దుబాయ్: ఏపీ ప్రభుత్వం మూడు కీలక ఒప్పందాలు
సాక్షి, అమరావతి: దుబాయ్ ఎక్స్‌పోలో రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎంఓయూలు కుదుర్చుకుంది. వీటిలో రెండు గవర్నమెంట్ టూ బిజినెస్ (జీ2బీ), మరొకటి బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ) ఒప్పందాలు చేసుకుంది.
► లండన్‌కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3 వేల కోట్ల విలువైన (జీ 2 బీ) ఒప్పందం జరిగింది. ప్రజా రవాణాకు సంబంధించి డీజిల్ వాహనాలను తీర్చిదిద్దే ఈ పరిశ్రమను వైఎస్సార్ జిల్లా జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఏర్పాటుచేయనున్నారు.
► అలాగే, రిటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ పేరుతో 25 ఏళ్లుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్‌తో కూడా జీ 2 బీ ఒప్పందం చేసుకుంది. రూ.150 కోట్ల విలువైన 25 రిటైల్ ఔట్లెట్ల ఏర్పాటుకు ఈ రీజెన్సీ గ్రూప్‌ముందుకొచ్చింది. అనంతపురం, కడప, మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు, హిందూపురం, ప్రాంతాలలో పంపిణీ కేంద్రాలు, స్పైసెస్ అండ్ పల్సెస్ ప్యాకేజీ యూనిట్లు ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.
► ఇక విశాఖలోని ఫ్లూయెంట్ గ్రిడ్ అనే ఎస్సార్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్‌లో భాగమైన ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో బీ టూ బీ ఒప్పందం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ పేరుతో విశాఖలో కొత్తగా 300 హై ఎండ్ ఐటీ ఉద్యోగాలిచ్చే కంపెనీతో మరో ఒప్పందం కుదిరింది. ఎస్సార్ గురేర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ బోర్డు సభ్యులు మాజీదల్ గురేర్, ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థకు చెందిన సమయ్ మంగళగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
► ఇలా పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం పర్యటన దుబాయ్‌లో కొనసాగుతోంది.