ఆనందం ఆవిరి
వెదురుకుప్పం, న్యూస్‌లైన్: వెదురుకుప్పం మండలంలోని కోణంగిపల్లెకు చెందిన లోకనాథరెడ్డి(40), రామిరెడ్డి(21), ఎర్రగుంటపల్లె వాసి చెంగారెడ్డి(60) తిరుమల రాజపురం సమీపంలో జరిగిన ఓ వివాహానికి శుక్రవారం రాత్రి హాజరయ్యారు. అనంతరం ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు.
చెంగారెడ్డిని ఎర్రగుంటపల్లెలోని ఇంటి వద్ద వదిలేందుకు వెళుతుండగా ఏపీ 26డబ్ల్యూ 2040 నంబర్ గల సుమో ఢీకొంది. ఈ ప్రమాదంలో లోకనాథరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ చెంగారెడ్డి, రామిరెడ్డి తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. కార్వేటినగరం మండలం ఎర్రమరాజుపల్లె వాసి సుమో డ్రైవర్ గుణశేఖర్, నాగరాజు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో సుమో కాలువ వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జు అయింది.
కోణంగిపల్లెలో విషాదఛాయలు
ఒకే గ్రామానికి చెందిన లోకనాథరెడ్డి, రామిరెడ్డి రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో కోణంగిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను ఓదార్చడం ఎవరి తరమూ కా లేదు. రామిరెడ్డికి రెండేళ్లక్రితం వివాహమైంది. ఓ కూతురు ఉంది.