తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర లేదు
సాక్షి, తిరుపతి: తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర లేదని, అది కేవలం ప్రచారం మాత్రమేనని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. 1969లో చెన్నారెడ్డి సీఎం పదవి కోసం తెలంగాణ ఉద్యమం చేపట్టగా అప్పటి నుంచి 2000 వరకు ఆ ఊసే లేదని, ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. పార్టీ తిరుపతి కార్యాలయంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ స్వీట్లు, మిఠాయిలకు బదులు కారప్పొడిని పంచి పెట్టారు.
సీమాంధ్రుల కళ్లలో కొట్టేందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దాన్ని పంపారని తెలి పారు. కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రపై అవగాహన లేని కేసీఆర్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోస్తాంధ్ర డబ్బుతో, రాయలసీమ పన్నులతో హైదరాబాద్ నగరాన్ని నిర్మించారని తెలిపారు. స్వాత ంత్య్రం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని అన్నారు. 1946 నుంచి 1956 వరకు అనేకమంది రజాకార్లు నిజాం సంస్థానం చేతిలో బలయ్యారని, అప్పటి కేంద్ర హోం మంత్రిగా ఉన్న పటేల్ నిజాం సంస్థానాన్ని దేశంలోకి విలీనం చేసుకున్నారని పేర్కొన్నారు.
బూర్గుల రామకృష్ణారావు, సురవ రం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి లాంటి వారు ఆంధ్ర ప్రదేశ్‌లోకి తెలంగాణ ను తీసుకున్నారన్నారు. నేటి తెలంగాణ మంత్రుల తాతలు ఆనాడు పట్వారీలుగా ఉంటూ తెలంగాణను పీల్చి పిప్పి చేశారని, వారి వారసులు నేడు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లలో తెలంగాణలో 310 శాతం పాఠశాలలు అభివృద్ధి చెందాయని చెప్పారు. అదే రాయలసీమలో 72, కోస్తాలో 165 శాతం మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ లో నీటి పారుదలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయగా రాయలసీమ, కోస్తాంధ్రలో దారుణమైన పరిస్థితి ఉందని అన్నారు.
రాయలసీమ వాసులు 1983లో పోరాటాలు జరిపినా అది మెరుగైన సాగునీటి కోసమేనని తెలిపారు. 2004లో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఎస్సార్సీ వేస్తామని చెప్పి టీఆర్ ఎస్తో పొత్తు పెట్టుకోగా, చంద్రబాబునాయుడు పూర్తిగా విభజనకు అంగీకరిస్తూ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని వివరించారు. వైఎస్సార్ సీపీ ప్లీనరీలోనూ అందరికీ సమన్యాయం చేయాలని కోరామని, తెలంగాణకు అనుకూలమని చెప్పలేదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నగర కన్వీనరు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనరు కుసుమ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.