Lord venkateswara swamy kalyanam
-
అట్లాంటాలో అంగరంగ వైభవంగా శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటా నగరంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా), APNRT అద్వర్యంలో HTA వారి సహకారంతో జులై 9వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. టీటీడీ కళ్యాణం కార్యనిర్వాహకవర్గం సభ్యులు శ్రీనివాసులు రెడ్డి కొట్లూరి, నంద గోపి నాథ రెడ్డి, HTA కార్యవర్గ కమిటీ, వారి మిత్ర బృందం, వాలంటీర్ల సహకారంతో స్వామి వారి కళ్యాణోత్సవం సజావుగా సాగేలా సమన్వయం చేసారు. తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు, వేదపండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్య ధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. హిందూ టెంపుల్ అఫ్ అట్లాంటా కార్య వర్గం వారు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి, తరించారు, భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ వేడుకల్ని నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా తమ స్వస్థలాలకు రాలేక, స్వామివారి దర్శనానికి నోచుకోని వేలాది మంది భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. దాదాపుగా 100 సభ్యులతో కూడిన గాన బృందం ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలతో ఈ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. గాయనీ గాయకులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీదర్ కొరసపాటి, నాటా నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డితో పాటు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ ఏఈఓ బి. వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ యూఎస్ఏ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ నంద గోపినాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎనిమిదేళ్ల బాలికతో శ్రీవారి కల్యాణోత్సవం
సాక్షి, రాయదుర్గం టౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన ప్రసిద్ధ ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దాదాపు 50 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా స్వామికి ఎనిమిదేళ్ల బాలికతో వివాహం జరిపించారు. ఇలా చేయడం వల్ల ఆ బాలికకు సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడనేది భక్తుల నమ్మకం. ఏటా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. ఈ ఏడాది రాయదుర్గానికి చెందిన అరవా ప్రకాష్, యశోద దంపతుల కుమార్తె రేఖతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరపున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (రేఖ) ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా మంత్రోచ్ఛారణల మధ్య పురోహితులు, వేదపండితుల ఆధ్వర్యంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ముంబైలో శ్రీవారి కల్యాణ రజతోత్సవాలు
ముంబై: ఠాణే జిల్లా డోంబివలిలోని ‘ఆంధ్ర కళా సమితి’ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ రజత్సోవాలు జరగనున్నాయి. గత 24 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఈసారి రజతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తూర్పు డోంబివలి, గర్ద సర్కిల్ వద్ద ఉన్న కళ్యాణ్-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్ (కేడీఎంసీ స్పోర్స్ట్ కాంప్లెక్స్)లో స్వామివారి కళ్యాణ రజతోత్సవాలు ఈ నెల 26, 27న (శని, ఆదివారాల్లో) జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో మాదిరి పూజా కార్యక్రమాలుంటాయి. ప్రస్తుతం ‘ఆంధ్ర కళా సమితి’ సంస్థకు 600 మందిపైగా సభ్యులున్నారు. సమితి ప్రస్తుత అధ్యక్షుడు ఎ శంకర్రావు, ప్రధాన కార్యదర్శులు కేవీ నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు కేవీ రమణా రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర కుమార్, కోశాధికారి విజయ్‌మోహన్ తదితరులు ఉన్నారు.