ఇక బదిలీల పర్వం
Published Fri, Jan 17 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
ఏలూరు, న్యూస్‌లైన్ :సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. ఓటర్ల జాబితా సవరణ పారదర్శంగా ఉండేలా ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణలో ప్రతక్ష్యంగా, పరోక్షంగా సంబంధముండే రెవెన్యూ, ఇతర శాఖల్లోని అధికారులను బదిలీ చేయటానికి రంగం సిద్ధమవుతోంది. శాఖల వారీగా అధికారుల సమాచారం సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్‌వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్‌వో) బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. జిల్లాలో 46మంది తహసిల్దార్లు, నలుగురు ఆర్డీవోలు, ఐదుగురు డెప్యూటీ కలెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇదే జిల్లాకు చెందిన వారితో, ఒకేచోట మూడేళ్ల నుంచి పనిచేస్తున్న వారిని సైతం మరో జిల్లాకు బదిలీ చేయనున్నారు. 2009 ఎన్నికల సందర్భంలో ఇంకా ముందుగానే బదిలీలు జరిగాయి.
ఈఆర్‌వో, ఏఆర్‌వోగా విధులు నిర్వర్తించే వారు సొంత జిల్లాలో పనిచేస్తుంటే.. సాధారణ ఎన్నికల సందర్భంగా వారిని పొరుగు జిల్లాలకు బదిలీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా బదిలీ చేయాల్సిన అధికారులు ఎంత మంది ఉన్నారనే విషయంపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆరా తీస్తున్నారుు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్లెయిమ్‌ల పరిష్కారం పూర్తికాకపోవడంతో బదిలీల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నెల 16న చేపట్టాల్సిన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణను ఎన్నికల సంఘం ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. దీంతో ఫిబ్రవరి మొదటి వారం తరువాత బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల భోగట్టా. దీనికి సంబంధించిన స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లు, తహసిల్దార్ల సమాచారం రాష్ట్ర భూపరిపాలన శాఖ కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో ఉంటుంది. డెప్యూటీ తహసిల్దార్ల సమాచారాన్ని జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది.
ముగ్గురు ఆర్డీవోలు, 10 మంది తహసిల్దార్లు బదిలీ అయ్యే అవకాశం
జిల్లాలో ముగ్గురు ఆర్డీవో క్యాడర్ అధికారులు, 10 మంది తహసిల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వారు కూడా ఉన్నారు. ఒకే కేంద్రంలో మూడేళ్లుగా పనిచేస్తున్న తహసిల్దార్లలో ఏలూరు తహసిల్దార్‌తోపాటు మరి కొంతమంది ఉన్నారు. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావును ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. బదిలీలపై తమకెలాంటి సమాచారం లేదన్నారు. ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈఆర్‌వో, ఏఆర్‌వో స్థాయి బాధ్యతలు నిర్వర్తించే అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేస్తుందని చెప్పారు.
Advertisement