదిలీ చేయాల్సిన అధికారులు ఎంత మంది ఉన్నారనే విషయంపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆరా తీస్తున్నారుు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్లెయిమ్‌ల పరిష్కారం పూర్తికాకపోవడంతో బదిలీల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నెల 16న చేపట్టాల్సిన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణను ఎన్నికల సంఘం ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. దీంతో ఫిబ్రవరి మొదటి వారం తరువాత బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల భోగట్టా. దీనికి సంబంధించిన స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లు, తహసిల్దార్ల సమాచారం రాష్ట్ర భూపరిపాలన శాఖ కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో ఉంటుంది. డెప్యూటీ తహసిల్దార్ల సమాచారాన్ని జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది. ముగ్గురు ఆర్డీవోలు, 10 మంది తహసిల్దార్లు బదిలీ అయ్యే అవకాశం జిల్లాలో ముగ్గురు ఆర్డీవో క్యాడర్ అధికారులు, 10 మంది తహసిల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వారు కూడా ఉన్నారు. ఒకే కేంద్రంలో మూడేళ్లుగా పనిచేస్తున్న తహసిల్దార్లలో ఏలూరు తహసిల్దార్తోపాటు మరి కొంతమంది ఉన్నారు. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావును ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. బదిలీలపై తమకెలాంటి సమాచారం లేదన్నారు. ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈఆర్వో, ఏఆర్వో స్థాయి బాధ్యతలు నిర్వర్తించే అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేస్తుందని చెప్పారు.