కారెక్కిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
కాంగ్రెస్‌కు మరో షాక్
- టీఆర్ఎస్లో చేరిన నలుగురు కార్పొరేటర్లు
- పీసీసీ కార్యదర్శి, నగర అధ్యక్షురాలు జంప్
- సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక
- చక్రం తిప్పిన ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్ కార్పొరేషన్ : ఇప్పటికే ఎన్నికల పరాభవంతో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్యులు అధికార టీఆర్ఎస్లోకి వలస వెళ్తున్నారు. ఎమ్మెల్సీ టి.భానుప్రసాదరావు తాజాగా గులాబీ గూటికి చేరగా, అదేబాటలో ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగరపాలక సంస్థలోని నలుగురు కార్పొరేటర్లు శనివారం కారెక్కారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ము ఖ్యులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ శ్రే ణుల్లో కలవరం మొదలైంది. మొదటి నుంచి కాం గ్రె స్ పార్టీని నమ్ముకుని, పార్టీ పదవులు, ఇతర హోదా లు అనుభవించిన వారు సైతం పార్టీని వీడుతుండడంతో పార్టీ పరిస్థితి అయోమయంలో పడింది. పార్టీ సీనియర్ నేత పీసీసీ కార్యదర్శి, మాజీ ఏఎంసీ చైర్మ న్, మేయర్ అభ్యర్థిగా 31వ డివిజన్ నుంచి పోటీచేసి గెలుపొందిన యాదగిరి సునీల్‌రావు, ఆయన సతీమ ణి 38వ డివిజన్ కార్పొరేటర్ అపర్ణ, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు,1వ డివిజన్ కార్పొరేటర్ గం ట కళ్యాణిశ్రీనివాస్, 22వ డివిజన్ కార్పొరేటర్ గూ డూరి శారదమురళి టీఆర్ఎస్లో చేరారు.
ఇప్పటికే మే జిక్ ఫిగర్‌ను దాటి పూర్తి మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ బ లం కాంగ్రెస్ కార్పొరేటర్ల చేరికతో మరింత పెరిగింది.
చక్రం తిప్పిన ‘గంగుల’
జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ను పటిష్టం చేసేందుకు, మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నీ తానై నడిపించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో 50 స్థానాలకు 24 స్థానాలను గెలుచుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో పనిచేసిన ఎమ్మెల్యే, మేజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు ఇండిపెండెంట్లు ఇద్దరిని తమ గూటికి చేర్చుకోవడంతో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల చేరికకు కూడా గంగుల చక్రం తిప్పినట్లు సమాచారం.
ప్రతిపక్ష హోదా పోయింది...
కార్పొరేషన్ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు కార్పొరేటర్లు చేజారడంతో కార్పొరేటర్ల సంఖ్య 10కి చేరింది. దీంతో మూడో వంతు మెజారిటీ లేక కార్పొరేషన్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అభివృద్ధి పనులపై సాధారణ సమావేశాల్లో ప్రశ్నించలేని పరిస్థితి వచ్చింది. దీంతో రాబోయే కౌన్సిల్లో తీర్మానాలన్నీ ఏకగ్రీవంగా చేసుకునే అవకాశం టీఆర్ఎస్ దక్కింది.
పదవుల పందేరం కోసమే...
అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న వారు నామినేటెడ్ పదవులు ఆశించే వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారు, ఉద్యమం జరుగుతున్న సమయంలో వచ్చిన ఒడిదొడుకులను తట్టుకుని పార్టీ వెంట నడిచిన వారు టీఆర్ఎస్ చాలామంది ఉన్నారు. అయితే వారంతా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా నామినేటెడ్ పదవులపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇతరపార్టీల నుంచి వచ్చే వారితో విభేదాలు పొడచూపనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు సమన్వయ పరచడం పార్టీ అధిష్టానానికి పెద్ద సవాల్‌గా మారనుంది.