lord rama marriage
-
భద్రాద్రి రామయ్య పెళ్లికి రండి
భద్రాచలం: భద్రాచలంలో ఈనెల 10, 11వ తేదీల్లో జరిగే సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు హాజరు కావాలని దేవస్థానం అధికారులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులను ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఈవో శివాజీ ఆధ్వర్యంలో వేదపండితులు శాలువాతో సత్కరించి ఆహ్వానపత్రాన్ని అందించారు. అలాగే, ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు రామయ్య వివాహా ఆహ్వానపత్రిక అందచేసి వేదాశీర్వచనం అందజేశారు. స్థానాచార్యులు స్థలశాయి, ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అర్చకులు మురళీ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. గవర్నర్‌కు కల్యాణోత్సవ ఆహ్వాన పత్రిక అందజేస్తున్న ఆలయ అధికారులు, అర్చకులు సీఎం కేసీఆర్‌కు యాదాద్రీశుడి ఆశీస్సులు యాదగిరిగుట్ట: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌కు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులను ఆలయ ఆర్చకులు అందజేశారు. శనివారం ఉదయంప్రగతిభవన్‌లో యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, వేద పండితుడు శ్రీనివాస్‌శర్మ వెళ్లి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానాలయం ఉద్ఘాటన తరువాత భక్తుల రాక ఎలా ఉందనే అంశాన్ని కేసీఆర్ ఈవో గీతారెడ్డితో చర్చించినట్లు తెలిసింది. -
రాజన్న సన్నిధిలో రాములోరి పెళ్లి
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు 3 లక్షల మందికిపైగా భక్తులు శుక్రవారం రాత్రికే వేములవాడకు చేరుకోవడంతో అధికారులు రాత్రంతా దర్శనాలకు అనుమతించారు. ప్రభుత్వం తరఫున ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు పట్టువస్త్రాలు సమర్పించారు. ఎదుర్కోళ్ల సమయంలో వధూవరుల పక్షాన కట్నకానుకలు మాట్లాడుకున్నారు. రూ.1.12 కోట్ల మేర కట్నాల ఒప్పందం కుదిరింది. ఉదయం 11.40 గంటలకు కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కన్యాదాతలుగా పార్థసారథి- కరుణశ్రీ దంపతులు వ్యవహరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివపార్వతులు నెత్తిన జీలకర్ర, చేతిలో త్రిశూలం పట్టుకుని అక్షింతలు చల్లుకుంటూ రాజరాజేశ్వరుడిని వివాహమాడారు. కల్యాణం అనంతరం దర్శన సమయంలో తోపులాట జరిగింది. భక్తులు తాగునీటికి తిప్పలుపడ్డారు. కాగా, రాములోరి కల్యాణం సందర్భంగా వేములవాడలో రాజన్నను శివపార్వతులు వివాహం చేసుకోవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తుండగా, ఈసారి తమకు ప్రాధాన్యత కల్పించలేదని, ఇలా చేస్తే వచ్చే ఉత్సవాలకు తాము వేములవాడకు రామని జోగిని శ్యామల అధికారుల తీరుపై మండిపడ్డారు.