పోరుబాట వీడి... లొంగుబాటు
ఎస్పీ ఎదుట లొంగిపోరుున
మావోయిస్టు నిమ్మల సారమ్మ
పాతికేళ్ల అజ్ఞాత జీవితానికి తెర
వరంగల్ క్రైం : సీపీఐ(మావోయిస్టు) పశ్చిమ బస్తర్ ఏరియా డివిజనల్ కమిటీ సభ్యురాలు, క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం నాయకురాలు, దండకారణ్య స్పెషల్‌జోన్ సబ్‌కమిటీ సభ్యురాలు నిమ్మల సారమ్మ అలియాస్ జ్యోతి అలియాస్ శారద బుధవారం ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా ఎదుట లొంగిపాయారు. మావోయిస్టు పార్టీలో ఏర్పడిన అంతర్గత విబేధాలు, అనారోగ్య సమస్యలతో లొంగిపోయినట్లు సారమ్మ తెలిపారు. ఈ లొంగుబాటుకు సంబంధించి బుధవారం హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా వివరాలు వెల్లడించారు. జనగామ మం డలం షామీర్‌పేటకు చెందిన నిమ్మల సారమ్మ అలియాస్ జ్యోతి అలియాస్ శారద తన 12వ ఏటనే పీపుల్స్‌వార్ కొరియర్ అయిన తిల్జేరి కుమారస్వామి అలియాస్ టీకే, మల్లారెడ్డి అలియాస్ సత్తెన్న ప్రోద్బలంతో పార్టీ సాహిత్యానికి ఆకర్షితురాలై 1990-91లో ఏటూరునాగారం-మహవ్దే పూర్ ఏరియా కమిటీ దళంలో సభ్యురాలిగా చేరి కొంతకాలం తర్వాత ఏటూరునాగారం-గుండాల దళ సభ్యురాలిగా పనిచేసింది. 1995లో ఏటూరునాగారం ఏరియా కమి టీ కార్యదర్శి ముప్పిడి సాంబయ్య అలి యాస్ జంగి అలియాస్ వికాస్‌ను వివాహం చేసుకుంది. 1998లో తొలిసారి ఐదుగురు మహిళా సభ్యులతో ఏర్పాటు చేసిన ఏటూరునాగారం మహిళాస్క్వాడ్కు సారథ్యం వహిం చింది. 2001లో నేషనల్ పార్క్ ఏరియా ఎల్ఓసీలో ఓసిఎం స్థాయిలో కమాండర్‌గా పనిచేసింది. 2005లో పాక హన్మంతు అలియాస్ ఊక గణేష్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న మద్దెడు ఏరియా కమిటీకి సెక్రటరీగా బదిలీ చేశారు.
2008లో డివిజనల్ కమిటీ మెంబర్‌గా పదోన్నతి పొంది అనంతరం పశ్చిమ బస్తర్ డివిజనల్లో క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘానికి నాయకురాలిగా వ్యవహరించింది. 2009లో మహిళా సబ్‌కమిటీకి సభ్యురాలిగా పనిచేసిన సారమ్మకు చాలా మంది కేంద్రకమిటీ సభ్యులతో పరిచయూలు ఉన్నారుు.
నిమ్మల సారమ్మ అలియాస్ జ్యోతి పాల్గొన్న నేరాలు..
1997లో కాంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లందుల వెంకటయ్యను చంపిన కేసులో నిందితురాలు.
1998లో మేకలగుట్ట గ్రామానికి చెందిన వీఆర్వో హంపిరాళ్ల శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితురాలు.
1998 జూన్ 10న పస్రా మండలం మొట్లగూడెం వద్ద పోలీసులకు అంబుష్ వేసి మందుపాతర పేల్చిన సంఘటనలో ఎస్సై గోపిచంద్‌తో పాటు 8 మంది పోలీసులు మరణించారు. ఈ సంఘటనలో గాజర్ల గణేష్ అలియాస్ ఉదయ్, ముప్పిడి సాంబయ్య అలియాస్ జంగు అలియాస్ వికాస్‌తోపాటు సారమ్మ పాల్గొంది.
2009లో మద్దేడు ఏరియా భూపాలపట్నం అటవీప్రాంతంలో అంబుష్ వేసి మందుపాతర పేల్చగా ఐదుగురు సీఆర్పీఎఫ్ జవానులు చనిపోగా ఒక ఏకే-47, 3 ఇన్ససన్ రైఫిల్లు ఎత్తుకెళ్లిన సంఘటనలో సారమ్మ పాల్గొంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఏర్పడిన అంతర్గత విబేధాలు, పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, తన ఆరోగ్య సమస్యలతోపాటు తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన నక్సల్స్‌కు అందిస్తున్న ప్రోత్సాహకాలకు ఆకర్షితురాలై జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకుని ఎస్పీ ఎదుట బుధవారం లొంగిపోయింది. సారమ్మకు తక్షణ సాయంగా రూ.5 వేలు అందించారు. ఆమెపై ఉన్న రూ.5 లక్షల రివార్డును త్వరలోనే అందజేయనున్నట్లు తెలిపారు.