అతివేగానికి ఇద్దరు బలి
జైపూర్(చెన్నూర్): రెండు లారీల అతివేగం కారణంగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. అన్నయ్య ఇంటికని బయలుదేరిన చెల్లెలు తిరిగిరానికి లోకాలకు వెళ్లిపోయింది. మహిళను ఢీకొన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్ మరణించాడు. జైపూర్ మండలం ఇందారం–1ఏ గని క్రాస్ రోడ్డు వద్ద గల రాజీవ్ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇందారం గ్రామం దొరగారిపల్లెలో నివాసం ఉంటున్న పేర్ల శ్రీమతి(55)అన్నయ్య పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. అతడి వద్దకు వెళ్లేందుకు దొరగారిపల్లె నుంచి రాజీవ్ రహదారిలో ఐకే–1ఏ క్రాస్ రోడ్డు వరకు వచ్చింది. శ్రీరాంపూర్ నుంచి అతివేగంగా గోదావరిఖని వెళ్తున్న టిప్పర్ శ్రీమతిని బలంగా ఢీకొట్టింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో తల పగిలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.
టిప్పర్ వెనుకాల మరింత వేగంగా మరో లారీ వచ్చింది. వెనుక నుంచి టిప్పర్‌ను బలంగా ఢీకొని అదుపు తప్పింది. అవతలి రోడ్డుపైకి దూసుకపోయింది. లారీ ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవర్ శ్రీనివాస్(21) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అటువైపు వెళ్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, స్థానికులు, ప్రయాణికులు కలిసి శ్రీనివాస్‌ను బయటకు తీశారు.
108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు రెఫర్ చేయగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీమతి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరులా రోదించారు. ఆమె భర్త రమణయ్య రెండేళ్ల క్రితం చనిపోయాడు. కాగా రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
సంఘటన స్థలానికి రెండో ఎస్సై గంగరాజగౌడ్, ఏఎస్సై గంగన్న, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌ను నియంత్రించారు. శ్రీమతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.