lorry acident
-
‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’
సాక్షి, ఘట్కేసర్: ‘మేము పోలీసులం.. కేసు నుంచి తప్పిస్తాం’అని లంచం తీసుకున్న వారిని ఘట్కేసర్ పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న కాళేశ్వరం నుంచి ఘట్కేసర్కు (టీఎస్ 07యూఈ 5355) లారీ ఇసుక లోడుతో వస్తుండగా ఎన్‌ఎఫ్‌సీనగర్ వంతెన వద్ద కారును ఢీకొట్టింది. సంఘటన స్థలానికి ఘట్కేసర్ ప్యాట్రోలింగ్ మొబైల్ వ్యాన్–1 వెళ్లింది. ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్యాట్రోలింగ్ డ్రైవర్ హోంగార్డు శివ లారీని పక్కకు జరపాలని ఆదేశించారు. లారీ డ్రైవర్ జాజుల నర్పింహ లారీని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు. అదే సమయంలో వనస్థలిపురంలో 2010లో హోంగార్డుగా విధుల్లోకి చేరి 2014 నుంచి గైర్హాజరు అవుతున్న ఏ–1 బాల్‌రాజ్(35), ఏ–2 శ్రీను (డైవర్)తో కలిసి ఓ ఆటోను విడిపించాలని మాట్లాడడానికి ఏ–3 హోంగార్డు శివకు ఫోన్ చేశాడు. వెంటనే లారీ దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించాలని వారిద్దరికి శివ ఆదేశించారు. వారిరువురు లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఘట్కేసర్ పోలీసులమంటూ వివరాలు సేకరించి శివకు అందించారు. చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి.. డ్రైవర్ ఫిర్యాదుతో హోంగార్డు సస్పెండ్.. ప్రమాదాన్ని ఎవరూ గమనించలేదని డబ్బులు ఇస్తే తప్పిస్తామని వారు లారీ డ్రైవర్‌ను డిమాండ్ చేశారు. డ్రైవర్ రూ.20వేలు బాల్‌రాజ్‌కు ఇచ్చాడు. అనంతరం శివకు రూ.15 వేలు అందజేసి మిగిలినవి తన దగ్గర ఉంచుకున్నాడు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు సెల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసి ఘట్కేసర్కు చెందిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా ఉన్నతాధికారులు హోంగార్డు శివను (ఏ–3) విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
మహబూబ్‌నగర్ జిల్లాలో హైవేపై ట్రక్కు బీభత్సం
సాక్షి, జడ్చర్ల: ఓ ట్రక్కు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ధాన్యం అమ్ముడుపోక తిరిగి వెళుతున్న ట్రాక్టర్‌ను, ఎదురుగా వస్తున్న బైక్, స్కూటీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు విస్తరణ పనులకు మెటీరియల్‌ను అన్లోడ్ చేసి వస్తున్న కాంక్రీట్ రెడీమిక్స్ ట్రక్కు.. ముందుగా ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ ట్రక్కును నియంత్రించకపోవడంతో అదే వేగంతో ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను సైతం ఢీ కొట్టి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ బాలయ్యకు తోడుగా వచ్చిన సురేశ్ (20) ధాన్యం బస్తాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వస్తున్న రవికుమార్ (20), స్కూటీపై వస్తున్న బన్రెడ్డి వెంకటేశ్వర్రావు (32), అతని తండ్రి (52) సైతం దుర్మరణం చెందారు. ట్రాక్టర్ డ్రైవర్ బాలయ్య, ట్రక్కు డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. కాగా, మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
అమ్మో.. రాధిక చౌరస్తా!
సాక్షి, హైదరాబాద్: అదుపు తప్పిన జీహెచ్ఎంసీకి చెందిన చెత్త తరలించే టిప్పర్ ఓ శానిటరీ సూపర్వైజర్ను బలితీసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్‌లో నివసించే జీడికంటి సౌందర్య(35) కాప్రా సర్కిల్ కార్యాయలంలో పారిశుద్ధ్య విభాగంలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త అశోక్ పెయింటర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. రోజూలానే మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన సౌందర్య ఈసీఐఎల్‌లో కార్మికుల హాజరును నమోదు చేసి అక్కడి నుంచి తన స్కూటీ(టీస్ 08 ఈఎక్స్ 4887)పై భవానీనగర్ కాలనీకి బయలుదేరారు. ఈ క్రమంలో రాధిక చౌరస్తా నుంచి సాకేత్ వైపుగా వెళ్తుండగా వెనుక నుంచి అదుపుతప్పిన వేగంతో వచ్చిన జీహెచ్ఎంసీ టిప్పర్ (టీఎస్ 08 యూఏ 5203) స్కూటీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోయిన సౌందర్యపై నుంచి టిప్పర్ వెనుక చక్రాలు వెళ్లడంతో ఆమె శరీరం పూర్తిగా ఛిద్రమై అక్కడిక్కడే మృతిచెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా టిప్పర్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్ నరేందర్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నవంబర్‌లో రాధిక చౌరస్తా సిగ్నల్ వద్దే ఇదే స్పాట్లో టీఎస్ఐఐసీ కాలనీకి సరిత అనే మహిళ వెళ్తున్న స్కూటీని ఇదే తరహాలో చెత్త టిప్పర్ వెనుక నుంచి ఢీ కొట్టిన విషయం పాఠకులకు విదితమే. కిందపడిపోయిన సరితపై టిప్పర్ చక్రాలు వెళ్లడంతో ఆమె కూడా మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. మరో ప్రమాదంలో... ఇద్దరు స్నేహితులు కలిసి రాత్రి పొద్దు పోయేదాగా మద్యం తాగారు. మత్తులో ఉన్న వారు సిగరెట్ కోసమని బైక్‌పై బయలుదేరారు. బైక్ కాస్తా అదపుతప్పి రోడ్డు పక్క డివైడర్‌కు ఢీ కొనడంతో ఒకరు మృతిచెందగా మరొకరు గాయాలతో బయట పడ్డ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరేడ్మెట్ ఓల్డ్ పోలీస్‌స్టేషన్ సమీపంలో నివసించే దుర్గం భిక్షపతి ఆటోడ్రైవర్. అతని పెద్ద కుమారుడు దుర్గం సాయికిరణ్(26) డిగ్రీ మధ్యలోనే మానేసి ఖాళీగా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో భగత్‌సింగ్ కాలనీకి చెందిన మిత్రుడు సాయిరాజ్ వద్దకు వెళ్లాడు. ఇద్దరు కలిసి రాత్రి పొద్దు పోయేవరకు మద్యం సేవించారు. అప్పటికే ఒంటి గంట దాటడంతో సమీపంలో పాన్షాపులన్నీ మూసేశారు. మత్తులో ఉన్న వారు సిగరెట్ కోసమని ప్యాషన్ బైక్(ఏపీ 13 హెచ్ 0982)పై ఈసీఐఎల్ చౌరస్తాకు బయలుదేరారు. ఈ క్రమంలో నార్త్ కమలానగర్ మూల వద్ద అదుపు తప్పిన బైక్ రోడ్డు పక్క డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న సాయికిరణ్‌గౌడ్ పక్కనే గోడపైకి ఎగిరిపడి అక్కడిక్కడే మృతిచెందాడు. వెనుక ఉన్న సాయిరాజ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రాధిక హత్య కేసు: వీడిన మిస్టరీ..) -
‘అనంత’ విషాదం
తనకల్లు/ నల్లచెరువు: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 42వ జాతీయ రహదారి నెత్తురోడింది. మినీ బస్సును లారీఢీకొట్టడంతో.. ఏడుగురు దుర్మరణం చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తనకల్లు– నల్లచెరువు మండలాల సరిహద్దు ప్రాంతమైన ఎర్రగుంటపల్లి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం 7 గంటలకు 20 మందికి పైగా ప్రయాణికులతో మినీ బస్సు తనకల్లు నుంచి కదిరికి బయలుదేరింది. అయితే ఎర్రగుంటపల్లి చెరువు మలుపు వద్దకు రాగానే అనంతపురం నుంచి మదనపల్లి వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి మినీ బస్సును బలంగా ఢీ కొంది. దీంతో మినీ బస్సు ముందుభాగం నుజ్జనుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో మినీ బస్సులో ఉన్న తనకల్లుకు చెందిన పండ్ల వ్యాపారి ఖాదర్‌బాషా (43), చిట్‌ఫండ్ ఉద్యోగి నగేష్ (32), భారతమ్మ (44), కాటేపల్లికి చెందిన మహబూబ్‌బాషా (55), ఎన్పీ కుంట మండలం యాదుళోళ్లపల్లి జయమ్మ (48) అక్కడికక్కడే మృతి చెందారు. మినీ బస్సు– లారీ మధ్యలో చిక్కుకున్న కాటేపల్లి మహబూబ్‌బాషా మృతదేహాన్ని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఎన్పీకుంట మండలం యాదుళోళ్లపల్లికి చెందిన రామచంద్రారెడ్డి (58) కదిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో గుర్తు తెలియని వ్యక్తి (55) తనకల్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 10 మందిలో తనకల్లుకు చెందిన బాబ్జాన్, రాఘవేంద్ర, శ్రీనివాసులు, మస్తాన్‌వలి, రెడ్డిశేఖర్, మహబూబ్‌బాషా, శివ గంగాదేవి, గుంజువారిపల్లి దామోదర్, మించలివారికోట శ్రీనివాసులు, కొక్కంటి క్రాస్‌కు చెందిన తిరుపాల్ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కదిరి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, రూరల్ సీఐ రెడ్డెప్ప, ఎస్ఐలు రంగడు, రమేష్‌బాబు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లచెరువు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు తనకల్లు మండలం వాసులు మండల కేంద్రమైన తనకల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురిలో నలుగురు తనకల్లుకు చెందినవారే ఉన్నారు. అలాగే తనకల్లుకే చెందిన మరో 10 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండటంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆడబిడ్డలను చదివించాలని తనకల్లు స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉండే ఖాదర్బాషాకు భార్య అమ్మజాన్తో పాటు నగీనా, హర్షియా సంతానం. ఖాదర్‌బాషా సైకిల్‌పై పండ్ల వ్యాపారం చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. శుక్రవారం కదిరిలో పండ్లు కొనుగోలు చేసేందుకు మినీ బస్సులో బయల్దేరాడు. అయితే రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇంటి పెద్దను కోల్పోయానని, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదని భార్య అమ్మజాన్ కన్నీటి పర్యంతమైంది. -
లారీని ఓవర్ టేక్ చేయబోయి..
పెనుబల్లి: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక డ్రైవర్ మృతిచెందాడు. మరో డ్రైవర్‌కు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వైజాగ్ పోర్ట్ నుంచి యూరియా లోడ్‌తో సూర్యాపేట వైపు లారీ వెళుతోంది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి పవర్ ప్లాట్ ముందున్న బ్రిడ్జి వద్ద, ఎదురుగా ఖమ్మం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తున్న లారీ, మరో లారీని ఓవర్ టేక్ చేస్తూ వేగంగా వచ్చి యూరియా లోడ్ లారీని ఢీ కొంది. యూరియా లోడ్ లారీ డ్రైవర్ కట్టా రామకృష్ణ (27) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ లారీ ముందున్న అద్దం పగిలింది. క్లీనర్ కొలిదల రాజు, క్యాబిన్ లోపలి నుంచి పగిలిన అద్దం నుంచి బయటకు ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికితరలించారు. మృతిచెందిన కట్టా రామకృష్ణది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. యూరియా లోడ్ లారీ క్లీనర్ కొలిదల రాజు ఫిర్యాదుతో కేసును ఎస్సై తోట నాగరాజు దర్యాప్తు చేస్తున్నారు. రెండు లారీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరకగూడెం: రోడ్డు ప్రమాదంలో గ్రామీణ వైద్యుడు మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.... కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామస్తుడైన గ్రామీణ వైద్యుడు షేక్ అబ్దుల్ రహీమ్,, సహచర గ్రామీణ వైద్యుడైన గొల్లగూడెం గ్రామస్తుడు సారంగపాణి కలిసి గొల్లగూడెం నుంచి ద్విచక్ర వాహనంపై మణుగూరు వెళ్తున్నారు. కలవలనాగారం గ్రామ మూలమలుపు వద్ద వీరి వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తలకు తీవ్ర గాయాలతో షేక్ అబ్దుల్ రహీమ్(43) రోడ్డుపై పడిపోయాడు. అక్కడికక్కడే మృతిచెందాడు. సారంగపాణికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ రహీమ్‌కు భార్య షేక్ మెహబూబి, ఇద్దరు కుమార్తెలు అతహర్, ఆఫ్రీన్, ఇద్దరు కుమారులు అర్షద్, అసద్ ఉన్నారు. ప్రమాద స్థలాన్ని ఏడూళ్ల బయ్యారం సీఐ బి.అశోక్ పరిశీలించారు. మృతుని సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సారంగపాణి పరిస్థితి విషమించినట్టు సమాచారం. -
లారీ బీభత్సం... ముగ్గురి దుర్మరణం
సాక్షి, ఖమ్మం: ఖమ్మ జిల్లా వైరా మండలం పినపాక స్టేజీ గ్రామం వద్ద ఓ లారీ గురువారం ఉదయం బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ జనాలపైకి దూసుకురావడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఖమ్మం వైపు నుంచి వస్తున్నలారీ వేగంగా వస్తూ రోడ్డుపక్కన ఉన్న వారిపైకి దూసుకొచ్చింది. దీంతో సోమరాజు, దావీదు, అమర్లపూడి దామిని(5) అనే చిన్నారి మృతిచెందారు. కాగా... లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. తప్పతాగిన డ్రైవర్ లారీ అతివేగంగా నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వైరా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
లారీ బీభత్సం: ఇద్దరికి తీవ్ర గాయాలు
మేడ్చెల్: మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తాలో మంగళవారం ఉదయం ఒక లారీ బీభత్సం సష్టించింది. వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాక ఎదురుగా వెళుతున్న స్కూటర్‌ను డీకొని పక్కనున్న ఎన్వీఆర్ పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో స్కూటర్‌పై వెళుతున్న యూనస్, ఖాజా అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని 108లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.